Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    25—మహా ప్రస్థానం

    ఇశ్రాయేలు ప్రజలు నడుంకట్టుకొని చెప్పులు తొడుక్కొని చేతిలో కర్ర పట్టుకొని నిలబడ్డారు. వెళ్లమని రాజు ఎప్పుడు చెబుతాడా అని నిశ్శబ్ధంగా, భయం భయంగా ఎదురు చూస్తూ ఉన్నారు. తెల్లవారకముందే ప్రయాణమై సాగుతూ ఉన్నారు. ఐగుప్తుపై తెగుళ్లు పడుతున్న సమయంలో, ఆ బానిస ప్రజల హృదయాల్లో దైవశక్తి విశ్వాసాన్ని రగిలిస్తుండగా తమ హింసకుల గుండెల్లో గుబులు పుడుతున్న తరుణంలో ఇశ్రాయేలీయులు నెమ్మదిగా గోషేనులో సమావేశమయ్యేవారు. వారు వెళ్లిపోవటం అర్థాంతరంగా సంభవిస్తున్నప్పటికీ, ప్రయాణంలో ఉన్న విస్తార జన సమూహాన్ని నియంత్రించటానికి అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రజల్ని గుంపులు గుంపులుగా విభజించి వాటికి నాయకుల్ని నియమించారు.PPTel 269.1

    ” పిల్లలుగాక కాల్బలము ఆరులక్షలు. వీరు అనేకులైన అన్యజనుల సమూహమును...వారితోకూడ బయలుదేరెను.” ఇశ్రాయేలీయుల దేవున్ని విశ్వసించి బయలుదేరిన వారు ఈ సమూహంలో ఉన్నారు. అంతకన్నా ఎక్కువ మంది ఐగుప్తు తెగుళ్ల నుంచి తప్పించుకోవాలని వచ్చినవారూ లేదా ఉద్రేకం, ఉత్సాహంతో నిండి కదులుతున్న జన సమూహంతో కలిసి వచ్చినవారూ ఉన్నారు. ఈ తరగతి ప్రజలు ఇశ్రాయేలీయులకి నిత్యమూ ఆటంకంగాను ఒక ఉచ్చుగాను ఉన్నారు. PPTel 269.2

    ప్రజలు తమతో “గొట్టెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మంద”ను తీసుకొని వెళ్లారు. ఈ మందలే ఇశ్రాయేలీయుల సంపద. ఐగుప్తీయులల్లే వీరు తమ ఆస్తిని రాజుకి అమ్మలేదు. యాకోబు అతడి కుమారులు తమతోపాటు తమ మందల్ని ఐగుప్తుకి తెచ్చారు. అక్కడ ఆ మందలు విస్తారంగా పెరిగాయి.PPTel 269.3

    ఐగుప్తు నుంచి వెళ్లిపోవకముందు ఇశ్రాయేలీయులు తమ వెట్టి చాకిరీకి పరిహారం చెల్లించమని మోషే ఆదేశం మేరకు రాజును అడిగినప్పుడు వారిని వదిలించుకోటానికి ఆతృతగా ఉన్న ఐగుప్తీయులు ఆ కోరికను నిరాకరించలేకపోయారు. ఆ బానిసలు తమ హింసకుల కొల్లసొమ్ముతో ఉల్లాసంగా వెళ్లిపోయారు.PPTel 269.4

    కొన్ని శతాబ్దాలు ముందు దర్శనంలో అబ్రాహాముకి దేవుడు కనపరచిన ఈ ప్రావచనిక చరిత్ర ఆ రోజుపూర్తి అయ్యింది, “నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగానుందురు. వారు నాలుగు వందల యేండ్లు వారిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు”. ఆదికాండము 15:13, 14. నాలుగు వందల సంవత్సరాల కాలం నెరవేరింది. “ఆ దినమందే యెహోవా సేవలన్నియు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిపోయెను”. ఐగుప్తునుంచి వెళ్లిపోయేటప్పుడు ఇశ్రాయేలీయులు యోసేపు అస్థికల రూపంలో ప్రశస్తమైన ఆస్తిని తమతో తీసుకువెళ్లారు. దేవుని వాగ్దానం నెరవేర్పుకోసం ఈ అస్థికలు సుదీర్ఘకాలం అక్కడే ఉండి ఇశ్రాయేలీయులు దాసులుగా ఉన్నకాలంలో రానున్న దాస్యవిముక్తికి జ్ఞాపికగా నిలిచాయి.PPTel 269.5

    ఫిలిప్తీయుల దేశంలోనుంచి నేరుగా కనానుకు వెళ్లే మార్గం బదులు దక్షిణ దిశగా ఎర్రసముద్రతీరం కేసివెళ్లే మార్గాన్ని ఇశ్రాయేలుకి ప్రభువు ఎంపిక చేశాడు. “ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిప్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు” వారు ఫిలిష్తియా గుండా వెళ్లటానికి ప్రయత్నించి ఉంటే వారిని ఫిలిప్తీయులు అడ్డుకొనేవారు. యజమానుల నుంచి పారిపోతున్న దాసులుగా వారిని పరిగణించి వారితో వీరు యుద్ధం చేసేవారు. యుద్ధ ప్రియులైన ఈ ప్రజలతో యుద్ధం చేయటానికి ఇశ్రాయేలీయులు సిద్ధంగా లేరు. ఇశ్రాయేలీయులికి దేవుని గురించి ఎక్కువ తెలియదు. దేవుని పై వారికి విశ్వాసం లేదు. వారు భయపడి అధైర్యం చెందేవారు. వారికి ఆయుధాలు లేవు. వారు యుద్ధానికి అలవాటు పడ్డవారుకాదు. దీర్ఘకాలం బానిసత్వం వారిని కుంగదీసింది. అంతేకాదు వారితో స్త్రీలు, పిల్లలు, మందలు ఉండటం యుద్ధానికి ఆటంకం. వారిని ఎర్ర సముద్రం మార్గాన నడిపించటంలో తాను దయగల విజ్ఞత గల దేవుడనని ప్రభువు ప్రత్యక్ష పర్చుకొన్నాడు.PPTel 270.1

    “వారు సుక్కోతునుండి ప్రయాణమై పోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయేనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్థంభములోను, వారికి వెలుగు నిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్థంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటివేళ మేఘ స్థంభమునైనను, రాత్రివేళ అగ్ని స్థంభమునైనను ప్రజల యెదుట నుండి తొలగించలేదు”. కీర్తనల రచయిత ఇలా అంటున్నాడు, “వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను. రాత్రి వెలుగు నిచ్చుటకై అగ్నిని కలుగజేసెను” కీర్తనలు 105:39; 1 కొరింథీ 10:1, 2 కూడా చూడండి. అదృశ్యుడగు తమ నాయకుని ధ్వజం వారితో ఉన్నది. పగటివేళ తమ ప్రయాణంలో మేఘం నడిపించింది లేదా వారి పై ఉండి వారికి నీడ నిచ్చింది. మిక్కుటమైన ఎండలో వారికి నీడనిచ్చింది. దాని చల్లదనం, తేమ వల్ల ఎడారి వేడి నుంచి ఉపశమనం కలిగింది. రాత్రివేళ అది అగ్నిస్థంభమయ్యేది. అది వారి శిబిరానికి వెలుగునిచ్చి తమతో నిత్యమూ దేవుడున్నాడన్న నిశ్చయతను ఇచ్చింది. PPTel 270.2

    దుష్ట శక్తులతో తమ చివరి పోరాటంలో తన ప్రజల విషయంలో దేవుని శ్రద్ధను సూచిస్తూ యెషయా తన ప్రవచనాల్లో ఒకదానిలో మేఘ స్థంభం గురించి, అగ్నిస్థంభం గురించి ఇలా ప్రస్తావిస్తున్నాడు : “సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘ ధూపములను, రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటిమీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలి వానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును” యెషయా 4:5, 6.PPTel 271.1

    వారు విశాలమైన ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేశారు. తాము వెళ్తున్న మార్గం ఎక్కడకు తీసుకువెళ్తుందా అనుకొంటూ సాగారు. దీర్ఘ ప్రయాణం వల్ల వారు అలసి పోతున్నారు. తమను ఐగుప్తీయులు తరుముకుని వస్తారని కొందరు భయపడ్డారు. కాని మేఘ స్థంభం ముందుకు కదిలింది. వారు కూడా ముందుకు కదిలారు. పక్కనున్న కొండల మధ్యకు ప్రజల్ని నడిపించి అక్కడ సముద్రం పక్క శిబిరం ఏర్పాటు చేయమని దేవుడు మోషేని ఆదేశించాడు. తమను ఫరో తరుముకు వస్తాడని అయినా తమను అతడి చేతినుంచి విమోచించి ఘనత పొందుతానని ప్రభువు మోషేతో చెప్పాడు. యెహోవాను సేవిచంటానికి ఎడారిలో ఆగకుండా ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం దిశలో వెళ్తున్నారని ఐగుప్తులో వార్తలు ప్రచారమయ్యాయి. తమ బానిసలు తిరిగి వచ్చే ఉద్దేశం లేకుండా పారిపోతున్నా రని ఫరోకి అతడి సలహాదార్లు ఫిర్యాదు చేశారు. తమ జ్యేష్ఠ సంతానం మరణం దేవుని శక్తివల్ల జరిగిందని భావించటం పొరపాటని ప్రజలు రాజుతో అన్నారు. దేశంలోని జ్ఞానులు గొప్పవారు ఆ తెగుళ్లు స్వాభావికంగా వచ్చినవేగాని దైవశక్తివల్ల కాదని రాజుతో చెప్పారు. “మనమెందుకీలాగు చేసితిమి? మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి?” అని అరిశారు.PPTel 271.2

    ఫరో తన సైన్యాన్ని కూర్చుకొన్నాడు. “శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథములన్నిటిని”, గుర్రపు దళాల్ని, అధిపతుల్ని, పదాతిదళాల్ని తీసుకొని బయలుదేరాడు. ఇశ్రాయేలుని తరుముతున్న సేనకు స్వయాన రాజు అతడితో కొందరు దేశ ప్రముఖులు నాయకత్వం వహించారు. తమ దేవుళ్ల దయను పొందటానికి ఆరీతిగా తాము తల పెట్టిన కార్యంలో జయం పొందటానికి వారితోపాటు యాజకులు కూడా వెళ్లారు. తన బలప్రదర్శన ద్వారా ఇశ్రాయేలీయుల్ని భయభ్రాంతుల్ని చేయాలని ఫరో ఉద్దేశించాడు. ఇశ్రాయేలీయుల దేవునికి తమ బలవంతపు లొంగుబాటు ఇతర దేశాల దృష్టిలో తమకు తలవంపులు కలిగిస్తుందని ఐగుప్తీయులు బాధపడ్డారు. ఇప్పుడు పారిపోతున్న తమ బానిసల్ని తమ బాహుబలంతో వెనక్కి తేవటంద్వారా తమ గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోటమే గాక బానిసల ఊడిగం కూడా తమకు దక్కుతుందని భావించారు. PPTel 271.3

    హెబ్రీయులు సముద్రం పక్క శిబిరం వేసుకొని ఉన్నారు. వారి ముందు సముద్ర జలాలు, దక్షిణాని పెద్ద పర్వతం వారి ప్రయాణానికి పెద్ద ఆటంకాలుగా నిలిచాయి. వెనుక కొంతదూరంలో మెరుస్తున్న కవచాలు కదుల్తున్న రథాలు అకస్మాత్తుగా వారికి కనిపించాయి. గొప్ప సైన్యం తమను తరుముకు వస్తున్న సూచనలు కనిపించాయి. ఆ సైన్యం తమను సమీపించినప్పుడు ఐగుప్తు సైన్యం తమను తరుముకొంటూ వస్తున్నట్లు ఇశ్రాయేలీయులు గుర్తించారు. ఇశ్రాయేలీయుల హృదయాలు భయంతో వణుకుతున్నాయి. కొందరు దేవునికి మొర పెట్టుకున్నారు. కొందరైతే మో షేవద్దకు పరుగెత్తుకు వెళ్లి, “ఐగుప్తులో సమాధులు లేవని యీ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా? మేము ఈ అరణ్యములో చచ్చుటకంటే ఐగుప్తీయులకు దాసులమగుట మేలు” అన్నారు.PPTel 272.1

    తన నిమిత్తం దేవుడు ప్రదర్శించిన శక్తిని పదే పదే కళ్లారా చూసినప్పటికీ దేవుని పట్ల తన ప్రజలు విశ్వాసం కనపర్చకపోవటం మో షేకి తీవ్ర సంతాపం కలిగించింది. తాను దేవుని ఆదేశాన్ని నిష్టగా పాటిస్తూ వ్యవహరిస్తుండగా తమ పరిస్థితుల్లోని కష్టాలు, అపాయాలకు ప్రజలు తనను నిందించటం దేనికి అని ఎంతో నొచ్చుకున్నాడు. నిజమే, దేవుడు జోక్యం కలిగించుకొని తమకు సహాయం చేస్తే తప్ప వారు తప్పించుకొనే మార్గం లేదు. కాని దేవుని ఆదేశానుసారంగా ఈ పరిస్థితుల్లోకి తాము వచ్చినందుకు తమకు సంభవించబోయే దాన్ని గురించి మో షేకి ఎలాంటి భయమూ లేదు. ప్రజల్ని అనుసరిస్తూ వారికి హామీ యిస్తూ మోషే ఇచ్చిన జవాబు ఇది, ‘భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీర ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే యుండవలెను”.PPTel 272.2

    ఇశ్రాయేలీయుల సమూహాల్ని ప్రభువు ముందు నిలకడగా ఉంచటం సులభం కాదు. క్రమశిక్షణ ఆత్మ నిగ్రహం లోపించటంతో ప్రజలు సహనం కోల్పోయి దౌర్జన్యానికి దిగారు. తమ హింసకుల చేతుల్లో వెంటనే పడిపోటం తథ్యమని భావించి గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టారు. ముందుకి సాగటానికి సంకేతంగా మేఘస్థంభం కదిలే దాన్ననుసరించి వారు కదిలారు. అది గొప్ప విపత్తుకు సూచిక ఏమో అని భయపడనారంభించారు. మేఘస్థంభం పర్వతం తప్పు పక్కనుంచి నడిపించి తమను ఈ ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితికి నడిపించింది గదా అని తర్కించుకొన్నారు. ఈ రీతిగా దేవుని దూత దుర్ఘటనను సూచించే దూతగా వారి కళ్లకు కనిపించాడు.PPTel 273.1

    అయినా ఇప్పుడు ఐగుప్తీయులు వారిని తరుముకుంటూ వస్తున్నప్పుడు మేఘస్తంభం ఠీవీగా ఆకాశంలోకి లేచి ఇశ్రాయేలీయుల్ని దాటి వెళ్లి వారికీ, ఐగుప్తు సైన్యానికి మధ్య నిలిచింది. తరుముతున్న వారికీ తరుమబడున్నవారికి మధ్య బ్రహ్మాండమైన చీకటి గోడ ఏర్పడింది. ఐగుప్తీయులికి హెబ్రీయుల శిబిరం కనిపించటం లేదు. వారు ఆగిపోక తప్పలేదు. కాగా రాత్రి చీకటి గాఢమవటంతో ఆ మేఘపు గోడ హెబ్రీయులికి గొప్ప వెలుగై శిబిరమంతా పగటి వెలుగుతో నింపింది.PPTel 273.2

    ఇశ్రాయేలీయుల హృదయాలు నిరీక్షణతో తెప్పరిల్లాయి. మోషే ప్రభువుకి మొర పెట్టుకోగా ఆయన “నీవేల నాకు మొర పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతోను చెప్పుము. నీవు నీ కట్టను ఎత్తి ఆ సముద్రమువైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచి పోవుదురు” అన్నాడు.PPTel 273.3

    ఇశ్రాయేలీయులు సముద్రం దాటటాన్ని వర్ణిస్తూ కీర్తన కారుడిలా గానం చేశాడు, “నీ మార్గము సముద్రములోనుండెను. నీ త్రోవలు మహాజనములలో నుండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడకయుండెను. మోషే, అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి” కీర్తన 17:19, 20. మోషే తన కర్రను చాపగా సముద్రం రెండు పాయలైంది. ఆరిన నేల పై నడుస్తూ ఇశ్రాయేలీయులు సముద్రంలోకి వెళ్లారు. వారికి రెండుపక్కలా నీరు గోడలా నిలిచి ఉంది. నురుగు కిరీటాలు ధరించిన తరంగాలపై దేవుని అగ్నిస్తంభం వెలుగుపడి సముద్రంలో బ్రహ్మాండమైన చాలులా ఏర్పడ్డ దారి పై ప్రకాశిస్తూ సముద్రం అవతలి తీరాన ఉన్న చీకటిలో కలిసిపోయింది.PPTel 273.4

    “ఐగుప్తీయులును, ఫరో గుఱ్ఱములును, రథములును, రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడునట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి”. మర్మపూరితమైన ఆ మేఘం వారి కళ్లముందే అగ్ని స్తంభంగా మారింది. ఉరుములు పెళ పెళమన్నాయి. మెరుపులు తళతళ మెరిసి కళ్లు జిగేలు మనిపించాయి. “మేఘ రాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను” కీర్తనలు 77:17.PPTel 274.1

    ఐగుప్తీయుల్లో గందరగోళం ఆందోళన చోటు చేసుకొన్నాయి. ప్రకోపించిన పంచభూతాలు ఘోషలోంచి ఉగ్రుడైన దేవుని సర్వం వారికి వినిపించింది. వెనక్కు తిరిగి ఒడ్డుకు పారిపోవటానికి ప్రయత్నించాడు. అంతలో మోషే తన కర్రను చాపాడు. ఆ పక్క ఈ పక్క గోడలా నిలిచి ఉన్న నీరు గొప్ప శబ్దంతో గొప్ప శక్తితో ఏకమై ఐగుప్తీయుల సైన్యాన్ని కబళించివేసింది.PPTel 274.2

    ఉదయం అయ్యేసరికి వారికున్న శత్రు శేషమంతా సముద్రంలోనుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చి యుద్ధ దుస్తుల్లో ఉన్న ఐగుప్తు సేన శవాలే. అతి భయంకరమైన అపాయం నుంచి ఒక రాత్రిలో సంపూర్ణ విమోచన లభించింది. బానిసలు, యుద్ధ మంటే తెలియనివారు, స్త్రీలు, పిల్లలు, గొర్రెలు, పశువుల మందలతో ఉన్నవారు, ముందు సముద్రం, వెనుక తరుముకొంటూ వస్తున్న ఐగుప్తు సైన్యం వీటితో నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ విస్తార జనం తమ మార్గం సముద్రంలో తెరుచు కోటం; తమ శత్రువులు విజయం వస్తుందని కని పెడ్తున్న సమయంలో నశించటం చూశారు. వారికి విజయం చేకూర్చింది యెహోవా దేవుడే. వారి హృదయాలు కృతజ్ఞతతోను, విశ్వాసంతోను నిండాయి. వారిలో చెలరేగిన ఉత్సాహం, ఉద్వేగం స్తుతి గీతాలతో వ్యక్తం చేశారు. దేవుని ఆత్మ మోషే మీదికి రాగా అతడు దేవుడిచ్చిన విజయానికి ఆయనకు కృతజ్ఞత స్తుతి సంకీర్తనలో ప్రజల్ని నడిపించాడు. మానవ చరిత్రలో అతి ప్రాచీనమైన అతి సుందరమైన గీతాలలో ఇది ఒకటి. PPTel 274.3

    “యెహోవాను గూర్చి గానము చేసెదను
    ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును
    ఆయన సముద్రములో పడద్రోసెను
    యెహోవాయే నా బలము నా గానము
    ఆయన నాకు రక్షణయు ఆయెను
    ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను
    ఆయన నా పితరుల దేవుడు
    ఆయన మహిమ నుతించెదను.
    యెహోవా యుద్ధ శూరుడు
    యెహోవా అని ఆయనకు పేరు
    ఆయన ఫరో రథములను అతని సేనను
    సముద్రములో పడద్రోసెను
    అతని అధిపతులలో శ్రేష్ఠులు
    ఎఱ్ఱ సముద్రములో మునిగిపోయిరి
    ఆగాధ జలములు వారికి కప్పెను
    వారి రాతివలె అడుగంటి పోయిరి
    యెహోవా, నీ దక్షిణ హస్తము బలమొంది
    అతిశయించును
    యెహోవా, నీ దక్షిణ హస్తము చితక గొట్టును
    నీ మీదికి లేచువారిని నీ
    మహితాతిశయమువలన అణచి వేయుదువు
    నీ కోపాగ్నిని రగుల జేయుదువు
    అది వారిని చెత్తవలె దహిందువు
    నీ నాసికా రంధ్రముల ఊపిరివలన
    నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను
    ఆగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను
    --- తరిమెదను కలిసికొనియెదను
    దోపుడు సొమ్ము పంచుకొనయెదను
    వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను
    నా కత్తి దూసెదను
    నా చెయ్యి వారిని నాశనము చేయునని
    శత్రువనుకొనెను
    నీవు నీ గాలిని విసర జేసితివి
    సముద్రము వారిని కప్పెను
    వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి
    యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు
    పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు
    స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు
    అద్భుతములు చేయువాడవు
    నీవంటి వాడెవడు
    నీ దక్షిణ హస్తమును చాపితివి
    భూమి వారిని మ్రింగివేసెను
    నీవు విమోచించిన ఈ ప్రజలను
    నీ కృపచేత తోడుకొని పోయితివి
    నీ బలముచేత వారిని నీ పరిశుద్ధలయమునకు నడిపించితివి
    జనములు విని దిగులు పడును
    ఫిలిప్తీయ నివాసులకు వేదన కలుగును ఏదోము నాయకులు కలవర పడుదురు
    మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును
    కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు
    భయము అధిక భయము వారికి కలుగును
    యెహోవా, నీ ప్రజలు అందరికి చేరువరకు
    నీ బహు బలముచేత పగవారు రాతివలె కదలకుందురు
    నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు
    యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద
    నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను
    నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు
    PPTel 274.4

    వారిని నిలువ పెట్టుదువు” నిర్గమకాండము 15:1-17

    ఆ అగాధ సముద్రం నుంచి పైకి లేచే స్వరంలా ఇశ్రాయేలీయుల సమహాలు కృతజ్ఞతతో చేసిన స్తోత్ర గానం పైకి లేచింది. మోషే అక్క మిర్యాము నాయకత్వంలో ఇశ్రాయేలీయ స్త్రీలు తంబుర పట్టుకొని నాట్యంచేస్తూ పల్లవి ఎత్తుకొని పాడారు. ఆ ఆరణ్యంలోను, ఆ సముద్రంలోను చాలా దూరం ఆ పాట పల్లవి వినిపించింది. “యెహోవాను గానము చేయుడి. ఆయన మిగుల అతిశయించి జయించెను” అని వారు పాడిన పల్లవిలో మాటల్ని పర్వతాలు ప్రతిధ్వనించాయి.PPTel 277.1

    ఈ పాట ఇది జ్ఞాపకం చేస్తున్న గొప్ప విడుదల హెబ్రీ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకొన్నాయి. ఆయనను నమ్ముకొనే వారందరికి యెహోవా దేవుడే బలము, విమోచన అని ప్రతీ యుగంలోను ఇశ్రాయేలు ప్రవక్తలు, గాయకుడు సాక్ష్యమిస్తూ వచ్చారు. ఆ పాట యూదు ప్రజలకు మాత్రమే చెందింది కాదు. తుదకు నీతి విరోధుల నాశనాన్ని దైవ ప్రజలైన ఇశ్రాయేలీయుల అంతిమ విజయాన్ని అది సూచిస్తున్నది. “జయించినవారు” తెల్లని వస్త్రములు ధరించి” అగ్నితో కలసియున్న స్పటికపు సముద్రము” మీద “దేవుని వీణులు గలవారై” ఉన్న జనసముహాన్నివత్మాసు ప్రవక్త చేశాడు. వీరు “దేవుని సేవకుడగు మోషే కీర్తనయు, గొట్టెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.” ప్రకటన 15:2,3.PPTel 277.2

    “మాకు కాదు, యెహోవా మాకు కాదు. నీ కృపా సత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక” కీర్తనలు 115:1. ఇశ్రాయేలీయుల విడుదల గీతం స్పూర్తి ఇలాంటిది. దేవుని ప్రేమించి ఆయనకు భయపడే వారందరిలోనూ ఇలాంటి స్పూర్తె ఉండాలి. ఎర్ర సముద్రం వద్ద హెబ్రీయులకు అనుగ్రహించిన విమోచన కన్నా పాప దాస్యనుంచి మనకు ఆయన కలిగించిన విమోచన ఎంతో గొప్పది. హెబ్రీ ప్రజలకు మల్లే “నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి” ప్రభువుని మనం హృదయంతో, ఆత్మతోను, స్వరంతోను స్తోత్రించాలి. దేవుని కృపలపై ధ్యానం నిలిపేవారు ఆయన చిన్న చిన్న వరాల్ని మరచిపోనివారు తమ హృదయాల్లో ప్రభువుకి సంతోష గానం చేస్తారు. మనం దేవుని వద్దనుంచి దినదినం పొందే దీవెనలు మరీముఖ్యంగా ఆనందాన్ని పరలోకాన్ని మన అందుబాటులోకి తెచ్చిన క్రీస్తు మరణం - వీటి నిమిత్తం కృతజ్ఞలం కావలసి ఉన్నాం. మనల్ని తనతో అనుసంధాన పర్చుకోటానికి మనం ఆయనకు స్వకీయ ధనంగా ఉండటానికి ప్రేమను చూపిస్తున్నాడు! మనం దేవుని పిల్లలవ్వటానికిగాను మన విమోచకుడు ఎంత గొప్ప త్యాగం చేశాడు! రక్షణ ప్రణాళిక ద్వారా మనకు ఏర్పాటు చేసిన శుభప్రదమైన నీరీక్షణ నిమిత్తం మనం దేవునికి స్తోత్రం చెల్లించాల్సి ఉన్నాం. మనకోసం ఆయన ఏర్పాటుచేసిన పరలోక వారసత్వం నిమిత్తం గొప్ప వాగ్దానాల నిమిత్తం ఆయనను కొనియాడాలి. క్రీస్తు మనకోసం విజ్ఞాపన చెయటానికి జీవిస్తున్నందుకు మనం ఆయనను కొనియాడాలి.PPTel 278.1

    “స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు” అని రక్షకుడంటున్నాడు. కీర్తనలు 50:23. పరలోక నివాసులందరూ ఏకమై దేవుని స్తోత్రిస్తారు. మనం పరలోకానికి వెళ్లినప్పుడు దేవదూతలతో కలసి పాడేందుకు వారి పాట ఇక్కడ నేర్చుకొందాం. కీర్తన రచయితతో కలసి ఇలా పలుకుదాం. “నా జీవిత కాలమంతయు నా దేవుని కీర్తించెదను, దేవా, ప్రజలు నిన్ను స్తుతియించదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక” కీర్తనలు 146:2; 67:5.PPTel 278.2

    తమ విడుదల విషయంలో తన శక్తిని ప్రదర్శించి తమ హింసకులైన ఐగుప్తీయుల పీచమణచటానికి దేవుడు తన సంకల్పం చొప్పున ఇశ్రాయేలీయుల్ని సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న పర్వతాశ్రయంలోకి నడిపించాడు. మరేవిధంగానైనా వారిని కాపాడి ఉండేవాడే గాని వారి విశ్వాసాన్ని పరీక్షించి వారి నమ్మకాన్ని సుస్థిర పర్చటానికి ఆయన ఈ పద్ధతిని ఎంపిక చేసుకొన్నాడు. ప్రజలు అలసి ఉన్నారు. భయాందోళనలతో నిండి ఉన్నారు. ఈ స్థితిలో ముందుకి సాగమని మే షే ఆదేశించినప్పుడు వారు సందేహించి నిలిచిపోయి ఉంటే దేవుడు వారికి మార్గాన్ని తెలిపేవాడు కాదు. “విశ్వాసమునుబట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎజ్జ సముద్రములో బడి నడిచిపోయిరి”. హెబ్రీ 11:29. ఆ సముద్రం నీటివద్దకు నడిచి వెళ్లటంలో మోషే నోట దేవుడు పలికిన మాటను విశ్వసిస్తున్నామని వారు నిరూపించుకొన్నారు. వారు తమ శక్తిమేరకు చేయగలిగినదంతా చేసినమీదట ఇశ్రాయేలీయుల దేవుడు సముద్రాన్ని విభజించి వారు నడిచేందుకు ఆరిన నేలను సృష్టించాడు.PPTel 278.3

    ఇది అన్ని కాలల్లోని ప్రజలు నేర్చుకోవలసిన పాఠం. తరచు క్రైస్తవ జీవితంలో అపాయాలు, ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. విధి నిర్వహణ కష్టమవుతుంటుంది. ముందు నాశనం వెనుక దాసత్వం మరణం ఉన్నట్లు ఊహలు వస్తాయి. అయితే “సాగిపోవుడి” అంటూ దేవుని స్వరం స్పష్టంగా ఆదేశిస్తుంది. మన కళ్లు చీకటిని ఛేదించుకొని చూడలేక పోయినా మన పాదాల్ని చల్లని కెరటాలు తాకుతున్నా ఈ ఆజ్ఞను మనం పాటించాలి. సందేహిస్తూ వెనకాడూ ఉన్నంతకాలం మన పురోగమనానికి అడ్డుకట్ట వేసే సమస్యలు తొలగిపోవు. ప్రతీ సందేహం తొలగిపోయి అపజయానికి ఆస్కారం లేకుండా ఉండేంతవరకు కార్యాచరణను వాయిదా వేసేవారు దాన్ని ఎన్నడూ ఆచరించలేరు. “అడ్డంకులన్నీ తొలగిపోయి మార్గం సృష్టంగా కనిపించేవరకు కని పెడదాం” అంటూ చెవిలో అవిశ్వాసం గుసగుసలాడుంది. అయితే అన్నిటినీ నమ్ముతూ అన్నిటినీ నిరీక్షిస్తూ ముందుకి సాగమంటూ విశ్వాసం ప్రోత్సహిస్తుంది.PPTel 279.1

    ఐగుప్తీయులకి చీకటి గోడగా నిలిచిన మేఘ స్తంభం ఇశ్రాయేలీయులకు బ్రహ్మాండమైన వెలగయ్యింది. అది వారి శిబిరాన్ని వెలుగుతో నింపి వారి ముందున్న మార్గాని తేటపర్చింది. అలాగే దేవుని మార్గాలు అవిశ్వాసులకు చీకటి నిస్పృహగా కనిపించగా విశ్వసించే ప్రజలకు వెలుగుగా, శాంతిగా పరిణమిస్తాయి, దేవుడు మనల్ని నడిపించే మార్గం ఎడారిలో నుంచి లేదా సముద్రంలో నుంచీ కావచ్చు. అయినా అదే సురక్షితమైన మార్గం.PPTel 279.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents