Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    23—బెరయ, ఏథెన్సు

    తాను బోధించే సత్యాన్ని పరిశోధించటానికి బెరయలోని యూదులు సమ్మతంగా ఉన్నట్లు పౌలు కనుగొన్నాడు. వారిని గురించి లూకా ఇలా అంటున్నాడు: “వీరు థెస్సలొనికిలో ఉన్నవారికంటె ఘనులైయుండిరి. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేదో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.”AATel 163.1

    బెరయ ప్రజల మనసులు ముందే ఏర్పడ్డ భావాలతో సంకుచితం కాలేదు. అపొస్తలులు బోధించే సిద్ధాంతాలు యధార్థత ఉన్నవో కావో పరీక్షించటానికి వారు సమ్మతంగా ఉన్నారు. వింత ఏమిటో చూద్దామని గాక వద్దత్త మెస్సీయాను గూర్చి ఏమి రాసి ఉన్నదో తెలుసుకొందామన్న ఉద్దేశంతో వారు బైబిలుని అధ్యయనం చేశారు. ప్రతీ దినం పరిశుద్ధ లేఖనాల్ని పరిశోధించారు. ఒక లేఖనంతో ఇంకో లేఖనాన్ని పోల్చుకొంటూ పఠిస్తుండగా వారి సరసన పరలోక దూతలు ఉండి వారి మనసుల్ని ఉత్తేజపర్చి ఆ సత్యాల్ని = 3 హృదయాల్లో నాటింపజేశారు.AATel 163.2

    సువార్త సత్యాలు ఎక్కడ ప్రకటితమవుతాయో, అక్కడ నిజాయితీగా సత్యానుసారంగా నివసించాలని ఆకాంక్షించే వారందరినీ దేవుడు లేఖన పరిశోధనకు నడిపిస్తాడు. నిగ్గుతేల్చే దైవసత్యాలు ఈ లోక చరిత్ర చివరి ఘట్టాల్లో ఎవరికి ప్రకటితమౌతాయో ఆ ప్రజలు బెరయ ప్రజలల్లే ప్రతి దినం లేఖనాల్ని పరిశోధించి, తాము విన్న వర్తమానాల్ని దైవ వాక్యంతో పోల్చి పరిశీలించినట్లయితే ఈ రోజు దైవాజ్ఞల్ని నమ్మకంగా ఆచరించే ఒక్క విశ్వాసి స్థానంలో వేలాది మంది ఉండేవారు. అయితే ఆదరణలేని బైబిలు సత్యాల బోధ విషయంలో అనేకులు ఈ పరిశోధన చెయ్యటానికి ఇష్టపడరు. సరళమైన లేఖన సత్యాల్ని కాదనలేకపోయినా చూపించిన నిదర్శనాల్ని పరిశీలించటానికి అయిష్టత ప్రదర్శిస్తారు. కొందరైతే, ఈ సిద్ధాంతాలు యధార్ధమైనవే అయినప్పటికీ నూతన సత్యాల్ని తాము అంగీకరించినా అంగీకరించకపోయినా ఏమంత తేడా ఉండదని భావిస్తారు. ఆత్మల్ని అపమార్గం పట్టించటానికి అపవాది అల్లే కట్టు కథల్ని పట్టుకొని ఉంటారు. ఈ రకంగా తప్పుడు విషయాల్తో వారి మనసులు గుడ్డివవుతాయి. వారు దేవునికి దూరమవుతారు.AATel 163.3

    అందరూ తమకు అందిన సత్యాన్ని బట్టి తీర్పు పొందుతారు. ప్రభువు తన రాయబారుల్ని రక్షణ వర్తమానంతో పంపిస్తాడు. ఆ వర్తమానాన్ని వినేవారు ప్రభువు సేవకుల మాటల్ని ఎలా పరిగణిస్తున్నారు అన్న విషయమై వారినే జవాబుదారులు చేస్తాడు. చిత్త శుద్ధితో సత్యాన్ని వెదకే వారు తమకు వచ్చే సిద్ధాంతాన్ని దైవ వాక్యం వెలుగులో జాగ్రత్తగా పరిశోధిస్తారు. AATel 164.1

    అవిశ్వాసులైన థెస్సలొనీక యూదులు అపొస్తలుల పట్ల ఈర్యద్వేషాలతో నిండి వారిని తమ పట్టణంలోనుంచి తరిమివేయటంతోనే తృప్తి చెందక వారి వెనక బెరయ పట్టణానికి వెళ్లి అక్కడ తక్కువ తరగతి ప్రజల్ని అపోస్తలులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. అక్కడ ఉన్నట్లయితే పౌలుకి ప్రమాదం ఏర్పడ్తుందని భయపడి నహోదరులు అతన్ని ఏథెన్సు కు పంపించారు. బెరయులో కొత్తగా విశ్వాసాన్నంగీకరించిన కొంతమంది విశ్వాసుల్ని పౌలుతో పంపించారు.AATel 164.2

    ఇలా సత్యాన్ని ప్రకటించే బోధకుల వెంట హింస ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వెళ్లింది. క్రీస్తు విరోధులు సువార్త ప్రగతిని నిరోధించలేకపోయారు. కాని అపొస్తలుల సేవను మాత్రం కష్టతరం చెయ్యటంలో విజయం సాధించారు. అయినా, తీవ్ర వ్యతిరేకత సంఘర్షణల మధ్య పౌలు దృఢచిత్తంతో ముందడుగు చేశాడు. “దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదును” (అ.కా. 22:21) అని యెరూషలేము దర్శనంలో దేవుడు వ్యక్తపర్చిన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి పౌలు కృతనిశ్చయంతో ఉన్నాడు.AATel 164.3

    బెరయ నుంచి అర్థంతరంగా వెళ్లిపోవాల్సివచ్చినందువల్ల తాను ఆశించినట్లు థెస్సలొనీకలోని విశ్వాసుల్ని పౌలు సందర్శించలేకపోయాడు.AATel 164.4

    ఏథెన్సు చేరిన వెంటనే పౌలు బెరయ సహోదరుల్ని వెనకకు పంపివేశాడు. సీల, తిమోతిలు బయలుదేరి తన వద్దకు రావలసిందిగా ఆ సహోదరులతో వర్తమానం పంపించాడు. పౌలు బెరయ విడిచి వెళ్లక ముందే తిమోతి బెరయ చేరాడు. అక్కడ ప్రారంభమైన పనిని సీలతో కలిసి కొనసాగించటానికి, కొత్త విశ్వాసులకు విశ్వాస సూత్రాల్ని ఉపదేశించటానికి తిమోతి నిలిచిపోయాడు.AATel 164.5

    ఏథెన్సు నగరం అన్యమతాలకు ప్రధాన నగరం. లు స్త్రీలోలాగ ఇక్కడ అజ్ఞానులు సులభంగా నమ్మే ప్రజలు పౌలుకి కనిపించలేదు. ఇక్కడి ప్రజలు ప్రతిభకు సంస్కృతికి పేరుపొందినవారు. దేవుళ్ల శిలావిగ్రహాలు, చరిత్ర సాహిత్యాల్లోని నాయకుల విగ్రహాలు ప్రతీచోటా దర్శనమిచ్చాయి. వైభవోపేతమైన వాస్తుకళ, చిత్రకళ జాతీయ ప్రాభవాన్ని అన్యదేవుళ్ల పూజా ప్రశస్తిని చాటుతున్నాయి. ఆ సౌందర్యానికి అద్భుత కాళాసృష్టికి ప్రజలు ముగ్ధులయ్యారు. ఎక్కడపడితే అక్కడ ఎంతో వ్యయంతో నిర్మితి అయిన బ్రహ్మాండమైన గుడులు మందిరాలు ఉన్నాయి. యుద్ధ విజయాల్ని, ప్రఖ్యాత వ్యక్తుల కార్యాల్ని, గుర్తుచేసే శిల్పాలు, పుణ్య సమాధులు, ఫలకాలు ఆ నగరంలో ఉన్నాయి. ఇవన్నీ ఏథెన్సు నగరాన్ని ఓ కళామందిరంగా తీర్చిదిద్దాయి.AATel 164.6

    తన చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఔన్నత్యాన్ని తిలకిస్తూ ఆ మహానగరం పూర్తిగా విగ్రహారాధనకు అంకితం కావటం చూసినప్పుడు పౌలు హృదయం దేవుని నిమిత్తం రోషంతో నిండింది. అన్ని పక్కలా దేవుడు అగౌరవం పొందటం ప్రజలు నిజమైన దేవుడెవరో తెలియని అజ్ఞానులై ఉండటంతో వారిపై ఎంతో జాలిపడ్డాడు.AATel 165.1

    సకల విద్యలకు కేంద్రమైన ఆ మహానగరంలో తాను చూసిన వాటికి ఆకర్షితుడై ఆ అపొస్తలుడు మోసపోలేదు. ఎన్నడూ నశించని ఆనంద మహిమైశ్వర్యాలు గల పరలోక విషయాల పట్ల అతని ఆధ్యాత్మిక స్వభావం ఆకర్షితం కావటంతో తన చుట్టూ ఉన్న వాటి ఘనత, మహిమ, ప్రభావం అతని కంటికి పూచికపుల్లపాటి విలువ కూడ లేనివిగా కనిపించాయి.AATel 165.2

    దేవుని ఆరాధించేవారెవరూలేని ఈ మహానగరంలో ఒంటరివాణ్ని అన్న మనోభావం పౌలుని బాధించింది. సహకార్యకర్తల సానుభూతికి చేయూతకు ఎదురుచూశాడు. మానవ సహవాసానికి సంబంధించినంత వరకు తనకు ఎవ్వరూ లేరని భావించాడు. థెస్సలొనీకయులకు రాసిన ఉత్తరంలో తన మనోభావాల్ని ఈ మాటల్లో వ్యక్తం చేశాడు, “ఏథెన్సులో మేమొంటిగా” ఉన్నాం. 1 థెస్స. 3:1. అధిగమించటం కష్టమనిపించే సమస్యలు అతడి ముందున్నాయి. ఆ ప్రజల్ని మార్చటానికి ప్రయత్నం చేయటం సయితం వ్యర్థమనిపించింది.AATel 165.3

    సీల తిమోతిల కోసం నిరీక్షించే సమయంలో పౌలు చేతులు ముడుచుకొని కూర్చోలేదు. “సమాజ మందిరములలో యూదులతోను, భక్తి పరులైన వారితోను ప్రతిదినము సంత వీధిలో తన్ను కలిసికొనువారితోను తర్కించుచు వచ్చెను.” ఇదిలాగుండగా, ఏథెన్సులో పౌలు ప్రధాన కర్తవ్యం... దేవుని గురించి, నశించిన మానవజాతి విషయంలో ఆయన సంకల్పం గురించి, స్పష్టమైన అభిప్రాయంలేని ప్రజలకు రక్షణ వార్తను అందించటం. అన్యమతాన్ని మిక్కిలి మోసకరమైన, ఆకర్షణీయమైన రూపంలో పౌలు త్వరలో ఎదుర్కోనున్నాడు. AATel 165.4

    ప్రజల ముందు విచిత్రమైన నూతన సిద్ధాంతాల్ని పెడుతున్న ఒక విలక్షణ బోధకుడు తమ నగరంలో ఉన్నట్లు తెలుసుకోటానికి ఏథెన్సు నగర ప్రముఖులకు ఎక్కువ సమయం పట్టలేదు. వీరిలో కొంతమంది పౌలుని వెదకి పట్టుకొని అతనితో సంభాషించడం మొదలు పెట్టారు. కొద్ది సేపటిలో ఓ పెద్దగుంపు పోగుపడింది పౌలు మాటలు వినటానికి. సాంఘికంగాను, ప్రతిభ పరంగాను పౌలు తమతో సరిసాటికాడని ఎగతాళి చెయ్యటానికి కొందరు సన్నద్ధమై వచ్చారు. పౌలును గూర్చి వీరు తమలోతాము ఎగతాళిగా ఇలా అనుకొంటున్నారు, “ఈ వదరుబోతు చెప్పునవి ఏమిటి?” “యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక” “వీడు అన్య దేవతలను ప్రకటించుచున్నాడు” అని కొందరన్నారు.AATel 165.5

    పౌలును సంత వీధిలో కలుసుకొన్న వారిలో “ఎపి కూరీయులలోను స్టోయిక్ లలోను ఉన్న కొందరు జ్ఞానులు” ఉన్నారు. వారూ, తనతో సమావేశమవ్వటానికి వచ్చిన ఇతరులూ పౌలు జ్ఞానం తమ జ్ఞానం కన్నా విస్తారమైందని కొద్ది సేపటిలోనే తెలుసుకొన్నారు. అతడి ప్రతిభ విద్యావంతుల్ని ఆకట్టుకొంది. అతడి హేతువాదం, అతడి అనర్గళ వాగ్దాటి శ్రోతల ప్రశంసల్ని అందుకొన్నాయి. అతడు అనుభవం లేనివాడుకాడని, తాను బోధించే సిద్ధాంతాల్ని సమర్థించే వాదనలతో అన్ని తరగతుల వారిని తృప్తిపర్చగలవాడని అతడి శ్రోతలు గుర్తించారు. హేతువాదాన్ని హేతువాదంతో, వేదాంతాన్ని వేదాంతంతో, వాగ్దాటిని వాగ్దాటితో తన ప్రత్యర్థుల్ని ఎదుర్కొని పౌలు నిర్భయంగా నిలిచాడు.AATel 166.1

    అన్యదేవతలను ప్రచురించటం మూలాన మరణదండన పొందిన సోక్రటీసు ఉదంతాన్ని పౌలు దృష్టికి తెచ్చి అదేరీతిగా వ్యవహరించటం ద్వారా తన ప్రాణానికి ముప్పు తెచ్చుకోవద్దని తన అన్యప్రత్యర్థులు అతణ్ని హెచ్చరించారు. అయితే పౌలు ప్రసంగాలు ప్రజల మనసుల్ని ఆకట్టుకొన్నాయి. అతని నిరాడంబర జ్ఞానం వారి గౌరవాభిమానాల్ని చూరగొన్నది. శాస్త్రంగాని తత్వజ్ఞానుల చాతుర్యంగాని అతణ్ని ఓడించలేకపోయాయి. అందుచేత, ఎట్టి పరిస్థితుల్లోనైన పౌలు తన కథను వారికి చెప్పటానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు గ్రహించి అతడికి ఒక అవకాశం ఇవ్వటానికి వారు తీర్మనించారు.AATel 166.2

    అందుకు వారు పౌలుని మార్స్ కొండ వద్దకు తీసుకువెళ్లారు. ఇది ఏథెన్సు అంతటిలోను మిక్కిలి పవిత్రమైన స్థలం. దాని జ్ఞాపకాలు సంబంధాన్ని బట్టి ప్రజలు దాన్ని ఒక రకమైన మూఢ భక్తితో పరిగణించేవారు. కొందరి విషయంలో ఆభక్తి భయంగా మారింది. ముఖ్యమైన నైతిక, పౌర సంబంధిత అంశాలపై అంతిమ న్యాయాధికారులుగా వ్యవహరించే వ్యక్తులు, మతానికి సంబంధించిన సమస్యల్ని జాగ్రత్తగా పరిశీలించటానికి ఈ స్థలంలోనే సమావేశమయ్యేవారు. జనులతో కిటకిటలాడే వీధులు సందడికీ, బజారు గోల నడుమసాగే నానావిధ చర్చలకూ దూరంగా ఉన్న ఈ స్థలంలో ఈ అపొస్తలుడు చెప్పదలచుకొన్నది అంతరాయమేమీ లేకుండా వినవచ్చు. అతడి చుట్టూ ఏథెన్సు నగరానికి చెందిన కవులు, కళాకారులు, వేదాంతులు, పండితులు, జ్ఞానులు కొలువుతీరారు. వారంతా పౌలుని ఇలా నిలదీశారు, “నీవు చేయుచున్న యీ నూతన బోధయెట్టితో మేము తెలిసికొన వచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొనగోరుచున్నాము”.AATel 166.3

    గంభీర బాధ్యత పై బడ్డ ఆ సమయంలో పౌలు ప్రశాంతంగా ఆత్మస్థయిర్యంతో ఉన్నాడు. అతడి హృదయం ప్రాముఖ్యమైన వర్తమానంతో నిండి ఉంది. అతడి నోటివెంట వస్తున్న మాటలు తాను ఊరకే వాగే వ్యక్తికాడని ఆ ప్రజలికి నమ్మకం పుట్టించాయి. “ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారైయున్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు నా దేవతా ప్రతిమ లను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద -తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి వారు తెలియక దేనియందు భక్తి కలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను” అన్నాడు. వారికి ప్రతిభ పాటవాలు, లోకజ్ఞానం ఎంత ఉన్నా వారు విశ్వాన్ని స్పృజించిన సృష్టికర్తను ఎరుగని అజ్ఞానులు. అయినా సత్యాన్ని అన్వేషిస్తున్న వారు కొందరున్నారు వారిలో. వారు అనంతజ్ఞాని అయిన దేవుణ్ని గూర్చి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.AATel 167.1

    విగ్రహాలతో నిండి ఉన్న దేవాలయం దిశగా చెయ్యి చాపి పౌలు తన హృదయ భారాన్ని వెళ్లబుచ్చుతూ ఏథెన్సువారి తప్పుడు మత సిద్ధాంతాన్ని బట్టబయలు చేశాడు. అక్కడి శ్రోతల్లోని మిక్కలి ప్రతిభావంతులు పౌలు హేతువాదాన్ని విని విస్మయం చెందారు. వారి కళాకృతులతో వారి సాహిత్యంతో వారి మతంతో తనకు మంచి పరిచయం ఉన్నదని పౌలు ప్రదర్శించుకొన్నాడు. వారి ప్రతిమాశాల విగ్రహాలకేసి వేలు చూపిస్తూ మానవుడు చేసిన ప్రతిమా రూపాలతో దేవుణ్ని పోల్చటం సాధ్యం కాదని ఉద్ఘాటించాడు. ఎంత సున్నితంగా పరిగణించినా విగ్రహాలు యెహోవా మహి మను సూచించలేవు అన్నాడు. ప్రతిమలకు ప్రాణం లేదని, వాటిని నియంత్రించేవాడు మానవుడేనని, మానవుడు కదిపినప్పుడే అవి కదులుతాయని తన శ్రోతలకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి వాటిని పూజించేవారు వాటికన్నా ఘనులంటూ చురకలంటించాడు.AATel 167.2

    తన విగ్రహారాధక శ్రోతల మనసుల్ని తమ తప్పుడు మత పరిధులు దాటించి “తెలియబడని దేవుడు” అని వారు వర్ణించిన దేవుణ్ని గూర్చిన సత్యాన్ని వారికి ప్రకటింటాడు. తాను వారికి ప్రకటించిన ఈ దేవుడు మానవుల మీద ఆధారపడేవాడు కాదు అని తన శక్తిని మహిమను హెచ్చించుకోటానికి ఆయనకు మానవుల చేయూత అవసరం లేదు అని చెప్పాడు.AATel 167.3

    నిజమైన దేవుని గుణలక్షణాల్ని - తన సృజన శక్తి నియంత్రించే ఆయన కృప ఉనికి సహా - గూర్చి పౌలు హేతుబద్ద వివరణ విన్న ప్రజలు పౌలుని ప్రశంసించారు. అనర్గళ వాగ్దాటితో పౌలు ఇలా అన్నాడు, “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతమువైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైన కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాదు”. దేవుని ఉనికికి విశాల ఆకాశమండలాలు చాలవు. అలాగైనప్పుడు మానవ హస్తాలతో నిర్మితమైన దేవాలయాలు ఎలా సరిపోతాయి ?AATel 167.4

    కుల వ్యవస్థ ప్రబలంగా ఉన్న ఆయుగంలో, మనుషుల హక్కులకు గుర్తింపే లేని కాలంలో మానవులందరూ సహోదరులు అన్న మహా సత్యాన్ని పౌలు ప్రభోదించాడు. “యావద్భూమి మిద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను” సృజించాడు అని ప్రకటించాడు. దేవుని దృష్టిలో అందరూ సమానులు. మానవులందరూ సృష్టికర్తకు నమ్మకంగా నివసించబద్దులు అన్నాడు. అనంతరం, మానవుడితో దేవుని వ్యవహారాలన్నిటిలోనూ దేవుని కృప కనికరాలు బంగారు నూలుపోగుల్లా ఎలా అల్లుకొని ఉన్నాయో వారికి విశదీకరించాడు. “వారు ఒక వేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని, తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను (ఆయన) ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.”AATel 168.1

    తన చుట్టూ ఉన్న మనుషుల్లో ఉదాత్త మానవ నమూనాల్ని పేర్కొంటూ కవి మాటల్ని ఉపయోగించి అనంతుడైన దేవుణ్ని తండ్రిగా వారంతా ఆయన బిడ్డలుగా చిత్రించాడు. “మనమాయన యందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము.... మనమాయన సంతానమని ఈ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దైవత్వము పోలియున్నదని తలంపకూడదు” అన్నాడు.AATel 168.2

    “ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరు మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించు చున్నాడు.” క్రీస్తు రాకకు ముందున్న చీకటి యుగాల్లో అన్యుల విగ్రహారాధనను దేవుడు చూసిచూడనట్లు పోనిచ్చాడు. కాని ఇప్పుడు తన కుమారుని ద్వారా ఆయన మానవులకు సత్యమనే వెలుగును పంపాడు. సామాన్యులు పేదవారేగాక తత్వవేత్తలు రాజులు లోకంలోని వారందరూ పాపపశ్చాత్తాపం పొంది రక్షణ అందుకోవాలని ఆయన కోరుతున్నాడు. “ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయెడి యొక దినము నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.” మృతుల పునరుత్థానం గురించి పౌలు మాట్లాడినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి; మరికొందరు -దీని గూర్చి చెప్పిన ఇంకొకసారి విందుమనిరి.”AATel 168.3

    అన్యమత విద్యకు కేంద్రమైన ఏథెన్సులో ఈ అపొస్తలుడి కృషి ఈ రకంగా ముగిసింది. ఎందుకంటే ఏథెన్సు ప్రజలు తమ విగ్రహారాధనను గట్టిగా పట్టుకొని నిజమైన మతాన్ని గూర్చిన వెలుగును తిరస్కరించారు. ఒక ప్రజ తాము సాధించిన దాన్ని గురించి తృప్తి చెంది నివసిస్తే వారి నుంచి ఎక్కువ ఆశించటం వ్యర్థం. తమకు జ్ఞానమున్నదని సంస్కారమున్నదని అతిశయిస్తున్నప్పటికీ ఏథెన్సు ప్రజల్లో అవినీతి నానాటికి పెచ్చు పెరిగింది. విగ్రహారాధనకు సంబంధించిన మర్మాలతో తృప్తి చెంది నివసించారు.AATel 169.1

    పౌలు మాటలు విన్నవారిలో కొందరు వాటిలోని సత్యాన్ని గుర్తించారుగాని వారు వినయ మనసులో దేవునిని గుర్తించలేదు. ఆయన రక్షణ ప్రణాళికను అంగీకరించలేదు. ఎంతటి వాగ్దాటి అయినా ఎంత బలమైననాదనైనా పాపిని మార్చలేవు. దేవుని శక్తి మాత్రమే సత్యాన్ని మనసులో నాటింపజేయగలుగుతుంది. ఈ శక్తిని అదే పనిగా తోసిపుచ్చుతున్న వ్యక్తిని మార్చటం అసాధ్యం. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషించారు. అయినా సిలువను గూర్చిన వర్తమానం వారికి బుద్ధిహీనంగా తోచింది. ఎందుచేతనంటే వారు దేవుని వద్దనుంచి వచ్చిన జ్ఞానం కన్నా తమ జ్ఞానమే మిన్న అని భావించారు.AATel 169.2

    ఏథెన్సు ప్రజలు సువార్త పట్ల అంత తక్కువ ఆదరణ చూపటానికి కారణం తమ ప్రతిభ పాటవాల గురించి జ్ఞాన వివేకాల గురించి వారికున్న అతిశయమే. క్రీస్తు వద్దకు నశించిన పాపులుగా ఆత్మవిషయంలో దీనులుగా వచ్చే లోక జ్ఞానులు రక్షణ కలిగించే జ్ఞానాన్ని పొందుతారు. పోతే ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులుగా, తమ జ్ఞానం గురించి అతిశయించేవారు ఆయవ మాత్రమే ఇవ్వగల వెలుగును జ్ఞానాన్ని పొందలేకపోతారు.AATel 169.3

    ఆనాటి అన్యమతం విషయంలో పౌలు ఈ విధంగా వ్యవహరించాడు. ఏథెన్సులో పౌలు పడ్డ శ్రమ వ్యర్థం కాలేదు. ప్రముఖ పౌరుల్లో ఒకడైన దియొనూసి, మరి కొందరూ సువార్తను అంగీకరించి విశ్వాసుల సమూహంలో చేరారు. -AATel 169.4

    ఎంతో జ్ఞానం, సంస్కారం, కళాప్రావీణ్యం ఉన్నప్పట్టకీ దుర్మారతలో కూరుకుపోయిన ఏథెన్సు ప్రజల విగ్రహారాధనను పాపాల్ని దేవుడు తన సేవకుడైన పౌలు ద్వారా గద్దించాడు. గర్వాంధులైన ఏథెన్సు ప్రజల జీవితాన్ని గూర్చిన ఈ సన్నివేశాల్ని దైవావేశమే మన ముందుంచింది. పౌలు మాటల గురించి, అతని వైఖరి గురించి, పరిసరాల గురించి ఆవేశపూరిత కలం ఇస్తున్న వివరాలు ముందు తరాల ప్రజలందరికీ వారసత్వంగా అందాల్సి ఉన్నాయి. పౌలు అచంచల విశ్వాసానికి, ఒంటరిగా శ్రమలనుభవించినప్పుడు అతడు ప్రదర్శించిన ధైర్యానికి, అన్యమతం నడిబొడ్డున క్రైస్తవ మత పరంగా అతడు సాధించిన విజయానికి అవి సాక్ష్యంగా నిలుస్తాయి.AATel 169.5

    పౌలు మాటల్లో సంఘానికి గొప్ప జ్ఞాన సంపద ఉన్నది. అతడున్న పరిస్థితి అహంకారులైన తన శ్రోతల్ని సునాయాసంగా నొప్పించగల ఏదో మాట అని శ్రమలు కొనితెచ్చుకోగల పరిస్థితి. తన ప్రసంగం వారి దేవుళ్ల మీద ఆపట్టణ ప్రముఖులమీద దాడి చేసేదై ఉంటే అతనికి కూడా సోక్రటీసుకు పట్టిన గతే పట్టి ఉండేది. అయితే దైవపరంగా వచ్చిన నేర్చుతో వారి గమనాన్ని తమ అన్యదేవతల నుంచి జాగ్రత్తగా మళ్లించి తమకు తెలియని నిజమైన దేవుడైన యెహోవా మీద నిలిపాడు. నేడు దైవAATel 170.1

    ధర్మశాస్త్రానికా లేక దుర్మార్థతకు రాజైన సాతానుకా విధేయత చూపటమన్న విషయమై ఎంపిక చేసుకొనేందుకుగాను లోక ప్రముఖుల ముందు లేఖన సత్యాల్ని ఉంచటం అవసరం. రక్షణార్థమైన జ్ఞానంలో తమను వివేకవంతుల్ని చేసే సత్యాన్ని దేవుడు వారి ముందుంచుతాడు. కాని దాన్ని అంగికరించమని వారిని ఒత్తిడి చేయడు. దాన్ని కాదని వారు దూరంగా వెళ్లిపోతే తమ క్రియల పర్యవసానాన్ని అనుభవించటానికి వారిని విడిచి పెడ్తాడు.AATel 170.2

    “సిలువను గూర్చిన వార్త, నశించుచున్నవారికి వెళ్లితనముగాని రక్షింపబడు చున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.” “ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెట్టివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైన వారిని సిగుపర చుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.” 1 కొరింథీ 1:18,19,27,28. ఉద్దండ పండితులు రాజనీతిజ్ఞులు లోకనాయకుల్లో చాలామంది లోక జ్ఞానం వల్ల దేవుని ఎరుగరు గనుక ఈ చివరి దినాల్లో వెలుగునుంచి పక్కకు తప్పుకొంటారు. అయినప్పటికీ మనుషులికి సత్యాన్ని అందించటానికి ప్రతీ అవకాశాన్ని, సద్వినియోగపర్చుకోవాలి. కొంతమంది ఈ దైవ సంగతులు తమకు తెలియవని కొంతమంది అంగీకరించి మహోపాధ్యాయుడైన యేసు పాదాలవద్ద కూర్చొని నేర్చుకొంటారు.AATel 170.3

    హెచ్చు తరగతుల ప్రజల్ని చేరటానికి చేసే కృషిలో సువార్త సేవకులకు బలమైన విశ్వాసం అవసరం. పరిస్థితులు నిరాశాజనకంగా పైకి కనిపించవచ్చు. కటిక చీకటితో నిండిన ఘడియలో పైనుంచి వెలుగు కనిపిస్తుంది. దేవుని ప్రేమించి సేవించేవారి బలం అనుదినం నూతనమౌతుంది. ఆయన ఉద్దేశాన్ని నేరవేర్చేటప్పుడు వారు తప్పటడుగు వేయకుండేందుకు అనంతుడైన దేవుడు తన జ్ఞానాన్ని వారికి దఖలు పర్చుతాడు. ఆ సువార్త సేవకులు తమ తొలి విశ్వాసాన్ని చివరివరకు బలంగా పట్టుకొని ఉండాలి. మన లోకాన్ని ఆవరించిన చీకటిలో దేవుని సత్యమనే వెలుగు ప్రకాశించాల్సి ఉన్నదని వారు గుర్తుంచుకోవాలి. దేవుని సేవ సంబంధంగా నిస్పృహకు తావులేదు. తమ్ముని తాము దేవుని సేవకు అంకితం చేసుకొన్నవారు తమకు వచ్చే ప్రతీ పరీక్షలోనూ తమ విశ్వాసాన్ని కనపర్చాలి. తన సేవకులకు అవసరమైన శక్తినివ్వటానికి తమ వివిధ అవసరాలకు కావలసిన వివేకాన్ని ప్రసాదించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తనపై ఉంచే వారి ఆశలు ఆశయాల్ని ఆయన తప్పక నెరవేర్చుతాడు.AATel 170.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents