Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    21—సుదూర ప్రదేశాల్లో

    చిన్న ఆసియాకు పైగా ఉన్న ప్రాంతాల్లో సువార్త ప్రకటించాల్సిన సమయం వచ్చింది. పౌలు అతడి అనుచరులు ఐరోపాలో ప్రవేశించటానికి మార్గం సుగమమౌతున్నది. మధ్యధరాసముద్ర తీరం వద్ద ఉన్న త్రోయకు వచ్చినప్పుడు “మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి - నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగెను”.AATel 149.1

    అదే అనివార్యమైన, తక్షణం నిర్వహించాల్సి ఉన్న పిలుపు. ఆ ఐరోపా ప్రయాణంలో పౌలు, సీల, తిమోతిలతో ఉన్న లూకా ఇలా అంటున్నాడు, “అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియ కు బయలుదేరుటకు ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయ విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికి, అక్కడనుండి ఫిలిప్పీ కిని వచ్చితిమి. మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునైయున్నది”.AATel 149.2

    తన కథనాన్ని కొనసాగిస్తూ లూకా ఇలా అన్నాడు. “విశ్రాంతి దినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడివచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియయను దైవ భక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను”. లూదియ సత్యాన్ని సంతోషంగా అంగీకరించింది. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు క్రైస్తవ మతాన్ని స్వీకరించి బాప్తిస్మం పొందారు. తన గృహాన్ని తమ గృహంగా పరిగణించవలసిందిగా ఆమె వారిని వేడుకొంది.AATel 149.3

    ఈ సిలువ దూతలు తమ వాక్యప్రబోధ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సాగుతున్న తరుణంలో దయ్యంపట్టిన ఒక స్త్రీ ఇలా కేకలు వేస్తూ వారిని వెంబడించింది, “ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారైయున్నారు..... ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను”.AATel 149.4

    ఈమె సాతాను ప్రత్యేక ప్రతినిధి. సోదె చెప్పటంద్వారా తన యజమానులికి గొప్ప లాభాలు సంపాదిస్తున్నది. ఆమె పలుకబడి విగ్రహారాధనకు గొప్ప బలం చేకూర్చింది. తన రాజ్యంపై దాడి జరుగుతుందని సాతాను గ్రహించాడు. అందుకే దైవ సేవను వ్యతిరేకించటానికి ఈ మార్గాన్ని అనుసరించాడు. సువార్తికులు బోధించే సత్యాలతో తన తర్కాన్ని సంకరం చేయాలని యోచించాడు. ఈ స్త్రీ సిఫార్సుగా వలికిన మాటలు సత్వానికి విఘాతం కలిగించే మాటలు. అవి అపొస్తలుల బోధనలనుంచి ప్రజల మనసుల్ని పక్కదారి పట్టించటానికి ఉద్దేశించిన మాటలు. అవి సువార్తకు తీరని అపచారం చేసే మాటలు. దేవుని శక్తితో దేవుని ఆత్మవలన మాట్లాడిన భక్తుల మాటలు సాతాను ప్రతినిధి అయిన ఈ స్త్రీ మాటలు ఒకే మూలం నుంచి వస్తున్నట్లు అనేకుల్ని ఆ మాటలు నమ్మించాయి.AATel 150.1

    కొంతకాలం ఈ వ్యతిరేకతను అపొస్తలులు సహించారు. అప్పుడు ఆ స్త్రీని విడిచి పెట్టి వెళ్ళాల్సిందిగా పరిశుద్దాత్మ ఆవేశం వలన పౌలు ఆ దురాత్మను ఆదేశించాడు. ఆ దురాత్మ వెంటనే మూగపోవటం ఆ అపొస్తలులు దేవుని సేవకులని ఆ దయ్యం వారిని అలాగే గుర్తించి వారి ఆజ్ఞను శిరసావహించిందని రుజువయ్యింది.AATel 150.2

    ఆ దురాత్మ బెడద వదిలిపోయి సవ్యమైన మానసిక స్థితి చేకూరిన ఆ స్త్రీ క్రీస్తును వెంబడించటానికి నిశ్చయించుకొంది. అంతట ఆమె యజమానులు తమ వ్యాపారం గురించి ఆందోళనచెందారు. ఆమె సోదె మూలంగా తాము పొందుతున్న లాభాలు ఇక ఉండవని అపొస్తలులు తమ సువార్త పరిచర్య కొనసాగిస్తే తమ ఆదాయానికి పూర్తిగా గండి పడ్తుందని వారు గుర్తించారు.AATel 150.3

    సాతాను మోసాల్ని సొమ్ముచేసుకో చూసేవారు ఆ పట్టణంలో ఇంకా చాలామంది ఉన్నారు. తమ పలుకుబడికి జయప్రదంగా అడ్డుకట్ట వేయగల శక్తి ప్రభావానికి బెంబేలెత్తి వారు దేవుని సేవకుల్నిగూర్చి గగ్గోలు లేపారు. “ఈ మనుష్యులు యూదులైయుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను, చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణమును గలిబిలి చేయుచున్నారు”. అన్న ఆరోపణతో ఆ అపొస్తలుల్ని న్యాయాధికారులవద్దకు తీసుకువచ్చారు.AATel 150.4

    దురావేశంతో రెచ్చిపోతూ ప్రజలు శిష్యులమీద విరుచుకుపడ్డారు. దౌర్జన్యం పెచ్చరిల్లింది. అది కార్ల ప్రోత్సాహంతో ప్రజలు శిష్యుల మీదిగి దొమ్మీగా వచ్చారు. న్యాయాధికారులు వారి వస్త్రాలు తీసివేసి వారిని బెత్తాల్తో కొట్టాల్సిందిగా ఆజ్ఞాపించారు. “వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞపొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్ళకు బొండవేసి బిగించెను”.AATel 150.5

    తమకు వేసిన సంకెళ్ళనుబట్టి అపొస్తలులు తీవ్ర బాధకు గురి అయ్యారు. అయినా వారు గొణగలేదు సణగలేదు సరిగదా ఆ చీకటి కొట్టులో మాటలుతోను ప్రార్థనతోను వారు ఒకరినొకరు ఉద్రేకపర్చుకొంటూ ప్రభువు నిమిత్తం శ్రమలను భరించటానికి తమను యోగ్యులుగా పరిగణించినందుకు దేవునికి సోత్రగానాలు చేశారు. తమ విమోచకుని పరిచర్య విషయంలో వారి హృదయాలు గాఢమైన ప్రేమతో నిండాయి. క్రీస్తు శిష్యులమీదికి హింస తేవటానికి తాను బాధ్యుడు కావటం గురించి పౌలు ఆలోచించాడు. ఒకప్పుడు తాను ద్వేషించిన సత్యాల శక్తి చూడటానికి తన కళ్ళు తెరవబడినందుకు. తన మనసు గ్రహించగలిగినందుకు పౌలు బహుగా ఆనందించాడు.AATel 150.6

    లోపలి చెరసాలలోనుంచి వినిపిస్తున్న ప్రార్థన పాటలు విన్న తక్కిన ఖైదీలు ఆశ్చర్యపడ్డారు. నిశ్శబ్దంగా ఉన్న రాత్రిలో అరుపులు, మూలుగులు, శాపనార్థాలు ఒట్లు పెట్టుకోటాలు వినటమే వారికి అలవాటు. ఆ చీకటి కొట్టునుంచి ప్రార్థనగాని స్తుతిగాని పైకెగయటం ఎన్నడూ వినిపించలేదు. చలితోను ఆకలితోను బాధపడ్తున్నా, హింసకు గురి అవుతున్నా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్న వారెవరైయుంటారా అని భద్రతా సిబ్బంది, సాటి ఖైదీలు ఆశ్చర్యపడ్డారు.AATel 151.1

    ప్రజల మధ్య లేచిన అల్లర్లను తక్షణమే నిర్ణయాత్మక చర్యల ద్వారా అణచివేయగలిగామని తమ్మును తాము అభినందించుకొంటూ న్యాయాధికార్లు తమ తమ గృహాలకు తిరిగి వెళ్ళారు. అయితే తాము ఎవరిని బెత్తాలతో కొట్టి చెరసాలలో వేయటానికి ఆజ్ఞ జారీ చేశారో ఆ అపోస్తులుల ప్రవర్తన గురించి వారి పని గురించి మరికొంత సమాచారం విన్నారు. సాతాను ప్రాబల్యం నుంచి విడుదల పొందిన స్త్రీని వారు చూసి ఆమె ముఖంలోను నడవడిలోను చోటుచేసుకొన్న మార్పును గుర్తించారు. వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. గతంలో ఆ పట్టణ ప్రజలికి ఆమె భయభ్రాంతులు పుట్టించింది. ఇప్పుడు ఆమె ప్రశాంతంగా సమాధానంగా మసులుతుంది. కఠినమైన రోమా చట్టాల్ని తాము ఇద్దరు నిరపరాధుల విషయంలో అమలు పర్చి ఉంటామని తలంచినప్పుడు తమపై తమకు కోపం వచ్చింది. మరుసటి ఉదయం వ్యక్తిగతంగా ఆ అపొస్తలుల్ని విడుదలచేసి ప్రజల దౌర్జన్యానికి లోను కాకుండా వారిని పట్టణం వెలపల విడిచి పెట్టాలని తీర్మానించుకొన్నారు.AATel 151.2

    అయితే మనుషులు క్రూరంగా, ప్రతీకార వాంఛతో లేదా తమపై ఉన్న బాధ్యతను నిర్లక్ష్యం చేస్తూ ఉండగా దేవుడు తన సేవకుల పట్ల దయచూపించటం మర్చిపోలేదు. క్రీస్తు నిమిత్తం శ్రమలను భరించేవారి మీద దేవుని ఆసక్తి మెండుగా ఉంటుంది. పౌలు సేలల చెరసాలను సందర్శించటానికి దేవదూతలు వచ్చారు. వారు నడుస్తుంటే భూమి దద్దరిల్లింది. బలమైన గడియలు చెరసాల తలుపులు తెరుచుకొన్నాయి. ఖైదీల చేతులనుంచి కాళ్ళనుంచి సంకెళ్ళు ఊడిపడ్డాయి. ఖైదు ప్రకాశవంతమైన వెలుగుతో నిండింది.AATel 151.3

    జైలు అధికారి ఖైదులో ఉన్న అపొస్తలుల ప్రార్థనల్ని పాటల్ని విని విస్మయం చెందాడు. వారిని చెరసాలకు తీసుకువచ్చినప్పుడు రక్తం కారుతున్న వారి గాయాల్ని అతడు చూశాడు. వారి కాళ్ళకు బొండలు వేసింది తానే. వారి మూలులు శాపనార్థాలు వినిపిస్తాయేమోననుకొన్నాడు. కాని అతడికి వినిపించింది సంతోష గానం, స్తుతి వందనం. చెరసాల అధికారి అవి విని నిద్రించాడు. భూమి కంపించటం చెరసాల గోడలు ఊగడంతో అతడు మేల్కొన్నాడు.AATel 152.1

    ఉలిక్కి పడి లేచి చూడగా చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఖైదీలందరూ తప్పించుకుపోయారని భయకంపితుడయ్యాడు. ఆ ముందు రాత్రి పౌలు సీలల్ని జాగ్రత్తగా చూడమని ఎంత స్పష్టంగా చెప్పటం జరిగిందో గుర్తుచేసుకున్నాడు. తన అపనమ్మకంలా కనిపిస్తున్న ఆ లోపానికి మరణం తప్పదని అనుకొన్నాడు. ధైర్యం కోల్పోయిన ఆ స్థితిలో సిగ్గుకరంగా మరణదండన విధింపుకు గురికావటంకన్న ఆత్మహత్య చేసుకోవటం మేలని భావించాడు. తన్నుతాను చంపుకొంటానికి కత్తితీసినప్పుడు పౌలు పలికిన ఈ మాటలు అతనికి సంతోషాన్నిచ్చాయి. “నీవు ఏ హానియు చేసికొనవద్దు, మందరము ఇక్కడనే యున్నాము.” ఒక సాటి ఖైదీ ద్వారా ప్రదర్శితమైన దైవశక్తి ప్రభావంవల్ల ఖైదీలంతా ఎవరి స్థానంలో వారున్నారు.AATel 152.2

    తమ పట్ల చెరసాల అధికారి చూపించిన కాఠిన్యం వారిలో ద్వేషం పుట్టించలేదు. పౌలు సీలలకున్నది క్రీస్తు స్వభావం. ప్రతీకారం తీర్చుకొనే స్వభావం కాదు. రక్షకుని ప్రేమతో నిండిన వారి హృదయాల్లో తమను హింసించేవారిపట్ల ద్వేషానికి తావులేదు.AATel 152.3

    చెరసాల అధికారి తన చేతిలోని కత్తిని పారేసి దీపాలు తెప్పించి లోపలి చెరసాలలోకి హడావుడిగా వెళ్ళాడు. తన కాఠిన్యానికి ప్రతిగా దయను చూపించిన ఈ మనుషులెలాంటివారో ఆ అధికారి చూడాల్సి ఉన్నాడు. ఈ అపొస్తలులున్న చోటుకి వెళ్ళివారిముందు పడి క్షమాపణ అర్థించాడు. అనంతరం వారిని బహిరంగ స్థలంలోకి తీసుకొని వచ్చి ఇలా ప్రశ్నించాడు, “అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?”AATel 152.4

    ఆ భూకంపంలో ప్రదర్శితమైన దేవుని ఉగ్రతను చూసి ఆ చెరసాల అధికారి భయపడ్డాడు. ఖైదీలు తప్పించుకుపోయారని భావించి ఆత్మ హత్యకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు తన మనసును ఆందోళనపర్చిన కొత్త అంశం ఏమిటంటే బాధలు అనుభవిస్తున్నప్పుడు కూడా ఈ అపొస్తలులు కలిగి ఉన్న ప్రశాంతత ఆనందం తాను కలిగి ఉండటం ఎలా అన్నది. దీనితో పోలిస్తే తన భయాలన్నీ లెక్కలోనివి కావనిపించింది. వారి ముఖాల్లో పరలోకకాంతి అతనికి కనిపించింది. వారి ప్రాణాలు కాపాడటానికి దేవుడు అద్భుత రీతిగా కలుగుచేసుకొన్నాడని అతడు గ్రహించాడు. ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారు.” అంటూ దయ్యం పట్టిన స్త్రీ పలికిన మాటలు ఆ అధికారికి జ్ఞాపకం వచ్చాయి.AATel 152.5

    నిత్యజీవమార్గాన్ని చూపించాల్సిందిగా దీనమనసుతో ఆ అపొస్తలున్ని వేడుకొన్నాడు. అందుకు వారు “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ యించి వారును రక్షణ పొందుదురు” అని సమాధానం ఇచ్చారు. వారు “అతనికిని అతని ఇంటివారికందరికిని దేవుని వాక్యము బోధించిరి”. అప్పుడు ఆ చెరసాల అధికారి ఆ అపొస్తలుల గాయాలు కడిగి వారికి పరిచర్య చేశాడు. ఆ తర్వాత అపొస్తలులు అతనికి అతని ఇంటివారికి బాప్మిస్తం ఇచ్చారు. చెరసాలలోని ఖైదీల నడుమ పరిశుద్ద ప్రభావం వ్యాపించింది. ఆ అపొస్తలులు బోధిస్తున్న సత్యాలు వినటానికి వారి మనసులు విప్పారాయి. ఈ మనుషులు సేవిస్తున్న దేవుడు వీరిని తమ చెరనుంచి విడిపించాడని. వారు నిస్సందేహంగా నమ్మారు.AATel 153.1

    ఆ భూకంపానికి ఫిలిప్పీ పౌరులు భయభ్రాంతులయ్యారు. ఆ రాత్రి జరిగిన సంఘటనను గూర్చి చెరసాల అధికార్లు న్యాయాధికార్లకు చెప్పినప్పుడు వారు ఆందోళన చెంది ఆ అపొస్తలుల్ని విడుదల చెయ్యటానికి బంటులను పంపించారు. అయితే పౌలు వారితో ఇలా అన్నాడు, “వారు స్వయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా! మేము ఒప్పము, వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొని పోవలెను”.AATel 153.2

    ఈ అపొస్తలులు రోమా పౌరులు. భయంకర నేరం చేస్తేనే తప్ప రోమా పౌరుల్ని బెత్తంతో కొట్టటంకాని లేక న్యాయమైన విచారణ జరుపకుండా చెరసాలలో వేయటంకాని చట్టవిరుద్ధం. పౌలు సీలల్ని బహిరంగంగా ఖైదులో వేశారు. అందుకు న్యాయాధికార్లు సరియైన సంజాయిషీ చెప్పకుండా ఇప్పుడు రహస్యంగా విడుదల పొందటానికి వారు నిరాకరించారు. AATel 153.3

    ఈ వార్త అధికారులకు చేరినప్పుడు వారిలో భయాందోళనలు చోటుచేసుకొన్నాయి. ఆ విషయం అపొస్తలులు చక్రవర్తికి ఫిర్యాదు చేస్తారేమోనని దిగులు చెంది హుటాహుటీని చెరసాలకు వెళ్ళి తమకు జరిగిన అన్యాయానికి అఘాయిత్యానికి క్షమాపణ చెప్పుకొని వారిని వ్యక్తిగతంగా చెరసాలనుంచి బయటికి తీసుకొని వెళ్ళి ఆ పట్టణం విడిచి పెట్టి వెళ్ళిపొమ్మని బతిమాలారు. ప్రజల పై ఆ అపొస్తలుల ప్రభావాన్ని గురించి న్యాయాధికార్లు భయపడ్డారు. నిరపరాధులైన ఈ అపొస్తలుల పక్షంగా కలుగజేసుకొన్న శక్తిని గురించి కూడా వారు భయపడ్డారు.AATel 153.4

    క్రీస్తు ఇచ్చిన ఉపదేశం ప్రకారం ఎవరైతే తమ సందర్శనాన్ని వాంఛించలేదో వారి వద్దకు ఆ అపొస్తలులు వెళ్ళలేదు. “వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులందరును చూచి, ఆదరించి బయలుదేరి పోయిరి.”AATel 153.5

    ఫిలిప్పీలో తమ కృషి వ్యర్థం కాలేదని అపొస్తలులు భావించారు. తీవ్ర వ్యతిరేకత ఎంతో హింస వారికి ఎదురయ్యాయి. అయితే తమ పక్షంగా దేవుడు కలుగజేసుకోటం, చెరసాల అధికారి అతని ఇంటివారు మారుమనస్సు పొంది క్రైస్తవులవ్వటం తాముపొందిన పరాభవానికి శ్రమలకు గొప్ప ప్రాయశ్చిత్తంగా వారు భావించారు. వారి అన్యాయపు నిర్భంధం వారి ఆశ్చర్యకరమైన విడుదలను గూర్చిన వార్త ఆ ప్రాంతమంతా తెలిసింది. ఈ అపొస్తలుల పరిచర్యనుగురించి వేరే విధంగా తెలుసుకొని ఉండని అనేకమంది దీనిద్వారా తెలుసుకోటం జరిగింది.AATel 154.1

    ఫిలిప్పీలో పౌలు సువార్త కృషి ఫలితంగా అక్కడో సంఘం ఏర్పడింది. ఆ సంఘ సభ్యత్వం క్రమ క్రమంగా పెరిగింది. అతని ఉత్సాహం, అతని దైవ భక్తి మరి ముఖ్యంగా క్రీస్తు నిమిత్తం శ్రమలనుభవించటానికి అతని సంసిద్ధత విశ్వాసుల పై ప్రబలమైన ప్రభావాన్ని ప్రసరించింది. అపొస్తలులు ఎంతో త్యాగం చేసి తమకందించిన ప్రశస్త సత్యాల్ని వారు ప్రేమించి తమ హృదయాల్లో దాచుకొన్నారు. రక్షకుని సేవకు హృదయ పూర్వకంగా తమ్మును తాము అంకితం చేసుకొన్నారు.AATel 154.2

    ఈ సంఘం హింసను తప్పించుకోలేదని పౌలు తన ఉత్తరం లోని ఒక పద బంధంలో వ్యక్తం చేశాడు. పౌలు ఇలా అంటున్నాడు, “మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమేకాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడియుండెను”. అయినప్పటికీ వారి విశ్వాసం అంత బలీయమైంది గనుక అతనిలా అంటున్నాడు, ‘మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరునాతో పాలివారై యుండుట చూచి... మీ యందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనునప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను”. ఫిలిప్పీ 1:29, 30, 3-6.AATel 154.3

    సత్వదూతలు సేవ చేయటానికి పిలుపు పొందిన ప్రాముఖ్యమైన కేంద్రాల్లో మంచి చెడుల మధ్య భీకర పోరాటం జరుగుతుంది. “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశమందున్న దురాత్మల సమూహములతోను పోరాడు చున్నాము” అంటున్నాడు పౌలు. ఎఫెసీ 6:12. లోకాంతం వరకూ దేవుని సంఘానికి, దుష్టదూతల అదుపులో ఉన్నవారికి మధ్య పోరాటం కొనసాగుతుంది.AATel 154.4

    తొలి నాళ్ళ క్రైస్తవులు అంధకార శక్తుల్ని ముఖాముఖి ఎదుర్కోవాల్సి వచ్చింది. కుతర్కం, హింసలను ఉపయోగించి యధార్థ విశ్వాసం నుంచి వారిని మళ్ళించటానికి అపవాది ప్రయత్నించాడు. లోకంలోని సమస్తానికీ అంతం దగ్గర పడున్న ప్రస్తుత కాలంలో లోకాన్ని తన వలలో వేసుకోటానికి సాతాను శాయశక్తులా కృషి చేస్తున్నాడు. రక్షణకు అవసరమైన సత్యాలనుంచి మనుషుల మనసుల్ని మళ్ళించటానికి ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నాడు. దైవ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించేవారిని పార్టీలుగా వ్యవస్థీకరించటానికి ప్రతీ నగరంలోను అతడి ప్రతినిధులు అలు పెరుగకుండా పనిచేస్తున్నారు. ఆ ప్రధాన వంచకుడు గందరగోళ పరిస్థితుల్ని తిరుగుబాటును సృష్టించటానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. జ్ఞానంతోపాటు పొంతన లేని దురావేశంతో మనుషులు ఉర్రూతలూగుతున్నారు.AATel 154.5

    “మున్నెన్నడూ లేని రీతిలో దుర్మార్గత పెచ్చరిల్లుతుంది. అయినా “శాంతి అంటూ సంక్షేమమంటూ” అనేక మంది సువార్త బోధకులు కేకలు వేస్తున్నారు. అయితే నమ్మకమైన సువార్త ప్రబోధకులు తాపీగా తమ పనిచేసుకొంటూ ముందుకు సాగాలి. దేవుని సర్వాంగ కవచం ధరించి నిర్భయంగా విజయవంతంగా పురోగమించాలి. తమ అందుబాటులో ఉన్న ప్రతీ ఆత్మకూ నేటి సత్యం గూర్చిన వర్తమానాన్ని అందించేవరకూ వారు తమ పోరాటాన్ని ఆపకూడదు.AATel 155.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents