Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    27—ఎఫెసు

    కొరింథులో అపోల్లో బోధిస్తున్న తరుణంలో పౌలు తన వాగ్దానం మేరకు ఎఫెసుకు తిరిగి వెళ్లాడు. స్వల్పకాలం యెరూషలేమును సందర్శించి ఆ మీదట తన సేవ ప్రారంభంలో పనిచేసిన అంతియొకయలో కొద్దికాలం గడిపాడు. అక్కడనుంచి చిన్న ఆసియా గుండా ప్రయాణం చేసి “గలతీ ప్రాంతమందును ఫ్రుగియ యందును” తాను స్థాపించిన సంఘాల్ని సందర్శిస్తూ విశ్వాసుల్ని బలోపేతుల్ని చేస్తూ సంచరించాడు (అ.కా. 18:23).AATel 199.1

    అపొస్తలుల కాలంలో చిన్న ఆసియాలోని పశ్చిమభాగం ఆసియాలో రోమా రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాజధాని నగరం ఎఫెసు గొప్ప వాణిజ్య కేంద్రం. దాని ఓడరేవు వాణిజ్య ఓడలతో కిక్కిరిసి ఉండేది. ఆయా దేశాలనుంచి వచ్చిన ప్రజలతో ఆనగర వీధులు కిటకిటలాడేవి. కొరింథులోలాగే ఎఫెసులో కూడా చక్కని సువార్త సేవ జరిగే సూచనలు కనిపించాయి.AATel 199.2

    యూదులు ఇప్పుడు నాగరిక ప్రపంచం నలుమూలలా చెదిరిపోయి ఉన్నారు. మెస్సీయా వస్తాడని సామాన్యంగా కనిపెడ్తూ ఉన్నారు. బాప్తిస్మమిచ్చే యోహాను బోధిస్తున్నప్పుడు సాంవత్సరిక పండుగల నిమిత్తం యెరూషలేమును సందర్శిస్తున్న వారిలో చాలామంది యోహాను బోధ వినటానికి యోర్దాను నదీ తీరానికి వెళ్లారు. అతను యేసును వాగ్దత్త మెస్సీయాగా ప్రకటించటం విన్నారు. ఆవార్తను ప్రపంచం నలుమూలలకూ తీసుకువెళ్లారు. ఈ రకంగా అపొస్తలుల సేవలకు దేవుడు మార్గం సుగమం చేశాడు.AATel 199.3

    పౌలు ఎఫెసు చేరుకొన్నప్పుడు పన్నెండు మంది సోదరులతో అతనికి పరిచయం ఏర్పడింది. వారు కూడా అపొల్లోకి మల్లే బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యులు. అపోల్లోకి మల్లే వారికి కూడా క్రీస్తు కర్తవ్యాన్ని గూర్చి కొంత అవగాహన ఉంది. అయితే అపొగాకున్న ప్రతిభ పాటవాలు వారికి లేవు. కాని తాము కనుగొన్న సత్యాన్ని ప్రచురించటానికి వారు అదే చిత్తశుద్ధితో అదే విశ్వాసంతో కృషి చేస్తున్నారు.AATel 199.4

    కాగా ఈ సహోదరులకు పరిశుద్ధాత్మ సేవను గూర్చి ఏమి తెలియదు. పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు వారిని ప్రశ్నించినప్పుడు వారిలా బదులు పలికారు. “పరిశుద్దాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదు.” “మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరి?” అని పౌలు అడుగగా యోహాను బాప్తిస్మమును బట్టియే” అని సమాధానమిచ్చారు.AATel 200.1

    అంతట అపొస్తలుడు క్రైస్తవ నిరీక్షణకు పునాది అయిన మహత్తర సత్యాల్ని వారికి వివరించాడు. ఈ లోకంలో క్రీస్తు జీవించిన జీవితం గురించి ఆయన పొందిన క్రూర మరణాన్ని గురించి వారికి వివరించాడు. జీవనాధుడైన ఆ ప్రభువు ఎలా సమాధి అడ్డంకుల్ని ఛేదించుకొని మరణాన్ని జయించి లేచాడో వారికి విశదం చేశాడు. రక్షకుడు తన శిష్యగణానికిచ్చిన ఆదేశాన్ని వారికి వర్ణించాడు: “పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ము యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము” ఇవ్వండి. మత్తయి 28:18,19. ఆదరణ కర్తను పంపుతానని యేసు చేసిన వాగ్దానం గురించి, ఆయన శక్తివలన జరగనున్న మహాద్భుతాలు సూచనల్ని గురించి వారికి చెప్పి, పెంతెకొస్తునాడు ఆ వాగ్దానం ఎంత మహిమకరంగా నెరవేరిందో వర్ణించాడు.AATel 200.2

    పౌలు మాటల్ని సహోదరులు ఆసక్తితో ఆనందాశ్చర్యాలతో విన్నారు. క్రీస్తు చేసిన ప్రాయశ్చితార్థ బలియాగాన్ని గూర్చిన సత్యాన్ని వారు విశ్వాసం ద్వారా గ్రహించి ఆయనను తమ రక్షకుడుగా స్వీకరించారు. అప్పుడు వారు యేసు నామంలో బాప్తిస్మం పొందారు. పౌలు “వారి మీద చేతులుంచగా” వారు పరిశుద్ధాత్మ బాప్మిస్మం పొందారు. అందువలన వారు ఇతర జాతులవారి భాషలు మాట్లాడటానికి, ప్రవచించటానికి శక్తి పొందారు. ఈ విధంగా వారు ఎఫెసులోను దాని పరిసర ప్రాంతాల్లోను సేవచేయటానికి, ఇంకా చిన్న ఆసియాకు వెళ్లి అక్కడ సువార్త ప్రకటించటానికి వారికి యోగ్యత లభించింది. AATel 200.3

    ఈ సువార్త సేవకులు తమ సేవారంగంలోకి ప్రవేశించటానికి అవసరమైన అనుభవాన్ని సంపాదించేందుకు వారి దీన స్వభావం, వినయ మనసులే సహయపడ్డాయి. వారి ఆదర్శం క్రైస్తవులకు ఆచరణీయం. అనేకులు తమ భక్తి జీవితంలో ముందుకి సాగకపోవటానికి కారణం తమకు స్వయంసమృది ఉన్నదని కనుక నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని భావించే వారనేకులుండటమే. వారు అరకొర వాక్య జ్ఞానంతో తృప్తి చెందుతారు. తమ నమ్మకాల్లోను ఆచరణలోను ఎలాంటి మార్పులూ అంగీకరించరు. అందువల్ల కొత్త సత్యాల్ని తెలుసుకోటానికి వారు ప్రయత్నించరు. తన్ను తాను దేవునికి పూర్తిగా అంకితం చేసుకొనే వ్యక్తిని దేవుని హస్తం నడిపిస్తుంది. అతను సామాన్యుడు నిరాడంబరుడే కావచ్చు. అయినా అతడు వ్యక్తమైన దైవచిత్తాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే అతని శక్తులు పవిత్రం ఉదాత్తం శక్తిమంతం అయి అతని ప్రతిభపాటవాలు వృద్ధి చెందుతాయి. దైవ జ్ఞానం ఒనగూర్చే సత్యనిధులైన ఈ పాఠాల్ని అతడు జాగ్రత్తగా వినియోగించుకొనే కొద్దీ దేవుడు అతనికో పవిత్ర బాధ్యతను అప్పగిస్తాడు. అతని జీవితాన్ని తనకు గౌరవప్రదంగాను ప్రపంచానికి దీవెనకరంగాను దేవుడు రూపుదిద్దుతాడు. “నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును.” కీర్తనలు 119:130.AATel 200.4

    పరిశుద్ధాత్మ హృదయాల్ని మార్చటం గురించి తెలియనివారు ఎఫెసు సంఘంలో అనేకులున్నట్లే నేడు మనలోనూ అనేకులున్నారు. అయినా దైవగ్రంథం ఈ సత్యాన్ని అతి స్పష్టంగా బోధిస్తున్నది. ఈ అంశంపై ప్రవక్తలు అపొస్తలులు బోధించారు. ఆధ్యాత్మిక జీవితాన్ని పోషించటంలో పరిశుద్ధాత్మ నిర్వహించే పాత్రకు సాదృశ్యంగా స్వయాన క్రీస్తే మన గమనాన్ని మొక్కల పెరుగుదల పై నిలుపుతున్నాడు. మొక్క వేరునుంచి పైకి వెళ్లే సారం కొమ్మలకు వ్యాపించి మొక్క పెరగటానికి పుష్పించి ఫలించటానికి హేతువవుతుంది. అలాగే రక్షకుడు క్రీస్తు నుంచి బయల్వెడలే జీవశక్తి అయిన పరిశుద్దాత్మ ఆత్మ అంతటా వ్యాపించి ఆశయాలు మమతల్ని నవీకరించి తలపుల్ని సయితం దేవుని చిత్తానికి అనుగుణంగా మలిచి గ్రహీత పరిశుద్ధ క్రియలనే ఫలాలు ఫలించటానికి శక్తినిస్తాడు. -AATel 201.1

    ఈ ఆధ్యాత్మిక జీవిత కర్త కనిపించనివాడు. ఆ జీవితం ఆవిర్భవించటం కొనసాటం ఏ నిర్దిష్ట పద్ధతి ప్రకారం జరుగుతుందో ఏ మానవ తత్వశాస్త్రమూ వివరించలేదు. కాగా పరిశుద్ధాత్మ కార్యాచరణ సరళి దేవుని లిఖిత వాక్యానికి అనుగుణంగా సాగుతుంది. స్వాభావిక ప్రపంచంలోలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా స్వాభావిక జీవం క్షణక్షణం దేవుని శక్తివల్ల కొనసాగుతుంటుంది. అయినా ప్రత్యక్ష అద్భుత కార్యం వల్ల దీవెనలను మన అందుబాటులో ఉంచి వాటిని మనం ఉపయోగించుకోటం దేవుడు సాధ్యపర్చుతున్నాడు. అలాగే దేవుడు ఏర్పాటు చేసిన సాధనాల వినియోగం ద్వారా ఆధ్యాత్మిక జీవితమూ కొనసాగాల్సి ఉంది. క్రీస్తు అనుచరులు “సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు” జీవాహారాన్ని భుజించి రక్షణ జలాన్ని తాగాల్సి ఉన్నారు (ఎఫెసీ 4:13). అన్ని విషయాల్లోను దేవుడు తన వాక్యంలో ఇచ్చిన ఉపదేశాన్ని పాటిస్తూ వారు మెళువకువగా ఉండి ప్రార్థిస్తూ కార్యసాధన చేపట్టాల్సి ఉన్నారు.AATel 201.2

    క్రైస్తవాన్ని స్వీకరించిన యూదుల అనుభవం నుంచి మనకు వస్తున్న పాఠం ఇంకొకటున్నది. క్రీస్తు యోహాను చేతులమీదుగా బాప్తిస్మం పొందినప్పుడు పాపాలు మోసేవాడిగా ఆయన కర్తవ్యాన్ని వారు సంపూర్తిగా గ్రహించలేకపోయారు. వారు ఘోరమైన పొరపాట్లకు పాల్పడుతున్నారు. అయితే మరింత స్పష్టమైన వెలుగు వచ్చినప్పుడు వారు క్రీస్తును తమ విమోచకుడుగా స్వీకరించారు. ఈ ముందగుతో వారి విధులు ఆచరణల విషయంలో మార్పు వచ్చింది. వారిలో మరింత స్వచ్చమైన విశ్వాసం చోటుచేసుకొన్నప్పుడు దానికి దీటైన మార్పు వారి జీవిత సరళిలో చోటు చేసుకొంది. ఈ మార్పుకు సూచనగాను, క్రీస్తు పై తమ విశ్వాసానికి గుర్తింపుగాను వారు క్రీస్తు నామంలో తిరిగి బాప్తిస్మం పొందారు.AATel 201.3

    తన వాడుక చొప్పున యూదుల సమాజమందిరంలో ప్రసంగించటం ద్వారా పౌలు ఎఫెసులో తన సువార్త సేనను ప్రారంభించాడు. “ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు” పౌలు మూడు నెలలు అక్కడ సేవ చేశాడు. ఆరంభంలో సానుకూల స్పందన లభించింది. కాని కొద్ది కాలంలోనే ఇతర స్థలాల్లో మాదిరిగానే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. “కొందరు కఠిన పరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును” దూషించారు. వారు సువార్తను విసర్జిస్తూ వస్తున్నందున అపొస్తలుడు పౌలు సమాజమందిరంలో ప్రసంగించటం ఆ పేశాడు.AATel 202.1

    తన ప్రజల కోసం పౌలు చేసిన సువార్త పరిచర్య విషయంలోను, పౌలు ద్వారాను దేవుని ఆత్మ అద్భుత కార్యాలు చేశాడు. సత్యాన్ని తెలుసుకోవాలని చిత్తశుద్ధితో ఆశించిన వారిలో నమ్మకం పుట్టించటానికి చాలినంత నిదర్శనం దొరికింది. అయితే దురభిప్రాయం, అపనమ్మకం తమను అదుపుచేయటంతో పెక్కుమంది తిరుగులేని ఆ నిదర్శనాన్ని తోసిపుచ్చారు. సత్యాన్ని వ్యతిరేకిస్తున్న వీరితో కలిసిఉండటం విశ్వాసుల విశ్వాసానికి విఘాతం కలిగిస్తుందని భయపడి, పౌలు వారి నుంచి విడిపోయి, విశ్వాసులందరినీ ఒక నిర్దిష్ట సంఘంగా పోగుజేసి, తురన్ను అనే ఒక ఉపాధ్యాయుడి పాఠశాలలో తన బహిరంగ ఉపదేశాన్ని కొనసాగించాడు. ,AATel 202.2

    “ఎదిరించువారు అనే కులు” ఉన్నప్పటికీ “కార్యానుకూలమైన మంచి సమయము” వచ్చినట్లు పౌలు గుర్తించాడు 1 కొరింథీ 16:9. ఆసియా నగరాలన్నిటిలోను ఎఫెసు వైభవోపేతమైన నగరమేకాదు అతి దుర్మార్గమైన నగరం కూడా. మూఢనమ్మకాలకు శృంగార సుఖభోగాలకు ఆ నగర ప్రజలు బానిసలయ్యారు. ఆ నగర దేవాలయాల నీడలో వివిధ రకాల నేరగాళ్లు ఆశ్రయం పొందారు. ఆ ధూర్తుల అకృత్యాలు అడ్డూ ఆపూ లేకుండా సాగాయి.AATel 202.3

    ఎఫెసు ఆర్తెమి దేవి ఆరాధనకు ప్రసిద్ధ కేంద్రం. “ఎఫెసీయుల అర్తెమి దేవి” ఆలయం ఆసియా అంతటిలోను, ప్రపంచంలోను ఖ్యాతి గాంచింది. ఆ దేవాలయ వైభవం ఆ నగరానికే కాదు ఆదేశానికే వన్నెకూర్చింది. సంప్రదాయం ప్రకారం , ఆ ఆలయంలోని విగ్రహం ఆకాశంలోనుంచి భూమ్మీద పడిందట. ఆ విగ్రహం మీద సంకేతాత్మకమైన అక్షరాలు చెక్కి ఉన్నాయి. వాటికి గొప్ప శక్తి ఉన్నట్లు ప్రజల నమ్మకం. ఈ సంకేతాల అర్ధాన్ని ప్రయోజనాన్ని వివరిస్తూ అనేక గ్రంథాలు రాశారు.AATel 202.4

    ఖరీదైన ఈ గ్రంథాలు అధ్యయనం చేసిన వారిలో అనేకమంది మాంత్రికులున్నారు. ఆలయంలో ఉన్న విగ్రహాన్ని మూఢభక్తితో ఆరాధించే భక్తుల పై ఈ మాంత్రికుల ప్రభావం ప్రబలంగా ఉండేది.AATel 203.1

    ఎఫెసులో తాను నిర్వహించిన సేవల్లో అపొస్తలుడు పౌలు దైవకృపకు సంబంధించి ప్రత్యేక నిదర్శనాలు పొందాడు. అతడి సేవల్లో దైవశక్తి ప్రదర్శితమయ్యింది. అనేకమంది శారీరక వ్యాధులనుంచి స్వస్తత పొందారు. “దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడ వదలిపోయెను”. ఇంతకు ముందు ఎఫెసులో సంభవించిన ఏ శక్తి ప్రదర్శనల కన్నా ఈ మానవాతీత శక్తి ప్రదర్శనలు శక్తిమంతమైనవే కాదు వాటిని ఏ గారడీవాడూ, మాంత్రికుడూ అనుకరించటం సాధ్యపడలేదు. ఈ అద్భుత కార్యాలు యేసు నామంలో జరుగుతున్నవి గనుక అర్తెమి దేవిని పూజించే మాంత్రికుల కన్నా పరలోకమందున్న దేవుడు అధిక శక్తిగలవాడని తెలుసుకోటానికి ప్రజలకు ఈ విధంగా అవకాశం కలిగింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు గల మాంత్రికుల కన్నా ఉన్నతంగా తన సేవకుణ్ని ఈ రకంగా ప్రభువు హెచ్చించాడు.AATel 203.2

    అయితే దురాత్మలన్నీ ఎవరి అధికారానికి లొంగిఉంటాయో ఎవరు తన సేవకులకు ఆ దురాత్మలపై అధికారం ఇచ్చారో ఆ ప్రభువు తన పరిశుద్ధ నామాన్ని తృణీకరించిన దుషులకు మరింత సిగ్గు మరెక్కువ పరాజయం కలుగజెయ్యటానికి సన్నద్ధంగా ఉన్నారు. మోషే ధర్మశాస్త్రం గారడీని నిషేధించి అవిధేయులికి మరణదండన విధించింది. అయినా కొందరు యూదులు అవిధేయులై గోప్యంగా దాన్ని సాగిస్తూనే ఉన్నారు. పౌలు ఎఫెసు పట్టణాన్ని సందర్శించిన సమయంలో పౌలు చేస్తున్న అద్భుతాల్ని చూసి “దేశ సంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు - పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయు (మంత్రించు) చున్నానను మాట చెప్పి....యేసు నామము ఉచ్ఛరించుటకు పూనుకొనెను.” “యూదుడైన స్కెవ యను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు” అలా చేయటానికి ప్రయత్నించారు. దయ్యం పట్టిన ఒకడి వద్దకు వెళ్లి “పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను” అన్నారు. అయితే ” ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎరిగి, వారి మీద పడివారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింట నుండి పారిపోయిరి.”AATel 203.3

    క్రీస్తు నామం పరిశుద్ధమైందనటానికి ఈ విధంగా తిరుగులేని రుజువు ఇవ్వటం రక్షకుడు యేసు పరిచర్య విషయంలో నమ్మకం లేకుండా ఆయన నామాన్ని ఉచ్చరించినవారికి సంభవించిన విపత్తును గూర్చిన హెచ్చరిక ఇవ్వటం జరిగింది. “వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.”AATel 204.1

    క్రితంలో గోవ్యంగా ఉన్న వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన కొందరు విశ్వాసులు తమ మూఢ నమ్మకాల్ని విడిచి పెట్టలేదు. ఇంకా కొంత మేరకు గారడీని మంత్ర తంత్రాల్ని నమ్ముతున్నారు, ఆచరిస్తున్నారు. తమ తప్పు తెలుసుకొని “విశ్వసించినవారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి యొప్పుకొనిరి”. ఈ మంచి పని కొందరు మాంత్రికుల్ని సయితం ప్రభావితం చేసింది. “మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి యెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.”AATel 204.2

    ఎఫెసు విశ్వాసులు తమ మంత్రవిద్య సంబంధిత పుస్తాకాల్ని కాల్చి వేయటం ద్వారా ఒకప్పుడు తమకు ఆనందాన్నిచ్చిన వాటిని ఇప్పుడు ద్వేషిస్తున్నామని సూచించారు. మంత్ర విద్య మూలంగానే వారు దేవుని అగౌరవపర్చి తమ ఆత్మలకు ముప్పు తెచ్చుకొన్నారు. ఆ మంత్ర విద్య విషయంలోనే ఇప్పుడు వారు కారాలు మిరియాలు నూరున్నారు. వారు నిజంగా మార్పు చెందారనటానికి ఇదే నిదర్శనం.AATel 204.3

    దురాత్మలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటాన్ని గురించిన నియమ నిబంధనలు ఆచారాలు ఈ మంత్ర విద్యా గ్రంథాల్లో ఉన్నాయి. అవి సాతాను పూజకు సంబంధించిన నిబంధనలు. అవి సాతాను సహాయాన్ని అర్థించటానికి, అతణ్నిగూర్చిన సమాచారాన్ని పొందటానికి సంబంధించిన నియమనిబంధనలు. ఈ గ్రంథాల్ని నాశనం చెయ్యకుండా ఉంచితే అవి శిష్యులికి శోధనగా మారేవి. వాటిని విక్రయించి ఉంటే అది ఇతరుల్ని శోధనకు గురి చేసినట్లయ్యేది. వారు చీకటి రాజ్యాన్ని పరిత్యజించారు. అందుకే దాని శక్తిని కూల్చటానికి ఎలాంటి త్యాగానికి వెనకాడలేదు. ఈ రీతిగా మానవుల దురభిమానంపై వారి ధనాశపై సత్యం విజయం సాధించింది.AATel 204.4

    క్రీస్తు శక్తి ఇలా ప్రదర్శితం కావటంద్వారా మూఢనమ్మకాలకు నిలయమైన ఆ పట్టణంలో క్రైస్తవం జయకేతనం ఎగురవేసింది. అక్కడ చోటు చేసుకొన్న పరిణామాల ప్రభావం పౌలు అనుకొన్న దానికన్నా ఎక్కువగా వ్యాపించింది. ఆ వార్త ఎఫెసు నుంచి అన్ని దిశలకూ వ్యాపించింది. క్రీస్తు సేవ బలం పుంజుకొంది. ఈ అపోస్తలుడి సేవ ముగిసిన చాలాకాలం తర్వాత కూడా ఈ సేవాసన్నివేశాలు ప్రజల మనసులో నిలిచిపోయాయి. అనేకమంది సువార్తను స్వీకరించటానికి స్ఫూర్తినిచ్చాయి.AATel 204.5

    ఇరవయ్యో శతాబ్దం నాగరికతకు ముందే అన్యమత సంబంధిత మూఢ నమ్మకాలు మాయమైపోయాయని మనం భావించవచ్చు. కాని దైవ వాక్యం, వాస్తవాల సాక్ష్యం చెబుతున్నదేంటంటే పాత కాలంలోని మాంత్రికుల టక్కుటమార విద్యే ఈ నవీన యుగంలోనూ కొనసాగుతుందని. నిజానికి పూర్వ కాలపు మంత్రవిద్య నేటి భూత విద్య ఒక్కటే. మరణించిన మిత్రులు ఆప్తుల వేషంలో సాతాను వేలాది మంది మనసుల్ని ఆకట్టుకొంటున్నాడు. “చచ్చిన వారు ఏమియు ఎరుగరు” అని లేఖనాలు చెపుతున్నాయి (ప్రసంగి 9:5). వారి తలంపులు, వారి ప్రేమ, వారి ద్వేషం నశించిపోతాయి. మృతులు బతికి ఉన్నవారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరు. అయితే, మనుషుల మనసుల్ని అదుపు చేసేందుకుగాను సాతాను తన పూర్వపు మోస బుద్ధిని పోనిచ్చుకోకుండా ఈ సాధనాన్ని ఉపయోగిస్తున్నాడు.AATel 205.1

    వ్యాధిగ్రస్తులు, ఆప్తుల్ని పొగొట్టుకొన్నవారు, ఉత్సుకత గలవారు భూత మతం ద్వారా దురాత్మలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. ఈ క్రియకు సాహసించే వారంతా అపాయకర భూభాగంలో ఉన్నారు. వారిని దేవుడెలా పరిగణిస్తాడో దైవవాక్యం వివరిస్తున్నది. పూర్వం ఒక రాజు అన్యమతానికి చెందిన శకునగాడి వద్దకు సలహా నిమిత్తం దూతల్ని పంపినప్పుడు అతడి మీదకి దేవుడు కఠినమైన శిక్ష పంపించాడు. “ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేతయైన బయల్డెబూబు నొద్దకు వారు విచారింప బోవుచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా - నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండ నీవు నిశ్చయముగా మరణించెదవు” 2 రాజులు 1:3,4.AATel 205.2

    నేటి భూతమత మాధ్యమాలు, దీర్ఘ దర్శులు, జ్యోతిష్కులు పూర్వం అన్యమతానికి చెందిన మాంత్రికులు శకునగాండ్రికి సరిసాటివారు. ఏన్డరులోను ఎఫెసులోను వినిపించిన ఈ మర్మపూరిత స్వరాలు అబద్దాలతో మనుషుల్ని ఇంకా మోసం చేస్తూనే ఉన్నాయి. మన కళ్లను కప్పే తెర తొలగిపోటం జరిగితే మనుషుల్ని మోసగించి నాశనం చెయ్యటానికి తమ యుక్తులన్నిటి ఉవయోగిస్తున్న దుష్ట దూతల్ని చూడగలుగుతాం. మనుషులు దేవున్ని మర్చిపోటానికి దారితీసే మోసం జరిగినప్పుడల్లా సాతాను తన మంత్రశక్తిని ప్రయోగిస్తూ పని చేస్తాడు. మనుషులు అతడి ప్రభావానికి లొంగినప్పుడల్లా తమకు తెలియకుండానే వారి మనసు దిగ్ర్భాంతి చెందుతుంది. వారి ఆత్మ కలుషిత మౌతుంది. ఎఫెసు సంఘానికి అపొస్తలుడు పలికిన ఈ హితవు నేడు దైవ ప్రజలకు అనుసరణీయం: “నిష్పలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి” ఎఫెసీ 5:11.AATel 205.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents