Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    15—ఇస్సాకు వివాహం

    అబ్రాహాము వృద్ధుడై మరణించటానికి సిద్ధంగా ఉన్నాడు. తన సంతతి విషయంలో వాగ్దాన నెరవేర్పు సందర్భంగా అబ్రాహాము చేయాల్సిన పని ఒక్కటి మిగిలిపోయింది. ధర్మశాస్త్రాన్ని కాపాడటంలో అబ్రాహాము తదనంతరం బాధ్యత వహించటానికి ఎంపిక అయిన ప్రజలకు తండ్రిగా ఉండటానికి దేవుడు ఇస్సాకును నియమించాడు. అయితే ఇస్సాకు ఇంకా పెళ్లికాకుండా ఉన్నాడు. కనాను దేశ ప్రజలు విగ్రహారాధకులు. అట్టి వివాహాలు మత భ్రష్టతకు దారితీస్తాయని తెలిసి ఆ దేశ ప్రజలతో తన ప్రజలు వివాహాలకు ఇచ్చి పుచ్చుకోవటం దేవుడు నిషేధించాడు.తన కుమారుడిచుట్టూ ఉన్న దుర్మార్గ వాతావరణం గురించి అబ్రాహాము ఆందోళన చెందాడు. దేవుని విశ్వసించటం, ఆయన చిత్తానికి తన్ను తాను సమర్పించుకోటం అబ్రాహాముకి స్వాభావికమయ్యాయి. అవి ఇస్సాకు ప్రవర్తనలో ప్రతిబింబించాయి. ఆ యువకుడు ప్రేమగలవాడు, సాధు స్వభావి, వినయశీలి. దేవుని భయంలేని వ్యక్తితో జతపడడం జరిగితే అతడు సమాధానం కోసం నియమాన్ని త్యాగంచేసే ప్రమాదముంది. తన కుమారుడికి భార్యను ఎంపిక చేయటం అబ్రాహాముకి అతి ప్రాముఖ్యమైన విషయం. తనను దేవుని వద్దనుంచి దూరంగా నడిపించని స్త్రీని తన కుమారుడు వివాహం చేసుకోవాలని అబ్రాహాము ఆకాంక్షించాడు.PPTel 161.1

    పూర్వం తల్లిదండ్రులే వివాహాలకు ఏర్పాట్లు చేసేవారు. దేవుని విశ్వసించిన వారు కూడా ఇదే ఆచారాన్ని అనుసరించారు. తాము ప్రేమించని వారిని పెండ్లి చేసుకోవాల్సిందన్న ఒత్తిడికి ఎవరూ గురికాలేదు. కాని యువజనులు తమ ప్రేమను ఇచ్చి పుచ్చుకోటంలో అనుభవజ్ఞులూ దైవభీతి గలవారు అయిన తల్లిదండ్రుల ఆలోచనలు మార్గనిర్దేశం చేసేవి. దీనికి విరుద్దంగా జరిగే వివాహాలు తల్లిదండ్రులకు అగౌరవంగా - నేరంగా కూడా - పరిగణించటం జరిగేది. PPTel 161.2

    జరగనున్న ఎంపిక దేవుని నడుపుదల కింద చోటు చేసుకొంటుందని విశ్వసించి ఇస్సాకు ఆ విషయాన్ని తండ్రికి విడిచి పెట్టాడు. అబ్రాహాము తలంపులు అరామ్న హరాయిములో ఉన్న తన తండ్రి బంధువులమీద నిలిచాయి. అప్పుడప్పుడు విగ్రహారాధనకు పాల్పడినా వారికి నిజమైన దేవుని గూర్చిన జ్ఞానం ఉంది. వారు నిజమైన దేవుని ఆరాధించారు. ఇస్సాకు కనాను విడిచి వారి వద్దకు వెళ్లకూడదు. తన గృహాన్ని విడిచి పెట్టి నిజమైన దేవుని ఆరాధనను కొనసాగించటానికి ఇస్సాకుతో జతపడటానికి ఇష్టపడే ఒక యువతి వారిలో లభించవచ్చు. భక్తిపరుడు, అనుభవశాలి, వివేకవంతుడు అయిన “పెద్దదాసుని” కి అబ్రాహాము ఈ కార్యాన్ని అప్పగించాడు. కనానీయ యువతుల్లోనుంచి ఇస్సాకు భార్యను ఎంపిక చేయనని అరామ్నహరాయిము లోని నాహోరు కుటుంబంలోనుంచి ఒక యువతిని ఎంపిక చేస్తానని అబ్రాహాము తన దాసుడితో దేవునిముందు ప్రమాణం చేయించాడు. ఇస్సాకుని అక్కడకు తీసుకువెళ్లవద్దని చెప్పాడు. తన బంధువుల్ని విడిచి పెట్టే యువతి కనిపించకపోతే తాను చేసిన నిబంధన నుంచి దూత విడుదల పొందుతాడు. తాను చేపట్టే కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడంటూ అబ్రాహాము అతణ్ని ప్రోత్సహించాడు. “నా తండ్రి యింట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చిన” దేవుడు “తన దూతను నీకు ముందుగా పంపును” అని అతణ్ని ప్రోత్సహించాడు.PPTel 161.3

    అబ్రాహాము దూత వెంటనే బయలుదేరాడు. తన సిబ్బంది ఉపయోగించటానికి, తనతో తిరిగిరానున్న పెండ్లికుమార్తె సిబ్బంది ఉపయోగించటానికి, పెండ్లి కుమార్తెకు ఆమె స్నేహితురాండ్రకు బహుమతుల రవాణాకు పది ఒంటెల్ని, తీసుకొని దాసుడు ప్రయాణమై దమస్కుదాటి తూర్పున ఉన్న మహానది గట్టును ఆనుకొని ఉన్న సారవంతమైన మైదానాల దిశగా వెళ్లాడు. నా సూరు పట్టణమైన హారాను చేరి పట్టణం వెలుపల స్త్రీలు సాయంత్రం నీళ్లు చేదుకోవటానికి వచ్చిన నూతి వద్ద నిలిచాడు. అది అతడు తీవ్రంగా ఆలోచిస్తున్న సమయం. తాను చేసే ఎంపిక నుంచి తన యజమాని గృహానికే గాక భావితరాలకు కూడా ప్రాముఖ్యమైన ఫలితాలు రావలసి ఉన్నాయి. తనకు పరిచయమేలేని యువతుల్లోనుంచి జ్ఞానయుక్తంగా ఎంపికచేయటం ఎలా? తనకు తోడుగా దేవుడు తన దూతను పంపుతాడని అబ్రహాము తనతో చెప్పిన మాట జ్ఞప్తికి తెచ్చుకొని నడుపుదలకోసం చిత్తశుద్ధితో ప్రార్థన చేశాడు. తన యజమాని గృహంలో దయగా వ్యవహరించటం, అతిథుల్ని సత్కరించటం తన అనుభవంలోని విషయాలే. ఇస్సాకుకి దేవుడు ఏర్పాటు చేసిన యువతిని ఒక ఉపకారం ద్వారా సూచించవలసిందిగా దాసుడు ప్రార్థన చేశాడు.PPTel 162.1

    ప్రార్థన ముగిసీ ముగియటంతో దానికి జవాబు వచ్చింది. నూతివద్ద పోగు పడ్డ స్త్రీలలో ఒక యువతి ప్రదర్శించిన మట్టు మర్యాదలు అతణ్ని ఆకట్టుకున్నాయి. ఆమె కుండతో నూతిలోనుంచి పైకిరాగానే ఈ పరదేశి ఆమెను కలుసుకోటానికి ముందుకువెళ్లి తన భుజమ్మీద ఉన్న కుండలోనుంచి నీళ్లు కావాలని అడిగాడు. ఆ మనవికి తనకేగాక తన ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తానని విధేయతతో సమాధానం చెప్పిందాయువతి. తండ్రుల మందలకు అలాంటి సేవలకు రాకుమార్తెలు కూడా చేయటం ఆచారం. ఈ విధంగా దాసుడు కోరిన గుర్తు కనిపించింది. ఆ యువతి “మిక్కిలి చక్కనిది”. ఆమె వినయ మర్యాదలు ఆమె దయా హృదయాన్ని చురుకు తనాన్ని సూచించాయి. ఇంతవరకు దేవుని హస్తం ఆ దాసుడితో ఉంది. గొప్ప బహు మానాలతో ఆమెకు ధన్యవాదాలు చెప్పిన తర్వాత తాను ఎవరి తాలూకని ఆమెనడిగాడు. ఆమె అబ్రాహాము సోదరుడి కుమారుడి కుమార్తె అని తెలుసుకున్న తర్వాత అతడు “తలవంచి యెహోవాకు” మొక్కాడు.PPTel 162.2

    ఆ రాత్రి తన తండ్రి ఇంటిలో బస చేస్తానని అతడు ఆమెను కోరాడు. ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకంటున్న సమయంలో అబ్రాహాముతో తన సంబంధాన్ని అతడు బయలుపర్చాడు. ఆ యువతి ఇంటికివెళ్లి ఏం జరిగిందో చెప్పింది. ఆమె అన్న లాబాను వెంటనే ఆ పరదేశిని అతడి పరివారాన్ని తన ఇంటికి తీసుకురావటానికి వారికి అతిథి మర్యాదలు చేయటానికి వెళ్లాడు.PPTel 163.1

    తాను వచ్చిన పనిఏంటో నూతివద్ద తాను చేసిన ప్రార్థన ఏంటో దానికి సంబంధించిన పరిస్థితులేంటో చెప్పేవరకూ ఎలియాజరు భోజనం చేయలేదు. ఆ తర్వాత ఇలా అన్నాడు, “కాబట్టి నా యజమానుని యెడల మీరు దయను నమ్మకమును కనపరచిన యెడల అవియైనను తెలియచెప్పుడి; అప్పుడు నేనెటుపోవలెనో అటు పోయెదను” వారు “ఇది యెహోవా వలన కలిగిన కార్యము; మేమైతే అవుననిగాని కాదనిగాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీయెదుట నున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక” అని సమాధానమిచ్చారు.PPTel 163.2

    కుటుంబం సమ్మతించిన అనంతరం తన తండ్రి గృహంనుంచి అంత దూరం వెళ్లి అబ్రాహాము కుమారున్ని పెండ్లి చేసకోవటం తనకు ఇష్టమో కాదో రిబ్కాను అడిగారు. జరిగినదంతా గ్రహించిన మీదట దేవుడే తనను ఇస్సాకుకు భార్యగా ఎంపికచేశాడని నమ్మి “వెళ్లెదనని” వారితో చెప్పింది.PPTel 163.3

    తాను వెళ్లిన పని జయప్రదమైనందుకు తన యజమాని ఆనందాన్ని ఊహించు కొంటూ తిరిగి వెళ్లిపోవటానికి దాసుడు ఆతృతగా ఉన్నాడు. తెల్లవారగానే వారు తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. అబ్రాహాము బెయెన్షిబాలో నివసిస్తున్నాడు. పక్కనున్న గ్రామంలో మందల్ని కాస్తున్న ఇస్సాకు హారాను నుంచి వర్తమానం కోసం వేచి ఉండేందుకు తండ్రి గుడారానికి వచ్చాడు. “సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయటకు వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటిమీద నుండి దిగి మనలనెదుర్కొనుటకు పొలములో నడచుచున్న ఆ మనుష్యుడెవడని దాసుని అడుగగా, అతడు - ఇతడు నా యజమానుడని చెప్పును. గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసుకొనిపోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దు:ఖ నివారణ పొందెను”.PPTel 163.4

    కయీను కాలం మొదలుకొని తనకాలం వరకు దేవుని బిడ్డలకు అన్యులకు మధ్య జరిగిన మతాంతర వివాహాల్ని అబ్రాహాము పరిశీలించాడు. హాగరుతో తన వివాహం, ఇష్మాయేలు లోతుల వివాహ సంబంధిత బాంధవ్యాలు, పర్యవసానాలు అబ్రాహాము కళ్లముందే ఉన్నాయి. అబ్రాహాము శారాలలో లోపించిన విశ్వాస ఫలితంగా ఇష్మాయేలు జననం చోటు చేసుకుంది. నీతిమంతుల సంతానం భక్తిహీనుల సంతానంతో కలగలుపుకోవటం జరిగింది. తల్లి విగ్రహారాధక బంధువులవల్ల, ఇష్మాయేలు అన్యమతస్తులైన భార్యలవల్ల కుమారుడి పై తండ్రి ప్రభావం నిరర్థకమయ్యింది. హాగరు ఈర్ష్య, ఆమె ఇష్మాయేలుకు ఎంపిక చేసిన భార్యల ఈర్ష్య అబ్రాహాము కుటుంబానికి ఒక అడ్డుగోడగా నిలిచింది. దాన్ని తొలగించటానికి అబ్రాహాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.PPTel 164.1

    ఆదిలో అబ్రాహాము బోధనలు ఇష్మాయేలుని ప్రభావితం చేయకపోలేదు. కాని తన భార్యల ప్రభావం అతడి కుటుంబంలో విగ్రహారాధన స్థిరపడటానికి హేతువయ్యింది. తండ్రితో విడిపోయి, ప్రేమగాని దైవ భీతిగాని లేని గృహంలో జనించే కలహాలు, విభేదాలతో విసిగిపోయి ఇష్మాయేలు అడవి వీరుడి జీవితాన్ని ఎంపిక చేసుకున్నాడు. “అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని” విరోధంగా ఉన్నాయి. ఆది 16:12. అనంతరం అతడు తన చెడు మార్గాల గురించి పశ్చాత్తాపం పొంది తిరిగి తన తండ్రి దేవుడైన యెహోవాను ఆరాధించటం మొదలు పెట్టాడు. కాని అతడి సంతతిమీద పడ్డ చెడు ప్రవర్తన ముద్ర నిలిచిపోయింది. అతడి సంతతినుంచి వృద్ధి చెందిన శక్తిమంతమైన రాజ్యాలు ఆందోళనలకు అన్యమతాలకు ఆటపట్టులై ఇస్సాకు సంతతివారిని నిత్యం కవ్వించి హింసించాయి.PPTel 164.2

    లోతు భార్య స్వార్థపరురాలు, భక్తి హీనురాలు. లోతు అబ్రాహాముతో విడిపోవటానికి ఆమే కారణం. ఆమె జోక్యం లేకపోతే దైవభక్తుడైన అబ్రాహాము హితవు మార్గదర్శకత్వం విడిచి పెట్టి సొదొమ పట్టణంలో నివసించటానికి లోతు తీర్మానించుకొనేవాడుకాదు. చిన్న వయసులో అబ్రాహాము గృహంలో తాను నేర్చుకొన్న ఉపదేశం తనలో లేకపోతే తన భార్య దుష్ప్రభావం, ఆ పట్టణంలోని దుష్ట స్నేహాలు లోతును మతభ్రష్టుడ్ని చేసి దేవునికి దూరంచేసేవి. లోతు వివాహం, తన గృహం ఏర్పాటుకు అతడు సొదొమను ఎంపికచేసుకోటం - ఇవి లోకంలో అనేక శతాబ్దాలపాటు కొనసాగే దుర్మార్గ ఘటనల గొలుసులో మొదటి లింకులు.PPTel 164.3

    దేవుని సేవించేవారు ఆయనను సేవించనివారితో జతకట్టటం ఆధ్యాత్మికంగా ప్రమాదకరం. “సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా” ఆమోసు 3:3. వివాహ బాంధవ్యంలోని ఆనందం, సౌభాగ్యం భార్యాభర్తల ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. అయితే విశ్వాసికి, అవిశ్వాసికి అభిరుచులు, కోరికలు, ఉద్దేశాల సందర్భంగా పెద్ద తేడాలుంటాయి. వారు పరస్పరం వ్యతిరేకులైన ఇద్దరు యజమానులకు దాసులు. ఒకరి నియమాలు ఎంత పవిత్రమైనవైనా విశ్వసించని స్నేహితుడి ప్రభావం దేవుని నుంచి దరంగా నడిపించే స్వభావం కలిగి ఉంటుంది.PPTel 165.1

    ఒక వ్యక్తి క్రైస్తవుడు కాకపూర్వం వివాహితుడై ఉంటే క్రైస్తవుడైన తర్వాత అతనికి అతని భార్యకు మధ్య మతపరమైన భేదాలు ఎన్ని ఉన్నా అతడు ఆమెకు నమ్మకంగా ఉండాలని క్రైస్తవ మతం బలంగా ప్రబోధిస్తుంది. కాగా మానవ బాంధవ్యాలన్నిటికన్నా దైవవిధులు ఉన్నతమైనవిగా పరిగణించాలి - పర్యవసానంగా శ్రమలు, హింస కలిగినా, ప్రేమతో, సాత్వికంతో ఇలా నమ్మకంగా నివసించటం విశ్వసించని జీవిత భాగస్వామిని ప్రభావితం చేయవచ్చు. కాని దేవుని నమ్మని వారితో క్రైస్తవుల వివాహాల్ని బైబిలు నిషేధిస్తుంది. ప్రభువిచ్చిన ఆదేశం ఇది, “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి” 2 కొరింథీ 6:14, 17, 18.PPTel 165.2

    లోకానికి గొప్ప దీవెనకానున్న దివ్య వాగ్దానాలకు వారసుడైన ఇస్సాకును దేవుడు బహుగా గౌరవించాడు. తనకు నలభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తనకు భార్యను ఎంపిక చేయటానికి తన తండ్రి ఇంటి దాసుణ్ని నియమించినప్పుడు ఆ తీర్మానాన్ని ఇస్సాకు అంగీకరించాడు. లేఖనాలు వివరిస్తున్న విధంగా ఆ వివాహ ఫలితం సుందర, ఆనందమయ సంసారం. “ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసుకొనిపోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను”.PPTel 165.3

    ఇస్సాకు వ్యవహరణ విధానానికి క్రైస్తవులమని చెప్పుకొంటున్న నేటి యువత వ్యవహరిస్తున్న తీరుకు మధ్య ఎంత వ్యత్యాసం! ప్రేమలు ఇచ్చి పుచ్చుకొనే విషయంలో తమ ఇష్టమే ప్రధానమని, అందులో తల్లిదండ్రులకు చివరికి దేవునికి ఎలాంటి ప్రమేయం ఉండకూడదని యువజనునలు తరచుగా భావిస్తారు. యుక్త వయసు రాకముందే తల్లిదండ్రుల నియంత్రణ లేకుండా తమ సొంత ఎంపికలు చేసుకోటానికి తమకు సమర్థత పరిణతి ఉన్నాయని యువజనులు భావిస్తారు. కొద్ది సంవత్సరాల వివాహ జీవితం తాము చేసింది తప్పు అని నిరూపించటానికి సరిపోతుంది. అయితే ఆ వివాహ దుష్పరిణామాల్ని సవరించటం సాధ్యపడదు. ఎందుచేతనంటే ఆ ఎంపికకు దారితీసిన తొందరపాటుతనం నిగ్రహలేమి కొనసాగి తుదకు వివాహ బాంధవ్యాన్ని దుర్బరం చేస్తాయి. ఈ విధంగా అనేకులు ఈ జీవితంలో ఆనందాన్నిరానున్న జీవితానికి నిరీక్షనను నాశనం చేసుకొంటారు.PPTel 166.1

    పెద్దవారు ఎక్కువ అనుభవంగలది సూచనలు, సలహాలు తీసుకొని జాగ్రత్తగా పరిగణించాల్సిన అంశం ఒకటి ఉంటే అది వివాహాన్ని గూర్చిన అంశం. సలహాదారుగా బైబిలు అవసరం ఎన్నడైనా ఉంటే మార్గనిర్దేశం చేయమంటూ ప్రార్థన ద్వారా దేవున్ని అర్థించాల్సిన అవసరం ఎన్నడైనా ఉంటే అది ఇద్దరు జీవితాంతం కలిసి ఉండటానికి తీసుకొనే చర్యకు ముందు జరగాలి.PPTel 166.2

    భవిష్యత్తులో తమ బిడ్డల సుఖ సంతోషాలకు తాము నిర్వహించాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు ఎన్నడూ విస్మరించకూడదు. తండ్రి విచక్షణకు, తీర్మానానికి ఇస్సాకు కట్టుబడి ఉండటం విధేయ జీవితాన్ని ప్రేమించటానికి తాను పొందిన శిక్షణ ఫలం. తల్లిదండ్రుల అధికారాన్ని గౌరవించాల్సిందిగా అబ్రాహాము తన బిడ్డల్ని ఆదేశించినప్పటికీ, ఆ అధికారం స్వార్థపూరితం కాదని లేదా అది నిరంకుశ నియంత్రణ కాక ప్రేమతో నిండి వారి క్షేమాన్ని, ఆనందాన్ని కోరేదని అతడి దినదిన జీవితం సాక్ష్యమిచ్చింది.PPTel 166.3

    యోగ్యులైన వారినే జీవిత భాగస్వాములుగా యువత ఎంపిక చేసుకొనేందుకు వారి ప్రేమల విషయంలో వారిని నడిపించే బాధ్యత తండ్రుల మీద, తల్లుల మీద ఉన్నది. తమ బిడ్డలు పవిత్రంగాను ఉత్తములుగాను పెరిగి మంచికి నిజాయితీకి ఆకర్షితులయ్యేందుకుగాను దైవకృప, సహాయంతో తమ సొంత ఉపదేశం ఆదర్శాల ద్వారా వారి ప్రవర్తనలను రూపుదిద్దటం తమ విద్యుక్త ధర్మమని తల్లిదండ్రులు గుర్తించాలి. సాటి సాటిని ఆకర్షిస్తుంది. సాటి సాటిని అభినందిస్తుంది. బిడ్డల మనసుల్లో తమ చిన్ననాటి నుంచే సత్యం, పవిత్రత, మంచిపట్ల అభిమానాన్ని పెంచాలి. అప్పుడు యువత ఈ గుణ లక్షణాలున్న వారి సాంగత్యాన్నే అన్వేషిస్తారు.PPTel 166.4

    తల్లిదండ్రులు తమ సొంత ప్రవర్తనలోను తమ గృహ జీవితంలోను, పరలోక జనకుని ప్రేమను, ఔదార్యాన్ని ప్రదర్శించాలి. గృహం సూర్యకాంతితో నిండి ఉండాలి. మీ బిడ్డల పరంగా ఇది భూములకన్నా ధనంకన్నా ఎంతో విలువైంది. వారు వెనక్కు చూసి తమ చిన్ననాటి గృహం శాంతి ఆనందాలతో నిండి పరలోకంలా ఉండేదని బిడ్డలు తలంచేందుకుగాను గృహంలోని ప్రేమ, మమతలు వారి హృదయాల్లో నిలిచిపోవాలి. కుటుంబ సభ్యులందరికీ ఒకే ప్రవర్తన ఉండదు. ఓర్పు, సహనం, అగత్యమయ్యే సందర్బాలు తరచుగా చోటు చేసుకోవచ్చు. కాని ప్రేమ ద్వారా ఆత్మ నిగ్రహం ద్వారా అందరూ ఒకరికి ఒకరు హత్తుకొని ఐక్యంగా రాగ రంజితంగా నివసించవచ్చు.PPTel 167.1

    యధార్థమైన ప్రేమ ఒక ఉన్నతమైన పవిత్రమైన నియమం. ఉద్వేగంవల్ల పుట్టిన కఠిన పరీక్షకు గురి అయినప్పుడు మాయమయ్యే ప్రేమకన్నా ఇది ఎంతో వ్యత్యాసమయ్యింది. తల్లిదండ్రుల గృహాల్లో విధులు నమ్మకంగా నిర్వహిచంటం ద్వారా యువత తమ సొంత గృహాలు స్థాపించుకోటానికి శిక్షణ పొందాల్సి ఉన్నారు. వారు ఇక్కడ ఆత్మ ఉపేక్ష పాటించి దయ, మర్యాద, క్రైస్తవ సానుభూతి ప్రదర్శించాలి. ఈ విధంగా హృదయంలోని ప్రేమను వెచ్చగా ఉంచుకోవచ్చు. అలాంటి గృహవాతావరణంలోనుంచి వచ్చే పురుషుణ్ని జీవిత భాగస్వామిగా తాను ఎనుకున్న మహిళ సంతోషాన్ని ఎలా ప్రోది చేసుకోవాలో అవగతం చేసుకొంటాడు. వివాహం ప్రేమకు తెరదించేబదులు ప్రేమకు తెరలేపుతుంది.PPTel 167.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents