Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    4—విమోచన ప్రణాళిక

    మానవుడి పతనం పరలోకాన్ని దు:ఖంలో ముంచింది. దేవుడు సృజించిన లోకం పాపశాపంవల్ల వ్యాధిగ్రస్తమై వికృతమయ్యింది. బాధలనుభవిస్తూ మరణిస్తున్న ప్రజలతో నిండి ఉన్నది. చట్టాన్ని అతిక్రమించినవారు తప్పించుకొనే మార్గం కనిపించలేదు. దూతలు తమ స్తుతిగానం ఆపారు. పాపం తెచ్చి పెట్టిన నాశనాన్ని గూర్చి పరలోకమంతా దు:ఖిస్తున్నది.PPTel 50.1

    పరలోక సేనాపతి అయిన దైవకుమారుడు పడిపోయిన మానవాళి గురించి జాలిపడ్డాడు. నశించిన ప్రపంచ దుస్థితి తనముందుకు రాగా ఆయన హృదయం ద్రవించింది. మానవుణ్ణి విమోచించటానికి దేవుని ప్రేమ ఒక ప్రణాళికను రూపొందించింది. అతిక్రమానికి గురైన దైవ ధర్మశాస్త్రం పాపి ప్రాణాన్ని కోరుతున్నది. మానవుడి తరపున విశ్వమంతటిలోను ఒక్కడు మాత్రమే ధర్మశాస్త్రం కోరుతున్న దాన్ని చెల్లించగలడు. దేవుడెంత పరిశుద్ధుడో ఆయన ధర్మశాస్త్రం కూడా అంతే పరిశు ద్దమయ్యింది గనుక ఆయనతో సమానుడు మాత్రమే ఆ అతిక్రమానికి ప్రాయశ్చిత్తం చేయగలుగుతాడు. పడిపోయిన మానవుణ్ణి ధర్మశాస్త్రం విధించే శిక్షనుంచి విమోచించి అతణ్ణి దేవునితో సమాధానపర్చగలిగినవాడు క్రీస్తు తప్ప ఇంకెవ్వరూ లేరు. పరిశుద్ధ దేవునికి ఎంతో హేయమైనది, తండ్రి కుమారుల్ని వేరు చేసేది ఆయన పాపం తాలూకు అపరాధాన్ని, అవమానాన్ని క్రీస్తు తనపై మోపుకొన్నాడు. నశించనున్న మానవజాతిని రక్షించటానికి క్రీస్తు ఘోరస్థితిని అనుభవించనున్నాడు.PPTel 50.2

    పాపి తరపున తండ్రిముందు క్రీస్తు విజ్ఞాపనచేశాడు. ఆయన సమాధానం కోసం పరలోక వాసులందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పతనమైన మానవుల నిమిత్తం మర్మభరితమైన సంప్రదింపులు “సమాధానకరమైన యోచనలు” (జెకర్యా 6:13) దీర్ఘకాలం జరిగాయి. భూమి సృష్టికి పూర్వమే రక్షణ ప్రణాళిక ఏర్పాటయ్యింది. ఎందుకంటే క్రీస్తు “జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొట్టెపిల్ల (ప్రకటన 13:8). అయినా పాపమానవులకోసం మరణించటానికి కుమారుణ్ణి అర్పించటం విశ్వనాధుడైన తండ్రికి ఎంతో వేదన కలిగించింది. అయితే, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” యోహాను 3:16. విమోచన ఎంత గొప్ప మర్మం! తనను ప్రేమించని లోకాన్ని దేవుడు ప్రేమించటం ఎంత గొప్ప మర్మం! “అంతుచిక్కని” ఆ ప్రేమ లోతును ఎవరు అవగతం చేసుకోగలరు? అవగాహనకు మించిన ఆ ప్రేమ మర్మాన్ని గ్రహించటానికి అనంతయుగాల పొడవునా అమర్త్యులు కృషి సల్పుతూ, ఆశ్చర్యపడుతూ ఆయనను పూజిస్తారు.PPTel 50.3

    “లోకమును తనతో సమాధానపరచుకొనుచు” దేవుడు క్రీస్తులో ప్రదర్శితం కావలసి ఉన్నాడు. 2 కొరి 5:19. పాపం వల్ల మానవుడు దిగజారిపోయాడు గనుక పరిశుద్ధ స్వభావం గల దేవునితో తనంతటతాను సమాధానపడలేడు. కాని ధర్మశాస్త్రం విధించే శిక్షనుంచి విమోచించిన మీదట, మానవ ప్రయత్నంతో జోడించేందుకు మానవుడికి క్రీస్తు దైవశక్తిని అనుగ్రహించగలడు. దేవునికి పశ్చాత్తాపం వ్యక్తం చేసి ఈ రీతిగా క్రీస్తుమీద విశ్వాసం కలిగి ఉండటం ద్వారా పడిపోయిన ఆదాము పిల్లలు మళ్లీ “దేవుని పిల్లలు” కావచ్చు. 1 యోహాను 3:2.PPTel 51.1

    ఏ ప్రణాళిక ద్వారా మాత్రమే మానవ రక్షణ సాధ్యమయ్యిందో దానికి అవసరమైన త్యాగంలో పరలోకమంతా పాలుపంచుకొన్నది. విమోచన ప్రణాళికను క్రీస్తు తమ ముందు పెట్టినప్పుడు దూతలు ఆనందించలేకపోయారు. ఎందుకంటే అది తమ ప్రియతమ సేనాపతి క్రీస్తును ఎనలేని శ్రమలు బాధలకు గురిచేస్తుంది. తాను పరలోక పవిత్రత, శాంతి, ఆనందం, మహిమ, నిత్యజీవం నుంచి దిగివచ్చి, లోకంలోని దు:ఖాన్ని, అవమానాన్ని, మరణాన్ని భరించాల్సి ఉన్నదని చెప్పినప్పుడు వారు దు:ఖంతోను తీవ్ర దిగ్ర్భాంతితోను విన్నారు. పాపికి, పాపశిక్షావిధికి మధ్య ఆయన నిలిచి ఉండనున్నాడు. అయినా ఆయనను దేవుని కుమారుడుగా అంగీకరించేవారు ఎక్కువమంది ఉండరు. పరలోక అధిపతిగా తన ఉన్నతస్థానం విడిచి పెట్టి, లోకంలో అవతరించి, మానవుడిగా తన్నుతాను తగ్గించుకొని బాధలు, దు:ఖాలు, శోధనల్ని ఆయన అనుభవించాల్సి ఉన్నాడు. శోధనలకు గురి అయినవారికి చేయూతనిచ్చేందుకు ఇదంతా ఆయనకు అవసరం. హెబ్రీ 2:18. బోధకుడిగా ఆయన పరిచర్య ముగిసినప్పుడు ఆయన దుష్టుల చేతులకు అప్పగించబడటం, వారు ఆయనను సాతాను నడుపుదలకింద నానాశ్రమలు పెట్టటం జరగాల్సి ఉంది. అపరాధం చేసిన పాపికి మల్లే భూమికి ఆకాశానికి మధ్యవేలాడూ ఆయన క్రూరమైన మరణం మరణించాలి. చాలా గంటలు తీవ్ర బాధననుభవించాలి. చూడలేక దూతలు ముఖాలు కప్పుకొన్నంతటి బాధ అది. అతిక్రమం తాలూకు నేరం, లోకపాపాల భారం తనమీద పడగా తండ్రి ముఖం కప్పుకొన్నప్పుడు క్రీస్తు హృదయవేదనను అనుభవించాలి.PPTel 51.2

    మానవుడి కోసం తాము బలి అవుతామంటూ తమ ఆదినాయకుడు క్రీస్తు పాదాలపై పడి దూతలు అర్థించారు. కాని పరిశుద్ధదూత ప్రాణం పాప రుణాన్ని చెల్లించలేదు. మానవుణ్ణి సృజించినవాడు మాత్రమే విమోచించగలడు. అయినా రక్షణ ప్రణాళికలో దూతలకు కూడా పాత్ర ఉన్నది. “మరణము అనుభవించునట్లు దూతలకంటే కొంచెము తక్కువవాడుగ” ఆయన చేయబడ్డాడు. హెబ్రీ 2:9. మానవ స్వభావాన్ని స్వీకరిస్తాడు గనుక ఆయన శక్తి దూతల శక్తికి సమానంగా ఉండదు. అందుకే తనకు శ్రమలు కలిగినప్పుడు తనను బలపర్చి ఆదుకోటానికి దూతలు ఆయనకు పరిచర్య చేయాల్సి ఉన్నారు. దూతలు రక్షణ పొందబోయేవారికి పరిచర్య చేయటానికి పంపబడిన ఆత్మలు కూడా. హెబ్రీ 1:14. రక్షణ పొందబోతున్న వారిని దుష్టదూతల ప్రభావం నుంచి శక్తినుంచి వారి చుట్టూ సాతాను కలుగజేసే అంధకారం నుంచి కాపాడ్డారు. తమ ప్రభువు వేదనను అవమానాన్ని దూతలు చూసినప్పుడు దు:ఖంతోను ఆగ్రహంతోను నిండి ఆయనను ఆ హంతకుల చేతుల్లోనుంచి విడిపించటానికి సిద్ధమవుతారు. అయితే తాము చూసే ఏ సన్నివేశంలోనూ వారు కలగుజేసుకోకూడదు. దుష్టు దుర్భాషల్నీ ఎగతాళిని క్రీస్తు భరించటం రక్షణ ప్రణాళికలో ఒక భాగం. వీటన్నిటికీ ఇష్టపడే మానవుడి విమోచకుడవ్వటానికి క్రీస్తు అంగీకరించాడు.PPTel 52.1

    తన మరణం ద్వారా అనేకమందిని విమోచించి మరణానికి కారకుడైన శత్రువుని నాశనం చేస్తానని క్రీస్తు దూతలకు వాగ్దానం చేశాడు. పాపం ద్వారా మానవుడు పోగొట్టుకొన్న రాజ్యాన్ని ఆయన తిరిగి సంపాదించనున్నాడు. విమోచన పొందినవారు ఆయనతో పాటు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకొని అందులో నిత్యము నివశించనున్నారు. పరలోక శాంతినిగాని ఇహలోక శాంతినిగాని పాడుచేయటానికి ఇక పాపం ఉండదు. పాపులు ఉండరు. తండ్రి అంగీకరించిన ప్రణాళికననుసరించి పనిచేయాల్సిందని, పడిపోయిన మానవుడు తన మరణం ద్వారా దేవునితో సమాధాన పడగలుగుతున్నందుకు ఉత్సహించాల్సిందని క్రీస్తు దూతలను కోరాడు.PPTel 52.2

    అంతట పరలోకం సంతోషంతో నిండింది. క్రీస్తు త్యాగం కలిగించే వేదనను మరిపించింది. విమోచన అందుకోనున్న లోకం ధన్యత మహిమ బేల్లె హేము కొండల పైనుంచి వినవచ్చిన “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక” అన్న పాట పరలోక ప్రాంగణంలో మారుమోగింది. లూకా 2:14 నూతన సృష్టి ఆనందంకన్నా మరెక్కువ ఆనందంతో ఇప్పుడు “ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి” పాడాయి. “దేవదూతలందరను ఆనందించి జయధ్వనులు” చేశారు. యోబు 38:7.PPTel 52.3

    ఏదెనుతోటలో దేవుడు సాతానుకిచ్చిన తీర్పులో మానవ విమోచనను గూర్చిన మొదటి ప్రకటన వెలువడింది. ప్రభువు ఇలా ప్రకటించాడు, “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము గలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమె మీద కొట్టుదువు”. ఆది 3:15. మన మొదటి తల్లిదండ్రులు వింటుండగా పలికిన ఈ మాటలు వారికి ఆయన చేసిన వాగ్దానం. మానవుడికీ సాతానుకీ మధ్య పోరాటం సాగుతుందని చివరికి సాతాను శక్తి సమూలంగా నాశనమవుతుందని ఆ వాగ్దానం సూచిస్తున్నది. ఆదామవ్వలు తమ అతిక్రమ ఫలితంగా కలిగే శిక్షకోసం కని పెడ్రూ నేరస్తులుగా నీతిమంతుడైన న్యాయాధిపతిముందు నిలబడ్డారు. కాని తాము శ్రమతోను దు:ఖంతోను జీవితం వెళ్లదీయటం గురించిగాని లేదా తాము నేలకు తిరిగి చేరటమన్నదాన్ని గురించిగాని వినకముందే తమకెంతో నిరీక్షణనిచ్చే మాటల్ని విన్నారు. శక్తిమంతుడైన తమ శత్రువు చేతిలో శ్రమలనుభ వించినా అంతిమ విజయంకోసం వారు ఎదురుచూడవచ్చు.PPTel 53.1

    తనకూ, స్త్రీకి, తన సంతానానికి, స్త్రీ సంతానానికీ మధ్య వైరముంటుందని విన్నప్పుడు మానవ స్వభావాన్ని భ్రష్టుపట్టించే తన కృషికి అంతరాయం ఏర్పడుందని మానవుడు ఏదోవిధంగా తన శక్తిని ప్రతిఘటిస్తాడని సాతాను గ్రహించాడు. రక్షణ ప్రణాళిక పూర్తిగా బయలుపడినప్పుడు మానవుడి పతనాన్ని సాధించి పరలోకంలోని ఉన్నత స్థానం నుంచి దైవ కుమారుణ్ణి కిందకు తేగలుగుతున్నందుకు సాతాను అతడి అనుచరులు సంతోషించారు. భూమి మీద తన ప్రణాళికలు అప్పటివరకూ జయప్రదంగా సాగుతున్నాయని, క్రీస్తు మానవ స్వభావంతో నివసించినప్పుడు ఆయన పై కూడా విజయం సాధించవచ్చునని, ఈ విధంగా మానవ రక్షణకు ఏర్పాటైన విమోచన పథకాన్ని నిరర్థకం చేయవచ్చునని అతను పగటికలలు కన్నాడు.PPTel 53.2

    తమ రక్షణ నిమిత్తం రూపొందిన ప్రణాళికను గురించి ఆదామవ్వలకు దూతలు తెలియపర్చారు. తాము ఘోరపాపం చేసినప్పటికినీ తమను సాతాను ఆధీనంలో పడి మగ్గటానికి దేవుడు విడిచి పెట్టడని వారికి దూతలు భరోసా ఇచ్చారు. తమ పాపం నిమిత్తం దైవ కుమారుడు తన రక్తంతో ప్రాయశ్చిత్తం చేయటానికి ముందుకు వచ్చాడని చెప్పారు. తమకు కొంత కృపకాలం ఏర్పాటవుతుందని ఆ కాలంలో తాము తమ పాపాలు ఒప్పుకొని క్రీస్తుపై విశ్వాసం కలిగి ఉండటం ద్వారా తిరిగి దేవుని బిడ్డలు కాగలరని వారితో చెప్పారు.PPTel 53.3

    తమ అతిక్రమం వలన అగత్యమైన త్యాగం ధర్మశాస్త్రం పవిత్ర స్వభావాన్ని ఆదామవ్వలకు ప్రత్యక్షపర్చింది. ముందెన్నటికన్నా స్పష్టంగా పాపం తాలూకు దోషిత్వాన్ని దాని ఘోర పర్యవసానాన్ని ఇప్పుడు వారు చూడగలిగారు. దు:ఖంతో బరువెక్కిన హృదయాలతో ఎవరిప్రేమ తమ ఆనందానికి మూలమో ఆ ప్రభువు మీద తమ అతిక్రమం తాలూకు శిక్షపడకూడదని వారు విజ్ఞప్తి చేశారు. అది తమ మీద తమ బిడ్డల మీద పడాలని కోరారు.PPTel 53.4

    పరలోకంలోను భూలోకంలోను దైవ ప్రభుత్వానికి పునాది దైవ ధర్మశాస్త్రం గనుక దేవదూత ప్రాణం కూడా దాని అతిక్రమానికి ప్రాయశ్చిత్తం చెల్లించలేదని వారికి వ్యక్తం చేయటం జరిగింది. పడిపోయిన మానవుడి స్థితిని చక్కదిద్దటానికి దానిలోని ఒక్క నియమాన్ని రద్దుచేయటానికిగాని మార్చటానికిగాని సాధ్యం కాదు. కాని మానవుణ్ణి సృజించిన దైవకుమారుడు అతడి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలడు. ఆదాము అతిక్రమం పాపాన్ని మరణాన్ని తెచ్చినట్లే క్రీస్తు త్యాగం జీవాన్ని అమర్త్యతను తెస్తుంది.PPTel 54.1

    మానవుడే కాక ఈ భూమికూడా పాపం వల్ల సాతాను శక్తికి లోనుకావటం జరిగింది. అందుచేత రక్షణ ప్రణాళిక ద్వారా అది పునరుద్ధరణ పొందాల్సి ఉన్నది. ఆదాము సృష్టి జరిగిన తర్వాత భూమిని ఏలటానికి దేవుడు అతణ్ణి నియమించాడు. అయితే శోధనకు లొంగటం చేత అతడు సాతాను అధికారానికి లోనయ్యాడు. “ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా?” 2 పేతురు 2:19. మానవుడు సాతాను బందీ అయ్యాడు భూమిని ఏలే అధికారం తనను జయించిన వాడి హస్తగతమయ్యింది. సాతాను ఈ రకంగా “ఈయుగ సంబంధమైన దేవత” అయ్యాడు. 2 కొరి 4:4. భూమిని ఏలటానికి ఆదిలో ఆదాముకు దఖలు పడ్డ అధికారాన్ని సాతాను హస్తగతం చేసుకొన్నాడు. అయితే క్రీస్తు పాపప్రాయశ్చిత్తార్థంగా మరణించటం ద్వారా మానవుణ్ణి విమోచించటమే గాక అతడు కోల్పోయిన ఏలుబడి అధికారాన్ని పునరుద్ధరిస్తాడు. మొదటి ఆదాము పోగొట్టుకొన్నదంతా రెండో ఆదాము పునరిద్దరిస్తాడు. ప్రవక్త ఈ మాటలంటున్నాడు, “మండల గోపురమా, సీయోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును”. మీకా. 4:8. “ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము” గురించి అపొస్తలుడైన పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఎఫెసి 1:14. పరిశుద్ధులైన మనుషులు సంతోషంగా నివసించేందుకోసం దేవుడు ఈ భూమిని సృజించాడు. ప్రభువు “భూమిని కలుగజేసి దాని సిద్ధపరిచి స్థిరపరచెను” యెషయ 45:18. దేవుడు దాన్ని నూతనం చేసి పాపాన్ని దు:ఖాన్ని నిర్మూలించాక అది విమోచన పొందినవారి నిత్యనివాసమవుతుంది. అప్పుడు ఈ ఉద్దేశం నెరవేర్తుంది, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు”. “ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొట్టెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు” కీర్తనలు 37:9, ప్రకటన :3.PPTel 54.2

    తన పాపరహిత స్థితిలో ఆదాము సృష్టికర్తతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. అయితే పాపం మానవుడికి దేవునికి మధ్య అగాధం ఏర్పర్చింది. క్రీస్తు చేసే ప్రాయశ్చిత్తం మాత్రమే ఆ అగాధాన్ని కలిపి పరలోకం నుంచి దీవెనలు రక్షణ భూమికి దిగిరావటం సేద్యపర్చుతుంది. మానవుడింకా దేవున్ని ముఖాముఖిగా కలవటం సాధ్యంకాదు. అయితే క్రీస్తు ద్వారాను దూతలద్వారాను మానవుడితో దేవుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాడు.PPTel 55.1

    ఈ రీతిగా ఏదెనులో తన తీర్పును ప్రకటించినప్పటినుంచి జలప్రళయం వరకు అప్పటి నుంచి దైవకుమారుని మొదటి రాకవరకు చరిత్రలోని ప్రముఖ ఘటనల్ని దేవుడు ఆదాముకి బయలుపర్చాడు. క్రీస్తు త్యాగం లోకమంతటిని రక్షించటానికి చాలినంత విలువకలది కాగా అనేకులు పశ్చాత్తాపం పొంది దేవునికి విధేయులై జీవించటానికి ఎంపిక చేసుకొనే బదులు పాప జీవితాన్నే ఎంపిక చేసుకొంటారని దేవుడు ఆదాముకి బయలుపర్చాడు. శకం శకం నేరం పెరుగుతుంది. మానవజాతి పైన జంతు ప్రపంచం పైన ఈ భూమండలంపైన పాపం పేరుకుపోయి శాపం పోగుపడ్తుంది. తన సొంత పాపజీవితం వల్ల మానవుడి జీవితపరిమాణం తగ్గుతుంది. లోకం అన్నిరకాల బాధలతో శ్రమలతో నిండి మూలిగేవరకు అతడి శరీర పరిమాణంలో, సహనశక్తి, నైతిక శక్తి, మానసిక శక్తి విషయాల్లో క్షీణత చోటుచేసుకొంటుంది. తిని తాగటంలో, శరీరాశలు కోర్కెలు తీర్చుకోటంలో తలమునకలై ఉన్నందువల్ల మనుషులు రక్షణ సంబంధిత సత్యాల్ని అభినందించలేని స్థితిలో ఉంటారు. అయినా క్రీస్తు తాను ఏకార్యసాధన నిమిత్తం ఈ లోకానికి వచ్చాడోదాన్ని నమ్మకంగా నిర్వహిస్తూ మానవు లపట్ల తన ఆసక్తిని కొనసాగిస్తూ తమ బలహీనతల్నీ, లోటుపాట్లను సవరణ కోసం తనకు అప్పగించమని వారిని ఆహ్వానిస్తాడు. విశ్వాసంతో తన వద్దకు వచ్చేవారందరి అవసరాల్నీ తీర్చుతాడు.దేవుని గూర్చిన జ్ఞానాన్ని పరిరక్షించుకొంటూ ప్రబలుతున్న దుర్నీతి నడుమ పవిత్రంగానివసించే ప్రజలు కొందరు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు.PPTel 55.2

    మానవుడికి తన పాపాన్ని నిత్యం జ్ఞాపకం చేయటానికీ, అతడు తన పాపాన్ని ఒప్పుకొని వాగ్రత్త విమోచకుడి పై విశ్వాసం కలిగి ఉండటానికి దేవుడు బలి అర్పణల వ్యవస్థను ఏర్పాటుచేశాడు. మరణానికి కారణం పాపమన్న గంభీర సత్యాన్ని మానవజాతికి నొక్కి చెప్పటమే వాటి ఉద్దేశం. మొదటి బలి అర్పణ ఆదాముకి ఎంతో బాధాకరమయ్యింది. దేవుడు మాత్రమే ఇవ్వగల ప్రాణాన్ని తీయటానికి అతడు తన చెయ్యి పైకెత్తాలి. అప్పుడే మొదటిసారిగా మరణాన్ని చూశాడు. తాను దేవునికి నమ్మకంగా ఉండి ఉంటే మనిషికిగాని మూగజీవికిగాని మరణం ఉండేది కాదని గుర్తించాడు. నిరపరాధి అయిన బలిపశువును చంపినప్పుడు నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల రక్తాన్ని తన పాపం చిందించాల్సి ఉన్నదన్న ఆలోచనతో అతడు వణికిపోయాడు. దైవకుమారుడి మరణం మాత్రమే ప్రాయశ్చిత్తం చేయగల తన అతిక్రమం తీవ్రతను ఆదాముకి ఈ దృశ్యం స్పష్టంగా బోధపర్చింది. అపరాధి నిమిత్తం అట్టి క్రయధనం చెల్లించనున్న దేవుని అనంత ప్రేమను గూర్చి ఆశ్చర్యం చెందాడు. చీకటితో నిండిన తన భవిష్యత్తు ఆకాశంలో నిరీక్షణ తార కనిపించింది. అతడి నిస్పృహను అది తొలగించింది.PPTel 55.3

    విమోచన ప్రణాళికకు మానవుడి రక్షణకన్నా విశాలమైన పరిధి ఉన్నది. దీని నిమిత్తమై క్రీస్తు ఈ లోకానికి రాలేదు. దేవుని దర్మశాస్త్రాన్ని సరిఅయిన విధంగా ఈ లోకప్రజలు పరిగణించేందుకే కాదు ఆయన రావటం. విశ్వం ముందు దేవుని గుణశీలాన్ని గూర్చిన వాస్తవాన్ని తెలియపర్చటానికి కూడా. తన సిలువకు కొంచెం ముందు రక్షకుడు ఈ మాటలు పలికినప్పుడు ఇతర లోకాల ప్రజలమీద మానవుడి మీద తన మహాత్యాగ ప్రభావం తాలూకు ఈ ఫలితానికి ఆయన ఎదురుచూశాడు “ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోసివేయబడును. నేను భూమిమీదనుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును” యోహాను 12:31, 32. మానవుడి రక్షణార్థం క్రీస్తు మరణించటం పరలోకాన్ని మానవులకి అందుబాటులో ఉంటమే కాదు సాతాను తిరుగుబాటు విషయంలో దేవుడు, ఆయన కుమారుడు అనుసరించిన విధంన సరి అయిందని ధ్రువపర్చుతుంది. ధర్మశాస్త్ర నిత్యత్వాన్ని స్థిరపర్చి పాపం దాని ఫలితాల స్వభావాన్ని బయలు పర్చుతుంది.PPTel 56.1

    దైవ ధర్మశాస్త్రం పైనే ఆదినుంచి మహా సంఘర్షణ జరుగుతున్నది. దేవుడు అన్యాయస్థుడని ఆయన దర్మశాస్త్రం లోపాలతో నిండి ఉన్నదని విశ్వం విశాల హితం దృష్ట్యా దానిలో మార్పులు చేయటం అవసరమని నిరూపించటానికి సాతాను ప్రయత్నించాడు. ధర్మశాస్త్రం పై దాడిచేయటం ద్వారా దానికర్తను పడదోయటం అతడి ధ్యేయం. దైవ ధర్మశాసనాలు లోపాలతో నిండినవైతే వాటికి మార్పులు అవసరమో లేదో అవి పరిపూర్ణమైనవి మార్చరానివో కావో ఈ సంఘర్షణ బయలు పర్చాల్సి ఉన్నది.PPTel 56.2

    పరలోకం నుంచి బహిష్కృతుడైన సాతాను భూలోకాన్ని తన రాజ్యంగా మలుచుకోటానికి కృతనిశ్చయుడయ్యాడు. ఆదామవ్వల్ని శోధించి పాపంలో పడేసినప్పుడు ఈ లోకాన్ని సంపాదించుకొన్నాననుకొన్నాడు. ఎందుకంటే “వారు నన్ను తమ పరిపాలకుడిగా ఎన్నుకున్నారు” అనుకొన్నాడు. పాపికి క్షమాపణ అసాధ్యమన్నది అతడి భావన. అందుచేత పడిపోయిన మానవాళి తన ప్రజలని లోకం తన రాజ్యమని అతడు పరిగణించాడు. అతిక్రమం తాలూకు శిక్షను భరించటానికి, దేవుడు తనతో సమానుడైన తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. వారు మళ్లీ తన ఆదరానురాగాల్లోకి పునరుద్దరణ పొంది తమ ఏదెను గృహానికి తిరిగి వచ్చేందుకు దేవుడు ఈ విధంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మానవుణ్ణి విమోచించి లోకాన్ని సాతాను చేతుల్లోనుంచి కాపాడటానికి క్రీస్తు పూనుకున్నాడు. పరలోకంలో ప్రారంభమైన మహా సంఘర్షణ ఈ లోకంలోనే, తన రాజ్యమంటూ సాతాను చెప్పుకొంటున్న గడ్డ పైనే పరిష్కారం కావాల్సి ఉన్నది.PPTel 57.1

    పతనమైన మానవుణ్ణి రక్షించటానికి క్రీస్తు తన్నుతాను తగ్గించుకోటం విశ్వానికి దిగ్ర్భాంతి కలిగించింది. నక్షత్రం నుంచి నక్షత్రానికి, లోకం నుంచి లోకానికి వెళ్లి పర్యవేక్షిస్తూ, తన సువిశాల సృష్టిలోని ప్రతీస్థాయి జీవుల అవసరాల్ని తీర్చుతూ పయనించే ప్రబువు తన మహిమను పక్కన పెట్టి మానవ స్వభావాన్ని ధరించటానికి అంగీకరించటం గొప్ప మర్మం. అది పాపరహిత లోకాల్లోని ప్రజలు అవగాహన చేసుకోటానికి ఆశించే మర్మం. క్రీస్తు నరావతారి అయి మన లోకానికి వచ్చినప్పుడు పశువుల తొట్టెవద్ద నుంచి రక్తంతో తడిసిన కల్వరి వరకూ ఆయనను వెంబడించటానికి అందరూ ఆసక్తి కనపర్చారు. ఆయన పొందిన అవమానాన్ని ఎగతాళిని పరలోకం గుర్తించింది. అది సాతాను రెచ్చగొట్టిందని గ్రహించింది. వారు ప్రత్యర్థి సంస్థల పనిని దాని పురోగమనాన్ని గుర్తించారు. చీకటిని, దు:ఖాన్ని బాధను సాతాను నిత్యము మానవాళి పైకి రప్పించటం క్రీస్తు వాటిని ప్రతిఘటించటం గుర్తించారు. చీకటి వెలుగుల మధ్య సంఘర్షణ ఉద్ధృతమవ్వటం చూశారు. బాధననుభవిస్తూ తన మరణ ఘడియల్లో “సమాప్తమైనది” (యోహాను 19:30) అని క్రీస్తు పలికినప్పుడు ప్రతిలోకం నుంచీ పరలోకం నుంచి జయజయధ్వనులు వినిపించాయి. ఈ లోకంలో ఎంతోకాలంగా సాగుతున్న మహాసంఘర్షణ ఇప్పుడు ముగిసింది. క్రీస్తు విజయం సాధించాడు. తండ్రి కుమారులు తమ్మును తాము ఉపేక్షించుకొని ప్రాణత్యాగం చేయటానికి, వారికి మానవుడి పట్ల చాలినంత ప్రేమ ఉన్నదా అన్న ప్రశ్నకు క్రీస్తు మరణమే జవాబు చెప్పింది. అబద్ధికుడిగా హంతకుడిగా సాతాను తన వాస్తవ ప్రవర్తనను బైట పెట్టుకున్నాడు. తన ఆధీనంలో ఉన్న మనుషుల్ని ఏ స్వభావంతో పరిపాలించాడో, తనకు అవకాశం ఇచ్చి ఉంటే పరలోక వాసుల్నీ అదే స్వభావంతో అదుపుచేసి ఉండే వాడని స్పష్టమయ్యింది. దేవునికి నమ్మకంగా ఉన్న విశ్వం ముక్తకంఠంతో దేవుని పరిపాలనను కొనియాడింది. PPTel 57.2

    ధర్మశాస్త్రాన్ని మార్చగలిగితే మానవ రక్షణకు క్రీస్తు మరణం అగత్యమయ్యేది కాదు. పడిపోయిన మానవజాతికోసం క్రీస్తు ప్రాణాన్నివ్వటం అవసరం అన్న విషయం పాపి పై దైవ ధర్మశాస్త్రాన్నికున్న హక్కును అది విడిచి పెట్టుకోదని నిరూపిస్తున్నది. పాపం వలన వచ్చే జీతం మరణమని రుజువయ్యింది. క్రీస్తు మరణించినప్పుడు సాతాను మరణం ఖరారయ్యింది. అనేకులు వాదించేటట్లు సిలువలో క్రీస్తు మరణం ధర్మశాస్త్రాన్ని రద్దుపర్చిందన్నది వాస్తవమైతే దైవకుమారుడు భరించిన శ్రమలు, బాధ, మరణం సాతాను కోరింది అతడికివ్వటానికే అనటమౌతుంది. అప్పుడు సాతాను విజయుడైనట్లు దేవుని ప్రభుత్వంపై అతడి ఆరోపణలు నిజమైనట్లు ఉంటుంది. మానవుడి అతిక్రమానికి శిక్షను క్రీస్తు భరించాడన్నది ధర్మశాస్త్రం మార్పులేనిదని దేవుడు నీతిమంతుడు, దయాదాక్షిణ్యమూర్తి, త్యాగశీలి అని, ఆయన ప్రభుత్వ పాలనలో కృప న్యాయాలు మిళితమై ఉన్నాయని సృష్టి అయిన ప్రజలందరికీ నిరూపిస్తున్నది.PPTel 58.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents