Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    44—కైసరు కుటుంబం

    బడుగు వర్గాల ప్రజల మధ్య సువార్త గొప్ప విజయాలు సాధించింది. “లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్పవంశమువారైనను అనేకులు పిలువ బడలేదు.” 1 కొరింథీ 1:26. పేదవాడు మిత్రులెవరూ లేనివాడు అయిన ఖైదీ, ధనికులు ఉన్నత తరగతులకు చెందినవారు అయిన రోమా పౌరుల దృష్టిని ఆకర్షించగలడని ఎవరూ భావించలేదు. దుష్టి తన తళుకు బెళుకు ఆకర్షణలన్నిటితోను దర్శనమిచ్చి వారిని ఇష్టపూర్వక బానిసల్ని చేసింది. అయితే శ్రమజీవులు, ఆకలిపీడితులు, పీడన బాధితులు అయినవారు బాధితుల్లోను బానిసల్లోను అనేకమంది పౌలు బోధల్ని ఆనందంగా విని క్రీస్తును విశ్వసించి తమ కష్టాలు శ్రమల నడుమ నిరీక్షణను కనుగొన్నారు. అది వారిని ఉత్సాహంతో నింపి ముందుకు నడిపింది.AATel 329.1

    అపొస్తలుడి సేవ సామాన్యమైన, తక్కువ స్థాయి ప్రజలతో ప్రారంభంకాగా దాని ప్రభావం రాజభవనం చేరుకునే వరకు విస్తరించింది.AATel 329.2

    ఈకాలంలో రోము ప్రపంచానికి ముఖ్యనగరం. అతిశయంతో నిండిన కైసరులు లోకంలో దాదాపు ప్రతీ దేశాన్ని శాసించారు. నిరాడంబర సామాన్య నజరేయుని గురించి రాజుకి ఆ స్థానికుడికి ఎవరికీ తెలియదు. తెలిసినా ఆయనను ద్వేషించి హేళన చేశారు. అయినా రెండే రెండేళ్లలో ఖైదీ పేద గృహంనుంచి చక్రవర్తి కోటలోకి సువార్త వెళ్ళింది. పౌలు దుర్మార్గుడిగా బంధకాల్లో ఉన్నాడు. అయినా “దేవుని వాక్యము బంధింపబడియుండలేదు.” 2తిమోతి 2:9.AATel 329.3

    గతించిన సంవత్సరాల్లో క్రీస్తును గూర్చిన విశ్వాసాన్ని అపొస్తలుడు బహిరంగంగా ప్రకటించాడు. అనేకులు సువార్త శక్తిని అంగీకరించారు. అది దేవుని వర్తమానమని గుర్తులు మహత్కార్యాల ద్వారా తిరుగులేని నిదర్శనాన్నిచ్చాడు. ఉదాత్తమైన స్థయిర్యంతో గ్రీసు జ్ఞానులముందు వారికి దీటుగా నిలబడ్డాడు. తన అపారజ్ఞానంతో వాగ్దాటితో తత్వజ్ఞాన్ని నోరుమూయించాడు. మొక్కవోని ధైర్యంతో రాజులముందు ఉన్నతాధికారులముందు నిలబడి నీతిని గురించి, మితానుభవం గురించి, రానున్న తీర్పును గురించి హేతుబద్ధంగా వాదించాడు. గర్విష్టులైన రాజులు ప్రధానులు దేవుని దినంనాటి భయంకర ఘటనల్ని ఆక్షణమే వీక్షిస్తున్నట్లు భయంతో వణికారు.AATel 329.4

    అపోస్తలుడికి ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు. ఇప్పుడు తన నివాసానికే పరిమితమై తన వద్దకు వచ్చే వారికి మాత్రమే సత్యం బోధిస్తున్నాడు. నీతి బాహ్యుడైన రాజు వద్దకు మోషే అహరోనులమల్లే వెళ్ళి నేను ఉన్నవాడను అనే దేవుడు అతణ్ని తన కాఠిన్యం గురించి హింసగురించి మందలించమని తనకు దేవుని ఆదేశం లేదు. అయినా, సువార్త ప్రధాన ప్రబోధకుడు బహిరంగ సేవనుంచి నిష్క్రమించిన ఈ తరుణంలోనే సువార్త గొప్ప విజయం సాధించింది. ఎందుకంటే రాజు కుటుంబంలోని వారే సంఘ సభ్యులయ్యారు.AATel 330.1

    క్రైస్తవ మతానికి అనుకూల వాతావరణం రోమను ఆస్థానంలో ఉన్నంతగా మరెక్కడా లేదు. నీరో ఆత్మనుంచి దేవుని ఆనవాళ్ళు తుదకు మానవుడి ఆనవాళ్ళు కూడా తుడుపుపడి వాటికి ప్రతిగా సాతాను రూపం ముద్రితమయ్యింది. అతని సేవకులు ఆస్థానికులు తమ ప్రవర్తన విషయంలో అతనిలాగే కర్కశులు, నీతి బాహ్యూలు, అవినీతిపరులు. నీరో ఆ స్థానంలోను రాజభవంతిలోను క్రైస్తవ మతానికి స్థానం లభించటం అసాధ్యమన్నట్లు పైకి కనిపించింది.AATel 330.2

    అయినా, అనేక సందర్భాల్లో పౌలన్న మాటలు నిజమయ్యాయి. తాను సాగిస్తున్న సమరంలోని ఆయుధాలు “దేవుని యెదుట దుర్లభములను పడద్రోయ జాలినంత బలము కలవైయున్నవి” అంటున్నాడు 2 కొరింథీ 10:4. నీరో గృహంలో సైతం సిలువ విజయ సూచక ట్రోఫీలు ఉన్నాయి. దుష్టుడు భ్రష్టుడు అయిన రాజును కొలిచే దుష్ట సేవకుల్లోనుంచి విశ్వాసులైన దేవుని కుమారులైన వారున్నారు. వీరు రహస్య క్రైస్తవులుకారు, బహిరంగ క్రైస్తవులు. తమ విశ్వాసం గురించి వారు సిగ్గుపడలేదు.AATel 330.3

    క్రైస్తవమతం ఊసెత్తటానికే అవకాశం లేని స్థలంలోకి అదెలా ప్రవేశించి గట్టిపట్టు సాధించింది? నీరో కుటుంబికుల్ని క్రైస్తవ విశ్వాసంలోకి ఆకర్షించటంలో తన విజయానికి కారణం తన చెరసాల వాసమేనని ఫిలిప్పీయులికి రాసిన లేఖలో పౌలు అంటున్నాడు. తన శ్రమలు సువార్త ప్రగతిని అడ్డుకొన్నాయన్న భావన కలుగుతుందేమోనన్న భయంతో వారికిలా ధైర్యం చెప్పాడు: సహోదరులారా, నాకు సంబంధించిన సువార్త మరి యెక్కువగా ప్రబలుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను” ఫిలిప్పీ 1:12.AATel 330.4

    పౌలు రోమును నందర్శించనున్నట్లు మొదటగా క్రైస్తవ సంఘాలు తెలుసుకున్నప్పుడు ఆ నగరంలో సువార్త గొప్ప విజయాలు సాధిస్తుందని ఎదురుచూశాయి. పౌలు అనేక ప్రాంతాల్లో సత్యాన్ని ప్రకటించాడు. గొప్ప నగరాల్లో సత్యాన్ని చాటాడు. లోక రాజధాని అయిన ఈ మహానగరంలో కూడ ఈ విశ్వాస నీరుడు ఆత్మల రక్షణలో విజయం సాధించడా? అయితే పౌలు రోము నగరానికి ఖైదీగా వెళ్లాడన్న వార్త విన్నప్పుడు వారి ఆశలు కుప్పకులాయి. ఈ మహానగరంలో సువార్త స్థాపితమైన తర్వాత అది వేగంగా అన్ని జాతులకూ విస్తరించి లోకంలో ఒక బలీయమైన శక్తిగా రూపుదిద్దుకొంటుందని వారు ధీమాగా ఉన్నారు. వారు తీవ్ర ఆశాభంగానికి గురైయ్యారు. మానవుడి ఆశలు నిష్ఫలమయ్యాయి, కాని దేవుని సంకల్పాలు కాదు.AATel 331.1

    పౌలు ప్రసంగాలు కాదు అతని సంకెళ్ళే రాజు ఆ స్థానం దృష్టిని ఆకర్షించి క్రైస్తవ మతానికి బాటలు పరిచాయి. బంధకాల్లో వున్న బందీగానే అతడు అనేకుల్ని బంధించిన పాప బంధకాల్ని తెగనరికి పాపదాస్యం నుంచి విముక్తి కలిగించాడు. అంతేకాదు. పౌలు ఇంకా ఇలా అన్నాడు: “మరియు సహాదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి.” ఫిలిప్పీ 1:14.AATel 331.2

    తన సుదీర్ఘమైన అన్యాయమైన చెరసాల వాసకాలంలో పౌలు ప్రదర్శించిన ఓరిమి ఉల్లాసవైఖరి నిత్యం సాగే ప్రసంగం అయ్యింది. లోకం ప్రదర్శించే స్వభావానికి విరుద్ధమైన అతని స్వభావం లోకంకన్నా ఉన్నతమైన శక్తి అతనిలో ఉన్నదని సాక్ష్యం ఇచ్చింది. అతని ఆదర్శం క్రైస్తవులికి ఇతోధిక శక్తి చేకూర్చింది. ఏ బహిరంగ సేవకు పౌలు దూరమయ్యాడో దానికి వారు ప్రచారకులయ్యారు. ఈ రీతులలో పౌలు బంధకాలు ఎంత ప్రభావాన్వితమయ్యాయంటే అతని శక్తి, ప్రయోజనమూ నశించిపోయినట్లు, ఇక అతను చెయ్యగలిగిందేమిలేనట్లు కనిపించినప్పుడు, అప్పుడు తాను దూరమైపోయినట్లు కనిపించే పొలాలనుంచి క్రీస్తుకు పనలు పోగుచేశాడు.AATel 331.3

    ఆ రెండేళ్ల చెరసాల వాసం పూర్తికాకముందే పౌలు ఇలా చెప్పగలిగాడు, ” నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేవలోని వారికందరికిని తక్కినవారికందరికిని స్పష్టమాయెను.” ఫిలిప్పీయులకి అభినందనలు పంపినవారిలో ‘కైసరు ఇంటివారిలో” ని వారిని పౌలు ప్రధానంగా పేర్కొంటున్నాడు. 13:4:22 వచనాలు.AATel 331.4

    సాహసానికి, ధైర్యానికి విజయాలున్నాయి. కష్టాల్లో సాత్వీకంవల్ల కార్యసాధనలో ధైర్యంవల్ల క్రీస్తుకు ఆత్మల్ని సంపాదించవచ్చు. ఓర్పును ప్రదర్శించే క్రైస్తవుడు దు: ఖంలోను బాధలోను మామూలుగా కనిపించే క్రైస్తవుడు మరణాన్ని సైతం ప్రశాంతంగా అచంచల విశ్వాసంతో ఎదుర్కొనే క్రైస్తవుడు సువార్తపరంగా ఎంతో సాధించగలుగుతాడు. తాను నమ్మకంగా దీర కాలం శ్రమించి సేవ చేసిన దానికన్న ఎంతో ఎక్కువ సాధించగలగుతాడు. తరచు దైవ సేవకుడు తన క్రియాశీలక విధి నుంచి నిష్క్రమించినప్పుడు మన మానవ దృష్టికి అగోచరమైన దైవ శక్తి జరగాల్సిన పనిని పూర్తిచేస్తుంది. అది జరగకపోతే ఆ పని ఎన్నటికీ పూర్తి అవ్వదు.AATel 331.5

    క్రీస్తు అనుచరుడు దైవ సత్యాన్ని ప్రకటించటంలో బాహాటంగా క్రియాశీలంగా పనిచేయలేనప్పుడు తాను ఇక చేయాల్సిన సేవ లేదని పొందాల్సిన ప్రతిఫలం లేదని తలంచకూడదు. క్రీస్తుకి నిజమైన సాక్షులు పనిలేకుండా ఎన్నడూ ఉండరు. ఆరోగ్యంలో వ్యాధిలో జీవం ఉన్నప్పుడు మరణం ద్వారా దేవుడు వారిని ఉపయోగిస్తూనే ఉంటాడు. సాతాను దౌష్ట్యంవల్ల క్రీస్తు సేవకులు హింసపొందినప్పుడు, వారి సేవకు అంతరాయం కలిగినప్పుడు, వారు బందీలై చెరసాలకు వెళ్ళినప్పుడు లేక ఉరికంబానికి లేదా సజీవ దహనస్థితికి వారిని ఈడ్చుకు వెళ్ళినప్పుడు ఆ సత్యమే సమున్నత విజయాన్ని సాధించవచ్చు. ఈ విశ్వాసులు తమ సాక్ష్యాన్ని తమ రక్తంతో ఇచ్చినప్పుడు అప్పటివరకూ సందేహంతోను అనిశ్చితితోను సతమతమౌతున్న వారు క్రీస్తును విశ్వసించటానికి ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడ్డారు. హతసాక్షులు కాలిన బూడిదలోనుంచి దేవునికి విస్తారమైన పంట పుట్టుకొచ్చింది.AATel 332.1

    భయానక పరిస్థితుల్లో పౌలు, అతని తోటి పనివారి విశ్వాసానికి విధేయతకు దీటైన విశ్వాసాన్ని, విధేయతను చూపిన నూతన క్రైస్తవ విశ్వాసుల ఉద్రేకం విశ్వసనీయత నేడు క్రీస్తు సేవ కుల్లోని సోమరితనాన్ని విశ్వాసరాహిత్యాన్ని మందలిస్తున్నాయి. పాపపశ్చాత్తాపం పొందమని క్రీస్తును విశ్వసించమని నీరో చక్రవర్తి సేవకుల్ని ఉద్బోధించటం శుద్ధదండగని అపోస్తలుడు అతని సహచర సువార్తికులు వాదించి ఉండవచ్చు. ఎందుకంటే వారు తీవ్రశోధనలకు వ్యతిరేతకు గురి అయివున్నారు. ఒకవేళ వారు సత్యాన్ని నమ్మినా దానికి విధేయులై ఎలా నివసించగలరు? అయితే పౌలు ఆలోచన ధోరణి ఇలా లేదు. ఆ ఆత్మలకు విశ్వాసంతో సువార్త బోధించాడు. విన్నవారిలో కొందరు ఏదిఏమైనా ఆ సత్యాన్ని ఆచరించటానికి నిశ్చయించుకున్నారు. అడ్డంకులు అపాయాలు ఎన్ని ఉన్నా తమకు వచ్చిన వెలుగు అంగీకరించి, తమ విశ్వాసాన్ని ఇతరులకు అందిచటంలో దేవుడు తమకు అండదండగా ఉంటాడని నమ్మారు.AATel 332.2

    కైసరు కుటుంబంలోని వారు క్రైస్తవులవ్వటమే కాదు వారు ఆకుటంబంలోనే కొనసాగారు. పరిసరాలు అనుకూలంగా లేనందున తమ ఉపాధిని విడిచి పెట్టాలని వారు భావించలేదు. అక్కడే వారు క్రైస్తవ సత్యాన్ని కనుగొన్నారు, అక్కడే వారు ఉండిపోయారు. మారిన తమ జీవన సరళి, ప్రవర్తన వారి నూతన విశ్వాసానికి పరివర్తనకలిగించే శక్తి ఉన్నదని చాటి చెప్పాయి.AATel 332.3

    తామున్న పరిస్థితుల్ని బట్టి క్రీస్తును ప్రకటించలేమంటూ ఎవరైనా సాకులు చెప్పాలని చూస్తారేమో. కైసరు ఇంటిలోవున్న విశ్వాసుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోండి. చక్రవర్తి దుర్మార్గత, ఆస్తానికుల అనైతిక వర్తన - ఇది అక్కడి పరిస్థితి. ఈ విశ్వాసులు నివసిస్తున్న పరిస్థితులు భక్తి జీవితానికి అననుకూలంగాను ఎంతో త్యాగాన్ని కోరేవిగాను, ఎంతో వ్యతిరేకంగాను ఉన్నాయి. ఇంతకన్న విరుద్ధమైన అననుకూలమైన పరిస్థితులుండటం కష్టం. అయినా ఈ శ్రమలు అపాయాల నడుమ వారు తమ విశ్వాసానికి నమ్మకంగా నిలిచారు. అధిగమించలేనివిగా ఆటంకాలు కనిపించటం వల్ల యేసులో ఉన్నరీతిగా సత్యాన్ని ఆచరించలేమని క్రైస్తవులు సాకులు చెప్పవచ్చు. కాని ఏ సాకూ పరీక్షకు నిలబడలేదు. అది నిజమైందని క్రైస్తవుడు నిరూపించగలిగితే దేవుడు అన్యాయస్తుడని అది రుజువు పర్చుతుంది. దేవుడు తన బిడ్డల రక్షణకు వారు నెరవేర్చలేని షరతులు విధించిన వాడవుతాడు.AATel 333.1

    దేవునికి సేవ చెయ్యాలన్న మనసున్న వ్యక్తి ఆయన్ని గూర్చి సాక్ష్యంచెప్పటానికి అవకాశాలు వెదక్కుంటాడు. మొట్టమొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకే వ్యక్తిని అడ్డుకోటానికి కష్టాలు ఇక్కట్లు శక్తిహీనమవుతాయి. ప్రార్థన, వాక్యపఠనం ద్వారా పొందిన శక్తితో నీతివర్తనను సాధించి అతడు దుష్టిని విడిచి పెడ్తాడు. విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు అయిన యేసును, తనపై పాపులు మోపిన అసంబద్ద నిందల్ని భరించిన యేసును దృష్టిలో ఉంచుకుని విశ్వాసి తిరస్కారాన్ని హేళనను ఆనందంగా ఎదుర్కుంటాడు. ఎవరి మాట సత్యమో ఆ ప్రభువు ప్రతీ పరిస్థితికి అవసరమైన సహాయాన్ని కృపను వాగ్దానం చేస్తున్నాడు. సహాయం అర్థిస్తూ తన వేపుకు తిరిగే ప్రతీ ఆత్మనూ నిత్యుడైన ఆయన హస్తాలు కౌగిలించుకుంటాయి. ఆయన సంరక్షణలో క్షేమంగా విశ్రమిస్తూ మనం ఇలా అనగలుగుతాం, “నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను.” కీర్తనలు 56:3. ఆయనపై విశ్వాసముంచే వారందరిపట్ల దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చుతాడు.AATel 333.2

    తన అనుచరులు లోకంలో వుంటున్నా లోకానికి చెందినవారు కారని రక్షకుడు తన సొంత ఆదర్శం ద్వారా చూపించాడు. లోకపు మాయ వినోదాల్లో పాలుపంచు కోటానికి ఆయన రాలేదు. తండ్రి చిత్తం నెరవేర్చటానికి నశించినవారిని వెదకి రక్షించటానికి ఆయన వచ్చాడు. ఈ ధ్యేయాన్ని ముందుంచుకొని క్రైస్తవుడు ఎలాంటి పరిసరాల్లోన్నైనా పరిశుద్ధంగా నివసించవచ్చు. తన స్థితి పరిస్థితులు ఎలాంటివైనా అవి ఉన్నతమైనవైన సామాన్యమైనవైనా అతడు తన విధిని నమ్మకంగా నిర్వహించటంలో నిజమైన మతంలో వున్న శక్తిని ప్రదర్శిస్తాడు.AATel 333.3

    శ్రమలులేని స్వాతంత్ర్యంలోనుంచి కాక శ్రమలు బాధల నడుమ క్రైస్తవ ప్రవర్తన వృద్ధి చెందుతుంది. తోసివేతలు ప్రతిఘటనలకు గురికావటం క్రీస్తు అనుచరులు మరింత మెళుకువగా ఉండి ప్రార్థించటానికి దారితీస్తుంది. దేవుని కృపద్వారా తీవ్ర శ్రమల్ని సహించంవల్ల ఓర్పు, అప్రమత్తత, ధైర్యం, దేవుని పై అచంచలమైన నమ్మకం వృద్ధి చెందుతాయి. క్రైస్తవ విశ్వాసి శ్రమలు బాధలకు గురిఅయినా బలంగా నిలబడ్డాడు. సమర్పించుకోటం తద్వారా జయించటం; దినమంతా మరణించటం అయినా జీవించటం; సిలువను భరించటం తద్వారా మహిమ కిరీటాన్ని పొందటం - ఇది క్రైస్తవ విశ్వాసం సాధించే విజయం .AATel 333.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents