Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    40—కైసరుకు పౌలు విజ్ఞప్తి

    “ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధానయాజకులును యూదులలో ముఖ్యలును పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు... మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి.” యెరూషలేముకు వచ్చే మార్గంలో పౌలును అడ్డుకుని చంపాలన్నదే ఈ మనవి చెయ్యటంలో వారి ఉద్దేశం. అయితే ఫేస్తు తన హోదాకున్న ఉన్నత బాధ్యతను గుర్తెరిగినవాడు గనుక పౌలును పంపించటానికి మెత్తగా నిరాకరించాడు. “నేరము మోపబడినవాడు నేరము మోపినవారికి ముఖాముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనుష్యులనినైనను అప్పగించుట రోమీయుల ఆచారముకాదు” అని చెప్పాడు. అందుకు ఫేస్తు తాను కైసరయకు ‘వెళ్ళబోవు చున్నాను”, “గనుక మీలో సమర్థులైనవారు నాతో కూడవచ్చి ఆ మనుష్యునియందు తప్పిదమేదైన ఉంటే అతనిమీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను.”AATel 304.1

    యూదులు కోరింది ఇదికాదు. లోగడ కైసరయలో తమకు కలిగిన పరాజయాన్ని వారు మర్చిపోలేదు. అపొస్తలుడి ప్రశాంత వర్తన, శక్తిమంతమైన వాదనలకు వ్యత్యాసంగా ఉన్న తను దుష్టవైఖరి, అర్థరహిత ఆరోపణలు నిస్సారంగా తేలికగా కనిపించటం తధ్యం. పౌలును విచారించటానికి యెరూషలేముకు తీసి కురావలసిందిగా వారు మళ్ళీ మనవి చేశారు. కాని పౌలు విషయంలో కైసరయలోనే న్యాయమైన విచారణ జరపటానికి తన దృఢ నిశ్చయాన్ని ఫేస్తు ప్రకటించాడు. తన సంకల్పం చొప్పున పౌలు జీవితాన్ని పొడిగించేందుకు దేవుడే ఫేస్తు తీర్మానాన్ని అదుపుచేశాడు.AATel 304.2

    తమ ఉద్దేశాలకు గండిపడటంతో యూదునాయకులు పౌలుకు వ్యతిరేకంగా న్యాయాధిపతిముందు సాక్ష్యం చెప్పటానికి వెంటనే సమ్మతించారు. యెరూషలేములో కొన్ని దినాలు గడిపిన తర్వాత కైసరయకు తిరిగి వచ్చిన ఫేస్తు “మరునాడు న్యాయ పీఠము మీద కూర్చుండి పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను.” “పౌలు వచ్చినప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరిగాని వాటిని ఋజువుచేయలేకపోయిరి.” ఈసారి న్యాయవాది లేనందువల్ల యూదులు తామే నేరారోపణ చేయటం మొదలు పెట్టారు. విచారణ కొనసాగుతుండగా నిందితుడు ప్రశాంతంగా నిజాయితితో వారి మాటల్లోని డొల్లతనాన్ని స్పష్టంగా కనపర్చాడు.AATel 304.3

    వివాదం కేవలం యూదు సిద్ధాంతాలకు సంబంధించిందని, సవ్యంగా అవగతం చేసుకుంటే పౌలు పై మోపిన నేరాల పరంగా నిరూపించటానికి అతడికి మరణ దండనకుగాని చివరికి కారాగార వాసం విధింపుకుగాని ఆధారం ఏమీలేదని ఫేస్తు గ్రహించాడు. అయినా, పౌలుని దోషిగా తీర్మానించకపోతే లేదా అతణ్ని తమ చేతులికి అప్పగించకపోతే యూదుల్లో చెలరేగనున్న ఆగ్రహ తుఫానును అతడు చూశాడు. “యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని” ఫేస్తు పౌలు పక్కకు తిరిగి తన రక్షణకింద యెరూషలేముకు వెళ్ళి అక్కడ సెన్ డ్రెన్ సభచే విచారణకు తనకు సమ్మతమేనా అని ప్రశ్నించాడు.AATel 305.1

    తమ నేరాల మూలంగా తమమీదికి తామే దేవుని ఉగ్రతను తెచ్చుకుంటున్న ఆ ప్రజలనుంచి తనకు న్యాయం లభించదని అపొస్తలుడికి తెలుసు. ఏలియా ప్రవక్తమల్లే తానుకూడా పరలోకంనుంచి వచ్చిన వెలుగును విసర్జించి సువార్తకు వ్యతిరేకంగా తమ హృదయాల్ని కఠినపర్చుకున్న ప్రజల నడుమకంటే అన్యుల మధ్యే తనకు క్షేమం ఉంటుందని పౌలు గ్రహించాడు. పోరాటంలో అలసిపోయిన అతడి ఆత్మ తరచుగా జరుగుతున్న జాప్యాలు తన విచారణ, కారాగారం విషయాలపై ఉత్కంఠ ఇక దుర్భరంగా ఉంది. కాబట్టి రోమా పౌరుడిగా తనకున్న హక్కును వినియోగించుకుని కైసరుకు విజ్ఞప్తి చేసుకున్నాడు.AATel 305.2

    ఫేస్తు ప్రశ్నకు జవాబుగా పౌలు ఇలా అన్నాడు, “కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడియున్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును. నేను న్యాయము తప్పి మరణమునకు తగిన దేదైనను చేసిన యెడల మరణమునకు వెనుకదీయను, వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుట ఎవరి తరముకాదు, కైసరు ఎదుటనే చెప్పుకొనెదను.”AATel 305.3

    పౌలుని హత్య చేయటానికి యూదుల కుట్రలగురించి ఫేస్తుకి ఏమీ తెలియదు. పౌలు కైసరు తీర్పుకు విజ్ఞప్తి చెయ్యటం ఫేస్తుని ఆశ్చర్యపరచింది. అపొస్తలుడి మాటలతో ఆ కోర్టు చర్యలు ఆగిపోయాయి. “అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరు నొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను.”AATel 305.4

    ఇలా ద్వేషంనుంచి పుట్టిన దురభిమానం, స్వనీతి కారణంగా మరోసారి దైవ సేవకుడు సంరక్షణ కోసం అన్యుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ద్వేషంవల్లే ఏలీయా ప్రవక్త సారెపతు విధవరాలి ఆసరాకోసం పారిపోవలసి వచ్చింది. యూదుల్ని విడిచి పెట్టి సువార్త ప్రబోధకులు ఇలా అన్యజనులకు సువార్త ప్రకటించాల్సి వచ్చింది. ఈ యుగంలో నివసిస్తున్న దైవ ప్రజలూ ఈ ద్వేషాన్ని ఎదుర్కొంటారు. యూదుల హృదయంలో రాజ్యమేలిన గర్వం, ఛాందసం, స్వార్థం, హింసాప్రవృత్తి క్రీస్తు అనుచరులమని ప్రకటించుకొనే పలువురిలో చోటుచేసుకున్నాయి. క్రీస్తు ప్రతినిధులమని చెప్పుకునే వ్యక్తులు క్రీస్తు విషయంలోను అపొస్తలుల విషయంలోను తమ ప్రవర్తనకు సంబంధించి ప్రధాన యాజకులు అధికారులు వ్యవహరించిన తీరుగానే భవిష్యత్తులో వ్యవహరిస్తారు. నమ్మకమైన దైవ సేవకులు త్వరలో ఎదుర్కోనున్న గొప్ప ఉపద్రవంలో అదే హృదయ కాఠిన్యాన్ని, అదే క్రూర సంకల్పాన్ని అదే త్రీవ ద్వేషాన్ని ఎదుర్కుంటారు.AATel 306.1

    ఆ దుర్దిన్నాల్లో తమ అంతరాత్మ ప్రబోధాన్ననుసరించి నిర్భయంగా దేవుని సేవించేవారందరికీ ధైర్యం, స్థయిర్యం దేవునిగురించి ఆయన వాక్యంగురించిన జ్ఞానం అవసరం. ఎందుకంటే దేవునికి నమ్మకంగా నివసించే వారిని హింసింస్తారు. వారి ఉద్దేశాల్ని తప్పు పడ్డారు. వారి సత్కార్యానికి తప్పుడు అర్ధాలు చెబుతారు. వారిని దుర్మార్గులుగా ప్రచారం చేస్తారు. చెడు మంచిగాను మంచి చెడుగాను కనిపించేటట్లు చేసేందుకుగాను హృదయాన్ని ప్రభావితం చేసి అవగాహనను మసకబార్చటానికి సాతాను తన వంచన శక్తిని వినియోగించి పనిచేస్తాడు. దైవ ప్రజల విశ్వాసం ఎంత బలీయంగాను పవిత్రంగాను ఉంటుందో ఆయనకు విధేయులై నివసించటానికి వారి తీర్మానం ఎంత పటిష్టంగా ఉంటుందో, నీతిమంతులమని చెప్పుకొంటూ దైవధర్మశాస్త్రాన్ని కాలరాచే ప్రజల ఉగ్రతను వారిపట్ల అంత భీకరంగా సాతాను రెచ్చగొడ్తాడు. పూర్వం భక్తులకు అప్పగించబడ్డ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉంచుకోటానికి దృఢమైన నమ్మిక, సాహసంతో కూడిన ఆశయం అవసరం.AATel 306.2

    తన ప్రజలు త్వరలో రానున్న సంక్షోభానికి సిద్ధపడాలని దేవుడు కోరుతున్నాడు. సిద్ధబాటుతోనో అది లేకుండగానే అందరూ దాన్ని ఎదుర్కోవాల్సిందే. దైవ ప్రమాణానికి అనుగుణంగా తమ జీవితాల్ని దిద్దుకున్నవారు ఆ పరీక్షా సమయంలో దృఢంగా నిలిచి ఉంటారు. మనస్సాక్షికి సంబంధించిన విషయాల్లో లౌకిక అధికారులు తమ నేతలతో చేతులు కలిపి అంతరాత్మను శాసిస్తే అప్పుడు ఎవరు నిజంగా దేవునికి భయపడి ఆయనను సేవిస్తారో తెలుస్తుంది. చీకటి గాఢంగా ఉన్నప్పుడు క్రీస్తును పోలిన ప్రవర్తన మిక్కిలి ప్రకాశవంతమౌతుంది. తక్కిన నమ్మికలన్నీ విఫలమైనప్పుడు యెహోవా అంటే ఎవరికి స్థిరమైన నమ్మిక ఉందో అప్పుడు కనిపిస్తుంది. దైవ సేవకులకు కీడు తలపెట్టే సత్య విరోధులు అన్ని పక్కల పొంచి ఉండగా దేవుడు వారిని కాపాడాడు. వారికి మేలు చేస్తాడు. అరణ్య ప్రదేశంలో ఆయన వారికి నీడనిచ్చే శిల వలే ఉంటాడు.AATel 306.3