Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    30—గుడారం, గుడార సేవలు

    తనతో పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు మోషేకి ఈ ఆదేశం ఇచ్చాడు, “నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను”. గుడార నిర్మాణానికి దేవుడు మోషేకి సూచనలిచ్చాడు. దైవ సన్నిధి తమతో ఉండే ఆధిక్యతను ఇశ్రాయేలీయులు తమ మత భ్రష్టతవల్ల పోగొట్టుకున్నారు. తమ పరిస్థితిని బట్టి వారు ఆలయాన్ని నిర్మించుకోటానికి కూడా లేదు. కాని వారు మళ్లీ దేవుని అనుగ్రహాన్ని పొందిన తర్వాత వారి అధినాయకుడు దేవుని ఆదేశం అమలుకు పూనుకొన్నాడు.PPTel 333.1

    ఆ పవిత్ర నిర్మాణానికి ఎంపిక అయిన మనుషులికి దేవుడు ప్రత్యేక నైపుణ్యాన్ని వివేకాన్ని అనుగ్రహించాడు. గుడారం పరిమాణం, రూపం దాని నిర్మాణానికి ఉప యోగించాల్సిన వస్తువులు, గుడారంలో ఉండాల్సిన సామాగ్రి, ఉపకరణాలు మొదలైన వివరాలతో సహా గుడార నిర్మాణానికి ప్రణాళికను దేవుడు మోషేకిచ్చాడు. హస్తకృతమైన పరిశుద్ధ స్థలాలు “నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి” “పరలోకమందున్నవాటిని” సూచిస్తాయి. (హెబ్రీ 9:24, 23). మన ప్రధాన యాజకుడైన క్రీస్తు తన ప్రాణ బలిదానం అనంతరం పాపి తరపున పరిచర్య చెయ్యాల్సి ఉన్న పరలోక గుడారానికి ఇది సూక్ష్మ రూప సాదృశ్యం. పర్వతం మీద దేవుడు పరలోక గుడార దృశ్యాన్ని మో షేకి చూపించి సమస్తం దానిలో ఉన్నట్లే చేయాల్సిందిగా ఆదేశించాడు. ఈ సూచనలన్నిటినీ మోషే జాగ్రత్తగా రాసి ప్రజానాయకులకు అందించాడు.PPTel 333.2

    గుడార నిర్మాణానికి ఎంతో ద్రవ్యం, సిద్ధబాటు అవసరం. మిక్కిలి ప్రశస్తమైన ఖరీదైన సరకులు అవసరం. అయినా ప్రజలవద్ద నుంచి స్వేచ్ఛార్పణల్నే ప్రభువు అంగీకరించాడు. “మన: పూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను” అన్న దైవాదేశాన్ని మోషే ప్రజలకు తెలియపర్చాడు. మహోన్నతునికి నివాస స్థలం సిద్ధబాటులో దేవుని పట్ల భక్తిభావం, త్యాగశీలత ప్రథమ ప్రాధాన్యాలు.PPTel 333.3

    ప్రజలందరు ఏక మనసుతో స్పందించారు. “ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారము యొక్క పనికొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి”. “మరియు నీలధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేక వెండ్రుకలు, ఎఱ్ఱ రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు నీటిలో ఏవి యెవరి యొద్దనుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండిగాని, ఇత్తడిగాని, ప్రతిష్టించి ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మ కట్టి యెవని యొద్దనుండెనో వాడు దాని తెచ్చెను.PPTel 333.4

    మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర వర్ణముగల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయముగలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి.PPTel 334.1

    “ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును అభి షేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి”. నిర్గమకాండము 35:21-28.PPTel 334.2

    ఆలయ నిర్మాణం సాగుతున్నప్పుడు పెద్దలు, పిన్నలు, పురుషులు, స్త్రీలు, చిన్నారులు అందరూ కానుకలు తేవటం కొనసాగించారు. నిర్మాణానికి నాయకులైన వారు అవసరమైన దానికన్నా ఎక్కువ కానుకలు పోగైనట్లు గమనించారు. సమాజ మంతట మోషే ఈ విధంగా ప్రకటన చెయ్యించాడు, “పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను, ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి”. ఇశ్రాయేలీయుల గొణుగుడు, వారి పాపాల కారణంగా దేవుడు వారిమీదికి పంపిన తీర్పులు అనంత తరాల ప్రజలకు హెచ్చరిక కలిగేందుకు నమోదయ్యాయి. వారి భక్తి, వారి ఉత్సాహం, వారి ధాతృత్వం ఆచరణీయమైన ఆదర్శం.PPTel 334.3

    దైవారాధనను ప్రేమించి దేవుని సన్నిధిని గొప్ప దీవెనగా పరిగణించేవారందరూ తమతో ఆయన సమావేశం అయ్యేందుకు ఆయనకు ఆలయం నిర్మించటానికి అలాంటి త్యాగశీలతనే ప్రదర్శిస్తారు. తమకున్న వాటిలో శ్రేష్ఠమైన వాటిని ప్రభువుకి అర్పించాలని అభిలషిస్తారు. దేవాలయ నిర్మాణంలో అప్పులు మిగల్చకూడదు. అలా చేయటం దేవున్ని అగౌరవ పరచటమవుతుంది. ఆలయ నిర్మాణానికి అవసరమైనంత ద్రవ్యం స్వేచ్ఛార్పణగా ఇవ్వాలి. “ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దు” అని గుడార నిర్మాణకులు అన్నట్లు ఆలయ నిర్మాణకులు చెప్పేంతగా ఆరాధకులు నిధులు సమకూర్చాలి.భాగభాగాలుగా విప్పి ఇశ్రాయేలీయులు తమ ప్రయాణాల్లో మోసుకుపోవ టానికి వీలుగా ఉండేటట్లు గుడార నిర్మితి జరిగింది. అందుచేత దాన్ని ఏబయి అడుగులు పొడవు, పద్దెనిమిది అడుగులు వెడల్పు, పద్దెనిమిది అడుగుల ఎత్తులో చిన్నదిగా నిర్మించారు. అయినా అది వైభవోపేతమైన నిర్మాణం. గుడార నిర్మాణానికి దానిలోని ఉపకరణాలకి తుమ్మకర్ర ఉపయోగించారు. ఆ కర్ర సీనాయి వద్ద లభించే కర్ర అంతటిలోనూ చాలా గట్టిది. తుమ్మ కర్రకు చెదపట్టటం తక్కువ. గోడల్ని నిలువు పలకలతో చేసి వాటిని వెండి కుసుల్లో అమర్చారు. వాటిని పటిష్ఠంగా నిలపటానికి స్తంభాలు, అనుసంధానం చేసే అడ్డకర్రలు అమర్చారు. గుడారమంతా బంగారంతో నిర్మితి అయినట్లు కనిపించేందుకు అంతా బంగారు రేకులతో పొదగాల్సి ఉంది. గుడారం కప్పు నాలుగు జట్టుల తెరలతో చేశారు. లోపలి తెర “నీల ధూమ్ర వర్ణములుగల పేనిన సన్నపు నారతో ” చిత్రకారుని పనియైన కెరూబులుగల”ది. తక్కిన మూడింటిలో ఒకటి మేక వెంట్రకలతో చేసింది. రెండోది ఎరువు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో చేసింది. మూడోది వత్సల (సీల్) తోళ్లతో చేసింది. గుడారాన్ని సంపూర్ణిగా పరిరక్షించేలా వీటిని అమర్చారు.PPTel 334.4

    బంగారు పూతగల రెండు స్తంభాల మధ్య వేలాడున్న తెర ఒకటి గుడారాన్ని రెండు విభాగాలు చేసింది. మొదటి విభాగం ప్రవేశంవద్ద అలాంటి తెర వేలాడూ ప్రవేశాన్ని మూసింది. కప్పు లోపలి తెర మాదిరిగా ఇవి కూడా చక్కని నీలం, ధూమ్ర వర్ణం, రక్తవర్ణం రంగులు కలిగి అందంగా ఉన్నాయి. వాటిమీద వెండి, బంగారు దారాలతో కెరూబుల బొమ్మలు అల్లారు. పరలోక గుడార సేవలో నిమగ్నులై లోకంలోని దేవుని ప్రజలకు పరిచర్య చేసే దూతగణాల్ని ఈ కెరూబుల బొమ్మలు సూచిస్తున్నాయి.PPTel 335.1

    పరిశుద్ధం గుడారం చుట్టూ ఆవరణం ఉంది. ఆవరణం చుట్టూ ఇత్తడి స్తంభాల మధ్య వేలాడున్న సన్నని నారతో చేసిన తెరలున్నాయి. ఆవరణానికి ప్రవేశం దాని తూర్పు కొనలో ఉంది. ఖరీదైన నూలు, అందమైన పనితనం గల తెరలు దాన్ని మూసి ఉంచాయి. ఆ తెరలు గుడారం తెరలకన్నా కొంచెం నాసిరకం. ఆవరణం తెరలు గుడారం గోడలకు సగం ఎత్తులో ఉండటంచేత బయట ఉన్న వాళ్లకి గుడారం స్పష్టంగా కనిపించేది. ఆవరణంలో ప్రవేశానికి అతి దగ్గరలో ఇత్తడి దహన బలిపీఠం ఉంది. ప్రభువుకి అర్పించే బలులన్నీ ఈ బలిపీఠం మీద దహనమయ్యేవి. ఈ బలిపీఠానికి గుడారం తలుపుకి మధ్య ఇత్తడి గంగాళం ఉంది. ఇశ్రాయేలీయ స్త్రీలు స్వేచ్చార్పణగా ఇచ్చిన అద్దాల నుంచి దాని తయారీ జరిగింది. పరిశుద్ధ విభాగాల్లోకి వెళ్లేటప్పుడు లేదా ప్రభువుకి దహనబలి అర్పించేందుకు దహన బలిపీఠం వద్దకు వెళ్లేటప్పుడు యాజకులు కాళ్లూ, చేతులూ గంగాళం వద్ద కడుక్కోవాల్సి ఉన్నారు. PPTel 335.2

    మొదటి విభాగంలో అనగా పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక ఉన్నాయి. సన్నిధి రొట్టెల బల్ల ఉత్తరాన ఉన్నది. దానికి శుద్ధమైన బంగారంతో పొదిగిన అందమైన కిరీటం ఉంది. ప్రతీ సబ్బాతునాడు యాజకులు రెండు దొంతర్లుగా పన్నెండు రొట్టెలు పెట్టి వాటిపై సాంబ్రాణి ఉంచటానికి బాధ్యులు. బల్లమీద నుంచి తీసివేసే రొట్టెలు పరిశుద్ధమైనవి గనుక వాటిని యాజకులు భుజించేవారు. దక్షిణాన ఏడు శాఖల దీప వృక్షం ఉంది. దానికి ఏడు దీపాలున్నాయి. దాని కొమ్మలకు నగిషీగా చేసిన పువ్వులున్నాయి. అవి మల్లి పువ్వులల్లే ఉన్నాయి.PPTel 336.1

    అదంతా ఒకే బంగారం ముక్క నుంచి ఏకాండంగా నిర్మితి అయ్యింది. గుడారానికి కిటికీలు లేవు. అందువల్ల దీపాలన్నిటినీ ఒకేసారి ఆర్పేవారు కాదు. అవి రాత్రి పగలూ వెలుగులు విరజిమ్ముతూ ఉండేవి. పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలాన్ని అందులోని దేవుని తక్షణ సన్నిధిని వేరుచేస్తున్న తెర ముందర బంగారు ధూపవేదిక ఉంది. ప్రతీ ఉదయం, ప్రతీ సాయంత్రం ఈ వేదికమమీద యాజకుడు ధూపం వేసేవాడు. పాప పరిహారార్థ బలి రక్తం దాని కొమ్ములకు రాసేవాడు. ప్రాయశ్చిత్తార్థ దినాన ప్రధాన యాజకుడు ఆ వేదిక పై రక్తం ప్రోక్షించేవాడు. ఈ వేదిక మీద అగ్నిని దేవుడే ముట్టించాడు. అది పవిత్రాగ్నిగా గౌరవం పొందింది. ఆ పరిశుద్ధ ధూప పరిమళం పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలాల్ని నింపి గుడారం వెలుపల చాలా దూరం వ్యాపించేది.PPTel 336.2

    లోపలి తెర అవతలిది అతి పరిశుద్ధ స్థలం. అందులో ఛాయా రూపక ప్రాయశ్చిత్తార్థ పరిచర్య ఛాయారూపక విజ్ఞాపన పరిచర్య జరిగేవి. అది భూలోకాన్ని పరలోకంతో అనుసంధాన పరచే స్థలంగా ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండేది. మందసాన్ని తుమ్మకర్రతో చేసి లోపల, బయట బంగారు రేకుతో పొదిగి దానిపై బంగారు కిరీటం అమర్చారు. దేవుడు స్వయంగా తన వేలితో పది ఆజ్ఞలు రాసిన రాతి పలకాన్ని భద్రంగా ఉంచటానికి దాన్ని చేశారు. దేవునికిని ఇశ్రాయేలీయులకిని మధ్య జరిగిన నిబంధనకు పది ఆజ్ఞలు ఆధారం గనుక దీనికి దేవుని నిబంధన మందసం అని లేదా నిబంధనకు మందసం అని పేరు. పరిశుద్ద మందసం మతకు కరుణా పీఠం అని పేరు. దీన్ని బంగారంతో ఏకాండంగా చేశారు. మందసం పై ఈ కొనను ఒక కెరూబు ఆ కొనను ఒక కెరూబు నిలిచి ఉన్నట్లు చేశారు. ఈ ఇద్దరు దూతలు తమ రెక్కల్లో ఒకదాన్ని పైకి లేపి రెండో దాన్ని ముడుచుకొన్నట్లు (యెహెజ్కేలు 1:11) చేశారు. ఇది పూజ్య భావానికి నమ్రతకు చిహ్నం, కెరూబులు ఒకరికొకరు ఎదురుగా నిలబడి భక్తిగా కింది మందసం వంక చూడటం పరలోక నివాసులకు దైవ ధర్మ శాస్త్రంపట్ల ఉన్న గౌరవాన్ని రక్షణ ప్రణాళిక అంటే వారికున్న ఆసక్తిని సూచించింది.PPTel 336.3

    కరుణా పీఠానికి పైన దేవుని సన్నిధి కాంతి ‘షెకీనా’ మహిమ ప్రత్యక్షమయ్యేది. కెరూబుల మధ్యనుంచి దేవుడు తన చిత్రాన్ని బయలుపర్చేవాడు. కొన్నిసార్లు దేవుడు తన వర్తమానాన్ని మేఘంలోనుంచి మాట్లాడే స్వరంద్వారా ప్రధాన యాజకుడికి అందించేవాడు. సమ్మతిని లేక అంగీకారాన్ని తెలపటానికి కొన్నిసార్లు కుడిపక్క దూతమీద వెలుగు ప్రకాశించేది లేదా అసమ్మతిని లేక తిరస్కృతిని తెలపటానికి నీడ లేదా మబ్బు ఎడమ పక్క దూతమీద పడేది.PPTel 337.1

    మందసంలో ఉన్న దైవ ధర్మశాస్త్రం నీతికి కూర్పుకూ నిబంధన. అపరాధికి మరణం విధించింది ఆ ధర్మశాస్త్రమే. అయితే ధర్మశాస్త్రానికి పైనున్నది కరుణా పీఠం. కరుణా పీఠం పై దేవుని సముఖం ఉన్నది. ప్రాయశ్చిత్తం ద్వారా పశ్చాత్తాపం పొందిన పాపికి క్షమాపణ అక్కడ నుంచి వచ్చింది. గుడార పరిచర్య చిహ్నం కింద క్రీస్తు మన రక్షణ నిమిత్తం చేస్తున్న సేవలో ఈ రీతిగా “కృపా సత్యములు కలిసినవి నీతి సమాధానములు ఒకదాని నొకటి ముద్దు పెట్టుకొనినవి”. కీర్తనలు 85:10.PPTel 337.2

    బంగారం పొదిగిన గోడలు బంగారు దీప వృక్షం నుంచి పడుతున్న వెలుగును ప్రతిబింబించటం, ధగధగ మెరుస్తున్న దేవదూతల అల్లికలున్న రంగురంగుల తెరలు, బంగారపు ధూపవేదిక నిగనిగలు, రెండో తెరకు ఆవల మార్మిక కెరూబులతో వారి శు ద్ద మందసం, దానికి పైగా ప్రకాశిస్తున్న షెకీనా మహిమ, యెహోవా ప్రత్యక్ష సన్నిధి ప్రదర్శన - గుడారంలోని ఈ మహిమాన్విత దృశ్యాన్ని భాషలు వర్ణించలేవు. ఇవన్నీ మానవుల రక్షణ నిమిత్తం జరిగే కృషికి కేంద్రమయిన పరలోక గుడార మహిమల్ని మసకమసకగా మాత్రమే ప్రతిబింబించాయి.PPTel 337.3

    గుడార నిర్మాణానికి దగ్గర దగ్గరగా అర్థ సంవత్సరం పట్టింది. నిర్మాణం పూర్తి అయిన తర్వాత మోషే నిర్మాణకుల పనిని తనిఖీ చేశాడు. తనకు కొండ మీద దేవుడిచ్చిన ఆదేశాలు సూచనలతో పోల్చుతూ ఆ పనిని నిశితంగా పరీక్షించాడు. “మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి. ఆలాగుననే చేసియుండిరి గనున మోషే వారిని దీవించెను”. పవిత్రమైన ఆ గుడారాన్ని చూడటానికి ఇశ్రాయేలీయులు తండోప తండాలుగా వచ్చారు. గుడారాన్ని ప్రజలు భక్తిభావంతో చూస్తున్నప్పుడు మేఘ స్తంభం గుడారం మీది నిలిచి కిందికి వచ్చి గుడారాన్ని ఆవరించింది. “యెహోవా తేజస్సు మందిరమును నింపెను”. దేవుని మహాత్యం కనిపించింది. కొంత సేపు మోషే సైతం ప్రవేశించలేకపోయాడు. తమ చేతి పనిని దేవుడంగీకరించినట్లు కనిపించిన నిదర్శనాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు ఉత్సాహభరితులయ్యారు. ఉత్సాహ ప్రదర్శనలేవీ చోటు చేసుకోలేదు. అందిలోను పరిశుద్ధ భయం పుట్టింది. వారి కళ్లు ఆనంద భాష్పాలతో నిండాయి. తమతో నివసించ టానికి దేవుడు దిగివచ్చినందుకు కృతజ్ఞతలు వ్యక్తంచేస్తూ గుసగుసలాడుకొన్నారు. PPTel 337.4

    దైవాదేశం మేరకు లేవీ గోత్రాన్ని గుడార సేవలకు ప్రత్యేకించారు. పూర్వం ప్రతీ పురుషుడు తన గృహానికి యాజకుడుగా వ్యవహరించేవాడు. అబ్రాహాము దినాల్లో కుటుంబ యాజకత్వం జ్యేష్ఠ పుత్రుడి హక్కుగా పరిగణించేవారు. ఇప్పుడు ఇశ్రాయేలు సమాజంలోని జ్యేష్ఠ పుత్రుల స్థానంలో లేవీ గోత్రాన్ని గుడార సేవకలు దేవుడు అంగీకరించాడు. బంగారు దూడను పూజించి ఇశ్రాయేలీయులు మత భ్రష్టతకు పాల్పడ్డప్పుడు లేవీ గోత్రం దేవునికి నమ్మకంగా ఉన్నందుకు ఆ గోత్రానికి ఈ ప్రత్యేక గౌరవం చెందటానికి దేవుడు తన ఆమోదాన్ని వ్యక్తం చేశాడు. అయితే యాజకత్వం అహరోను కుటుంబానికి మాత్రమే పరిమితమయ్యింది.PPTel 338.1

    దేవుని ముందు సేవ చెయ్యటానికి అహరోనుకి అతడి కుమారులకి మాత్రమే ఆమోదం ఉంది. లేవీ గోత్రంలో తక్కినవారికి గుడారానికి గుడార పరికరాలకి సంబంధించిన ఇతర బాధ్యతలు అప్పగించారు. కాగా వారు యాజకుల సేవలో సహాయకులుగా ఉండవచ్చునుగాని బలులర్పించటానికి ధూపం వేయటానికి లేదా పరిశుద్ధ పదార్థాలపై మూతవేసే వరకు వాటిని చూడటానికి వారికి అనుమతి లేదు.PPTel 338.2

    తమ బాధ్యతలననుసరించి యాజకులకు ప్రత్యేక సేవావస్త్రాలు ఏర్పాటు చేశారు. “అతనికి అలంకారమును, ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను”. అని మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు.PPTel 338.3

    సామాన్య యాజకుడు ధరించాల్సిన దుస్తులు సన్ననారతో ఏకాండంగా వేసిన దాదాపు పాదాల వరకు ఉండే అంగీ నడుముచుట్టూ బుటాపని గల నడికట్టు తలమీద సన్ననార పాగా. తాను నిలబడి ఉన్నది పరిశుద్ధ స్థలం గనుక చెప్పులు విడువమని మో షేని దేవుడు ఆదేశించాడు. కాబట్టి యాజకులు చెప్పులతో గుడారంలో ప్రవేశించకూడదు. చెప్పులకు అంటుకొని ఉన్న ధూళి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేస్తుంది. వారు తమ చెప్పుల్ని గుడారపు ఆవరణలో విడిచి పెట్టి కాళ్లూ, చేతులూ కడుగుకొని మరి గుడారంలో సేవ చేయటానికి గాని, దహన బలిపీఠం వద్ద పరిచర్య చేయటానికిగాని ఉపక్రమిం చాల్సి ఉన్నారు. దైవ సన్నిధానంలోకి ప్రవేశించేవారందరూ సకల విధాలైన అపవిత్రతను విడిచి పెట్టాలన్న విషయం ప్రజలకు ఇలా ప్రతి నిత్యం బోధించటం జరిగింది.PPTel 338.4

    ప్రధాన యాజకుడి వస్త్రాలు ఖరీదైనవి. అతడి ఉన్నత స్థాయికి అనుగుణంగా వాటిని అందంగా నైపుణ్యంతో తయారు చేశారు. సామాన్య యాజకుడు ధరించే సన్ననార వస్త్రాలతో పాటు అతడు ఏకాండంగా నేసిన నీలవర్ణం నిలువుటంగీని ధరించేవాడు. ఆ అంగీ అంచుమీద నీల ధూమ్ర రక్తవర్ణం గల నూలుతో దానిమ్మ పండ్లు, బంగారు గంటలు నేశారు. దాని పైని ఏఫోదు ఉండేది. ఏఫోదు నీల ధూమ్ర రక్త వర్ణం, తెలుపు కలిగిన కురచయిన బంగారు వస్త్రం, దాని పై అనేక రంగులు కలిగిన అందమైన దట్టీ ఉండేది. ఏఫోదు చేతుల్లేని చొక్కా. బంగారు దారాలతో బుటా పని చేసిన దాని భుజఖండాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు చెక్కిన రెండు సులిమాని రాళ్లు పొదిగారు.PPTel 339.1

    ఏఫోదు పైన పతకం ఉంది. యాజకుడి ఉడుపుల్లో ఇది మిక్కిలి పవిత్రమైంది. ఏఫోదుని పతకాన్ని ఒకే రకమైన నూలుతో చేశారు. అది చచ్చవుకమైంది. అది జానెడు పొడవు, జానెడు వెడల్పుగలది. ఆ పతకానికి నీలి తాడు పేని దాన్ని బంగారు ఉంగ రాలకు తగిలించి భుజఖండాల నుంచి వేలాడేటట్లు అమర్చారు. దాని అంచుల్ని వివిధమైన వజ్రాలు, రత్నాలు పొదిగారు. అవి దేవుని పట్టణం పునాదుల్లో ఉన్న ప్రశస్తమైన రాళ్లు లాంటివి. దాని అంచున పన్నెండు రాళ్లను, నాలుగు వరుసల్లో బంగారంతో పొదిగారు. భుజఖండాల పై రాళ్లమల్లే వీటిపై కూడా పన్నెండు గోత్రాల పేర్లూ చెక్కారు. ప్రభువు ఆదేశం ఇది, “అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్లునప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరించవలెను”. నిర్గమ 28:29. అలాగే ప్రధాన యాజకుడైన క్రీస్తు పాపిపక్షంగా తన తండ్రిముందు తన రక్తాన్ని బట్టి విజ్ఞాపన చేస్తూ పశ్చాత్తాపపడే ప్రతీ పాపి పేరును, తన హృదయంలో భరిస్తాడు. కీర్తన రచయిత ఇలా అంటున్నాడు, “నేను శ్రమలపాలై దీనుడైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు”. కీర్తనలు 40:17.PPTel 339.2

    పతకం కుడి ఎడమల ప్రకాశవంతమైన రెండు పెద్ద రాళ్లున్నాయి. ఇవి ఊరీము, తుమ్మీము అన్న రాళ్లు. దేవుడు తన చిత్రాన్ని ప్రధాన యాజకుడికి ఈ రాళ్ల ద్వారా తెలిపేవాడు. ప్రభువు తీర్పు అవసరమైన సమస్య ఏర్పడ్డప్పుడు కుడిపక్క రాయి చుట్టూ వెలుగు రావటం ప్రభువు అంగీకారానికి, ఎడమ పక్క రాయిపై మబ్బు కమ్మటం ప్రభువు తిరస్క ృతికి చిహ్నాలుగా గ్రహించారు.PPTel 339.3

    ప్రధాన యాజకుడు తెల్లనారతో తయారైన పాగాను ధరించేవాడు. దానికి నీలిసూత్రం, “యెహోవా పరిశుద్ధుడు” అన్న మాటలుగల బంగారు కిరీట భూషణం ఉండేవి. యాజకుల ఉడుపులకు వారి ప్రవర్తనకు సంబంధించిన ప్రతీ విషయం దేవుడు పరిశుద్దుడని ఆయన ఆరాధన పరిశుద్ధమైందని ఆయన సన్నిధికి వచ్చేవారు పరిశుద్ధత కలిగి ఉండాలని చూసేవారికి ధృఢమైన అభిప్రాయం కలిగించాలి.PPTel 340.1

    గుడారం మాత్రమే కాదు యాజకులు కూడా “పరలోక సంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమందు సేవ చేయుదురు”. హెబ్రీ 8:5. ఇది ఇలా గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నది. ఈ ఛాయా రూపక పరిచర్యలోని ప్రతీ విషయాన్ని గూర్చి ఖచ్చితమైన, స్పష్టమైన ఉపదేశాన్ని మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు. గుడార సేవలో రెండు భాగాలున్నాయి. ఒకటి అనుదినం జరిగే సేవ. రెండోది సంవత్సరానికోసారి జరిగే సేవ. అనుదిన సేవ గుడారపు ఆవరణంలో దహన బలిపీఠం వద్ద, పరిశుద్ధ స్థలంలోను జరిగేది. అయితే సంవత్సరానికోసారి జరిగే సేవ అతి పరిశుద్ధ స్థలంలో జరిగేది.PPTel 340.2

    ప్రధాన యాజకుడు మినహా మరే మానవ నేత్రం గుడారంలోని లోపలి భాగాన్ని చూడటానికి లేదు. ఎంతో జాగరూకతతో భయభక్తులతో కూడిన సిద్ధబాటు తర్వాత సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ విభాగంలో అడుగు పెట్టేవాడు. భయంతో, వణుకుతూ అతడు దేవుని ముందుకు వెళ్లేవాడు. అతడు తమ మధ్యకు తిరిగి వచ్చేవరకు ప్రజలు నిశ్శబ్దంగా వేచి ఉండేవారు. దేవుని దీవెనలకోసం యధార్థ హృదయాల్లో ప్రార్థిస్తూ కని పెట్టేవారు. ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయుల కోసం కరుణా పీఠం ముందు ప్రాయశ్చిత్తం చేసేవాడు. మేఘ స్తంభంలో ఉన్న దేవుడు అతణ్ని కలుసుకొనేవాడు. సామాన్యంగా ఉండేదానికన్నా ప్రధాన యాజకుడు ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం ప్రజలకు భయం కలిగించేది. తమ పాపాల్ని బట్టిగాని లేక అతడి పాపాల్ని బట్టిగాని అతడు దేవుని మహిమ చేత హతుడై ఉండవచ్చునన్న భయం వారికుండేది.PPTel 340.3

    అనుదిన సేవలో ఉదయం, సాయంత్రం దహన బలి అర్పణ, బంగారు ధూప వేదిక మీద ధూపం వేయటం, వ్యక్తిగత పాపాల నిమిత్తం ప్రత్యేక బలి అర్పణలు ఉండేవి. సబ్బాతులకు అమావాస్యలకు ప్రత్యేక పండుగలకు కూడా అర్పణలుండేవి.PPTel 340.4

    యాజకులు ప్రతీ ఉదయం, ప్రతీ సాయంత్రం సరియైన నైవేద్యంతోపాటు ఒక ఏడాది వయసుగల గొర్రె పిల్లను బలిపీఠం పై దహించేవారు. ఇశ్రాయేలు ప్రజలు దినదినం తమ్మును తాము యెహోవాకు అంకితం చేసుకొంటున్నట్లు క్రీస్తు ప్రాయశ్చిత్తార్థ బలిదానం మీద తాము నిత్యం ఆధారపడి ఉన్నట్లు వ్యక్తం చేయటానికి ఇది చిహ్నం. గుడార సేవలో అర్పించే ప్రతీ అర్పణ నిర్దోషమై ఉండాలని దేవుడు స్పష్టంగా ఆదేశించాడు. నిర్గమ కాండము 12:6. బలి నిమిత్తం ప్రజలు తెచ్చే పశువుల్ని యాజకులు జాగ్రత్తగా పరీక్షించి దోషాలున్నవాటిని నిరాకరించాల్సి ఉన్నారు. “నిర్దోషమును, నిష్కళంకమునగు గొట్టె పిల్ల” అయిన క్రీస్తు సంపూర్ణ పవిత్రతకు చిహ్నం కావటానికి “నిర్దోషమైన” గొర్రెపిల్ల మాత్రమే అర్పణ కావాలి. 1 పేతురు 1:19. క్రీస్తు అనుచరులు ఎలా ఉండాలి అన్నదానికి ఉదాహరణగా ఈ బలి అర్పణల్ని ప్రస్తావిస్తూ అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది” రోమా 12:1. దేవుని సేవకు మనల్ని మనం సమర్పించుకోవాలి. మనకున్నదానిలో శ్రేష్ఠమైనదాన్ని అర్పించకపోతే ప్రభువు తృప్తి చెందడు. ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారు తమ జీవితంలో ఉత్తమ భాగాన్ని ప్రభువు సేవకు అంకితం చేస్తారు. ఆయన చిత్తం నెరవేర్చటానికి ప్రోదిచేసే చట్టాలన్నిటికీ సానుకూలంగా పనిచెయ్యటానికి తమ శక్తుల్ని సామర్థ్యాల్ని ఉప యోగించే మార్గాల్ని నిత్యం అన్వేషిస్తారు.PPTel 341.1

    అనుదినం జరిగే ఏ పరిచర్యలోకన్నా ధూప పరిచర్యలో దేవుని ప్రత్యేక సన్నిధిలో యాజకుడు ఎక్కువ ఉండటం జరిగేది. గుడారం లోపలి తెర కప్పువరకూ లేనందువల్ల కరుణా పీఠానికి పైగా ప్రదర్శితమయ్యే దైవ మహిమ మొదటి విభాగంలోకి స్పష్టంగా కనిపించేది. యాజకుడు ప్రభువుముందు ధూపం వేసినప్పుడు మందసంకేసి చూసేవాడు. ధూపం మేఘంలా పైకి లేచినప్పుడు దేవుని మహిమ కరుణాపీఠం మీదికి దిగివచ్చి అతి పరిశుద్ధ స్థలాన్ని నింపేది. ఆ మహిమ పరిశుద్ద, అతి పరిశుద్ధ స్థలాల్ని నింపటంతో యాజకుడు గుడారం ద్వారం వద్దకు వెళ్లిపోవటం తరచుగా జరిగేది. ఛాయారూపకమైన ఆ సేవలో తనకు కనిపించని కరుణా పీఠాన్ని యాజకుడు విశ్వాసమూలంగా చూసినట్లే పరలోకమందున్న గుడారంలో మానవ నేత్రాలకు కనిపించకుండా మానవుల తరపున విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడైన క్రీస్తుకు దేవుని ప్రజలు ఇప్పుడు ప్రార్థనలు చేయాలి. ఇశ్రాయేలీయుల ప్రార్థనలతో పాటు పైకి లేచే ధూపం క్రీస్తు అర్హతను, క్రీస్తు విజ్ఞాపనను, ఆయన తన ప్రజలకు ఆరోపించే నీతిని, పాప మానవుల ఆరాధనను దేవునికి అంగీకృతం చేసే క్రీస్తు నీతిని సూచిస్తుంది. అతి పరిశుద్ధ స్థలంలోని తెరముందు నిత్య విజ్ఞాపన బలిపీఠం, పరిశుద్ధ స్థలం ముందు నిత్య ప్రాయశ్చిత్తార్థ బలిపీఠం ఉండేవి. రక్తం ద్వారాను, ధూపం ద్వారాను దేవుని అన్వేషించాలి. ఈ గుర్తులు మన విజ్ఞాపకుణ్ని సూచిస్తున్నాయి. ఆయన ద్వారా పాపులు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. పశ్చాత్తాపం పొంది దేవుని నమ్మే పాపికి కృప, రక్షణ ఆయన ద్వారా మాత్రమే లభిస్తాయి.PPTel 341.2

    ఉదయం, సాయంత్రం ధూపం వేసే సమయంలో యాజకులు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు బయట ఆవరణంలో దహన బలిపీఠం మీద అనుదిన బలి సిద్ధంగా ఉండేది. గుడారంలో సమావేశమైన వారికి ఇది మిక్కిలి ఆసక్తికరమైన సమయం . యాజకుడి పరిచర్య ద్వారా దైవ సముఖంలోకి ప్రవేశించకముందు వారు తమ హృదయాల్ని పరీక్షించుకొని పాప క్షమాపణ వేడుకోవాల్సి ఉన్నారు. వారు తమ ముఖాలు పరిశుద్ధ పట్టణం వేపు తిప్పి నిశ్శబ్ద ప్రార్థనలు చేసేవారు.PPTel 342.1

    ఈ విధంగా వారి విన్నపాలు ధూపంతో కలిసి పైకెగసే తరుణంలో ప్రాయశ్చిత్తార్థ బలి ఛాయ రూపకంగా సూచించే వాగ్రత్త రక్షకుని నీతిని విశ్వాసం ధృడంగా పట్టుకొనేది. ఉదయం, సాయంత్రం బలులికి నియమించిన ఘడియలు పరిశుద్ధమైనవి. ఆ ఘడియల్ని యూదు జాతి యావత్తు ఆరాధనకు నియమిత సమయంగా అంగీకరించింది. తర్వాతి యుగాల్లో దూర దేశాల్లోకి యూదులు బానిసలుగా చెదిరిపోయినప్పుడు యెరూషలేము తట్టు తిరిగి తమ విన్నపాల్ని ఇశ్రాయేలు దేవునికి సమర్పించుకోటం కొనసాగించారు. క్రైస్తవులు ఉదయం, సాయంత్రం ప్రార్థన చేసుకొనేందుకు ఈ ఆచారం ఒక వరవడి కావాల్సి ఉంది. భక్తి శూన్యమైన వట్టి ఆచారాన్ని దేవుడు ద్వేషిస్తుండగా తనను ప్రేమించి తాము చేసిన పాపాలకు ఉదయ సాయంత్రాలు క్షమాభిక్ష కోరుతూ తలలు వంచి మనవి చేసే వారంటే దేవునికి ఎంతో ఆనందం.PPTel 342.2

    సన్నిధి రొట్టెలు నిత్య అర్పణగా ప్రభువు ముందు ఉండేవి. ఈ విధంగా అవి అనుదినం జరిగే బలి అర్పణలో భాగమయ్యేవి. అవి నిత్యమూ ప్రభువు ముందున్నందువల్ల వాటిని “సన్నిధి రొట్టెలు” అనటం జరిగింది. మానవుడు తన శారీరక ఆహారం కోసం ఆధ్యాత్మిక ఆహారంకోసం దేవుని మీద ఆధారపడి ఉన్నాడని అది క్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే లభ్యమౌతుందని ఇది గుర్తింపు కలిగిస్తుంది. అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని పరలోకాహారంతో పోషించాడు. శారీరకాహారం కోసం ఆధ్యాత్మిక దీవెనల కోసం వారు ఇంకా దేవుని మీద ఆధారపడి నివసించారు. మన నిమిత్తం ప్రతి నిత్యం దేవుని ముందు ఉన్న జీవాహారమైన క్రీస్తును మన్నా, సముఖపు రొట్టెలూ సూచిస్తున్నాయి. క్రీస్తు తానే ఇలా అన్నాడు, “పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే”. యోహాను 6:51. సన్నిధి రొట్టెల పై సాంబ్రాణి పెట్టేవారు. ప్రతీ సబ్బాతునాడు తాజా రొట్టెలు పెట్టటానికి పాత రొట్టెల్ని తీసివేసేటప్పుడు జ్ఞాపకార్థంగా దేవునికి ఆ సాంబ్రాణి ధూపం వేసేవారు.PPTel 342.3

    వ్యక్తిగత మనుషుల పక్షంగా జరిగే సేవ అనుదిన పరిచర్యలో ముఖ్యమైన భాగం. పశ్చాత్తాపం పొందిన పాపి తన అర్పణను గుడార ద్వారం వద్దకు తీసుకొని వచ్చి బలి పశువు తలమీద చెయ్యివేసి ఛాయ రూపకంగా తన పాపాల్ని ఆ నిరపరాధ పశు వు పైకి మార్పిడి చేస్తూ వాటిని ఒప్పుకొనేవాడు. ఆ మీదట తన సొంత చేతులతో ఆ పశువును వధించేవాడు. ఆ రక్తాన్ని యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్లి తెరముందు ప్రోక్షించేవాడు. తెరవెనుక వున్న మందసంలో పాపి అతిక్రమించిన దైవ ధర్మశాస్త్రం ఉండేది.PPTel 343.1

    ఆ ఆచారం ద్వారా పాపం ఛాయారూపకంగా రక్తం ద్వారా గుడారంలోకి మార్పిడి అయ్యేది. కొన్ని సందర్భాల్లో రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్లేవారు కాదు. కాని అహరోను కుమారులతో మోషే “సమాజము యొక్క దోష శిక్ష నిమిత్తము... ఆయన దానిని మీకిచ్చెను” అని చెప్పినట్లు దాని మాంసాన్ని యాజకుడు తినాల్సి ఉన్నాడు. లేవీయకాండము 10:17. ఈ రెండు ఆచారాలూ పశ్చాత్తాపం పొందిన పాపి పాపాలు గుడారంలోకి మార్పిడి కావటాన్ని సూచిస్తున్నాయి. PPTel 343.2

    దినదినం సంవత్సరం పొడవునా ఈ సేవ జరిగేది. ఇశ్రాయేలీయుల పాపాలు ఈ విధంగా గుడారంలోకి మార్పిడి అవటంతో పరిశుద్ధ స్థలాలు అపవిత్రమయ్యేవి. పాపాన్ని తొలగించటానికి ఒక ప్రత్యేక సేవ అవసరమయ్యేది. “ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచ”టానికి (లేవీయకాండము 16:19) పరిశుద్ధ స్థలాలికి బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిందిగా దేవుడు ఆజ్ఞాపించాడు.PPTel 343.3

    ఆలయాన్ని పవిత్ర పర్చటానికి సంవత్సరానికోసారి ప్రాయశ్చిత్తార్థ దినంనాడు యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఆ దినాన అక్కడ జరిగే సేవ సంవత్సరం పొడవునా జరిగే పరిచర్యను పూర్తిచేసేది.PPTel 343.4

    ప్రాయశ్చితార్థ దినంనాడు గుడార ద్వారం వద్దకు రెండు మేకపిల్లల్ని తీసుకువచ్చి “యెహోవా పేరిట ఒక చీటిని, విడిచి పెట్టే మేక పేరిట ఒక చీటిని” ఆ రెండింటిమీద చీట్లు వేసేవారు. ఏ మేక మీద మొదటి చీటి పడుందో దాన్ని ప్రజల తరపున పాపపరిహారార్థ బలిగా అర్పించేవారు. యాజకుడు దాని రక్తాన్ని తెర లోపలికి తెచ్చి దాన్ని కరుణా పీఠం మీద ప్రోక్షించేవాడు. “అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను”.PPTel 343.5

    అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేక తలమీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాని పంపవలెను” అలా ఆ మేకను పంపి వేసేంతవరకూ ప్రజలు తమ పాప భారం నుంచి విముక్తి పొందినట్లు భావించేవారు కాదు. యాజకుడు ప్రాయశ్చిత్తం చేసే సమయంలో తమ పనులు విడిచి పెట్టి ప్రభువు ముందు దీన మనసుతో ఆత్మ పరీక్ష చేసుకొని ఆ దినమంతా ఉపవాస ప్రార్థనలో గడపాల్సి ఉన్నారు.PPTel 344.1

    ఈ సాంవత్సరిక సేవ ద్వారా ప్రాయశ్చిత్తాన్ని గూర్చి ప్రాముఖ్యమైన సత్యాన్ని ప్రభువు ప్రజలకు నేర్పించాడు. సంవత్సరంలో ప్రజలు సమర్పించిన పాప పరిహారార్థ బలులు సందర్భంగా పాపి స్థానంలో మారుగా దేవుడు అంగీకరించాడు. అయితే బలి పశువు రక్తం “పాపానికి పూర్తిగా ప్రాయశ్చిత్తం చేయలేదు. పాపాన్ని గుడారంలోకి బదలాయించే మార్గాన్ని మాత్రమే ఏర్పాటు చేసింది. రక్తాన్ని అర్పించటం ద్వారా పాపి ధర్మశాస్త్రి ధికారాన్ని గుర్తించి తన అతి క్రమాల్ని దోషాన్ని ఒప్పుకొని, లోక పాపాన్ని తీసివేసే ఆ ప్రభువు పై విశ్వాసాన్ని ప్రకటించేవాడు. అయితే పాపి ధర్మశాస్త్రం విధించే శిక్షనుంచి పూర్తి విడుదల పొందలేదు.PPTel 344.2

    ప్రాయశ్చిత్తార్థ దినం నాడు సమాజం తరపున అర్పణతో అతి పరిశుద్ధ స్థలంలోకి రక్తం తీసుకు వెళ్లి దాన్ని ధర్మశాస్త్రపు పలకల పై ఉన్న కరుణా పీఠం పై ప్రోక్షించేవాడు. పాపి ప్రాణాన్ని కోరే ధర్మశాస్త్ర విధిని ఈ విధంగా నెరవేర్చటం జరిగేది. అంతట మధ్యవర్తి పాత్రలో ప్రధాన యాజకుడు ఆ పాపాన్ని తనమీద వేసుకొని గుడారంలో నుంచి ఇశ్రాయేలీయుల పాపాల అపరాధాన్ని మోసేవాడు. గుడారం ద్వారం వద్ద ఉన్న విడిచి పెట్టే మేక తలమీద చేతులు పెట్టి “ఇశ్రాయేలీయుల పాపములన్నియు అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద... మోపే” వాడు. ఈ పాపాల్ని మోస్తున్న మేకను పంపివేసినప్పుడు దాని పై ఉన్న పాపాలు ప్రజల నుంచి నిరంతరం వేరైపోయినట్లు పరిగణించేవారు. గుడారంలో జరిగిన సేవ “పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన” సేవ. హెబ్రీ 8:5.PPTel 344.3

    ముందు చెప్పిన విధంగా, కొండమీద దేవుడు చూపించిన మాదిరి ప్రకారం మోషే ఇహలోక గుడారాన్ని కట్టాడు. అది “ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి... అర్పణలు బలులు అర్పింపబడుచున్నవి” గుడారపు రెండు పరిశుద్ధ స్థలాలు పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు, మన ప్రధాన యాజకుడైన క్రీస్తు “మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడు” హెబ్రీ 9:9, 23, 8:2. పరలోకంలోని దేవాలయాన్ని దర్శనంలో చూసినట్లు చూసే ఆధిక్యత అపోస్తలుడైన యోహానుకి కలిగింది. “ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించ”టం చూశాడు. “మరియు సువర్ణ ధూపార్తి చేతపట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు “ఇయ్యబడ”టం చూశాడు. ప్రకటన 4:5, 8:3. పరలోక గుడారంలోని మొదటి విభాగాన్ని చూసే తరుణం ప్రవక్తకు కలిగింది. అందులోని “ఏడు దీపములు ప్రజ్వలించ”టం ఇహలోక గుడారంలోని బంగారు దీపవృక్షం ధూపవేదిక సూచించిన” సువర్ణ బలిపీఠము” చూశాడు. మళ్లీ “పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా” (ప్రకటన 11:19) అతి పరిశుద్ధ స్థలంలోని తెరను చూశాడు.PPTel 345.1

    ఇహలోక గుడారంలో పది ఆజ్ఞల ధర్మశాస్త్రాన్నుంచటానికి మోషేచే నిర్మితమైన మందసం సూచించిన “దేవుని నిబంధన మందసము”ను ప్రవక్త చూశాడు. (ప్రకటన 11:19). తాను “చూచిన మాదిరి చొప్పున” మోషే భూలోక గుడారాన్ని నిర్మించాడు. “గుడారము... సేవాపాత్రలు” “పరలోకమందున్నవాటిని పోలిన వస్తువులు” అని పౌలు వివరిస్తున్నాడు. అ.కా. 7:44. హెబ్రీ 9:21, 23. పరలోకంలో ఉన్న గుడారాన్ని చూశానని యోహాను చెబుతున్నాడు. మన పక్షంగా యేసు సేవ చేస్తున్న గుడారం ఆది గుడారం. మోషే నిర్మించిన గుడారం దాని నకలు.PPTel 345.2

    పరలోక గుడారం రాజులకు రాజైన దేవునికి నివాస స్థలం. అక్కడ “వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన యెదుట నిలిచిరి” ( దానియేలు 7:10) నిత్యుడైన దేవుని సింహాసనం తేజస్సుతో నిండిన ఆ ఆలయం ఏ స్థలంలో సంరక్షక దూతలైన కెరూబులు పూజ్యభావంతో తమ ముఖాలు కప్పుకొంటారో, ఆ పరలోక ఆలయంతో విస్తీర్ణం విషయంలోను మహిమ విషయంలోను ఏ భూలోక నిర్మాణమూ సరిసాటికాదు. కాగా మానవుడి విమోచన సందర్భంగా పరలోక గుడారం గురించి పరలోక గుడారంలో జరుగుతున్న గొప్ప సేవను గురించి ఇహలోక గుడారం దానిలో జరిగిన పరిచర్యలు ప్రాముఖ్యమైన సత్యాల్ని బోధిస్తున్నాయి.PPTel 345.3

    రక్షకుడు తన ఆరోహణానంతరం మన ప్రాధాన యాజకుడుగా తన సేనను ప్రారంభించాడు. పౌలిలా అంటున్నాడు, “నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను” హెబ్రీ 9:24. పరలోక గుడారంలో ఇప్పుడు క్రీస్తు పరిచర్య సాగుతున్నట్లే, ఛాయరూపకమైన ఇహలోక గుడారంలోనూ రెండు విభాగాలు, అను దిన పరిచర్య, సాంవత్సరిక పరిచర్య, వాటికి గుడారంలో ప్రత్యేక నిర్దిష్ట స్థలాలు ఉండి సేవలు జరిగేవి.PPTel 346.1

    పశ్చాత్తాపం పొందిన విశ్వాసుల కోసం తాను చిందించిన రక్తం ఆధారంగా విజ్ఞాపన చేయటానికి తన ఆరోహణానంతరం క్రీస్తు తండ్రిముందు కనిపించినట్లే, పరిశుద్ధ స్థలంలో తన దైనందిన పరిచర్యలో యాజకుడు పాపి తరపున బలిపశువు రక్తాన్ని ప్రోక్షించేవాడు.PPTel 346.2

    క్రీస్తు రక్తం పశ్చాత్తాపం పొందిన పాపికి ధర్మశాస్త్రం విధించే శిక్ష మంచి విముక్తి కలిగించినప్పటికీ పాపాన్ని రద్దు చేయటం దాని ఉద్దేశం కాదు. చివరి ప్రాయశ్చిత్తం జరిగే వరకూ అది గుడారం రికార్డుల్లో నిలిచి ఉంటుంది. అలాగే ఛాయా రూపక సేవలో పాప పరిహారార్థ బలి రక్తం పశ్చాత్తాప్తుడి పాపాన్ని తొలగించినా అది ప్రాయశ్చిత్తార్థ దినం వరకూ గుడారంలో మిగిలి ఉండేది.PPTel 346.3

    అందరికీ తమ తమ చివరి ప్రతిఫలం లభించే ఆ మహాదినాన “గ్రంధముల యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు.” ప్రకటన 20:12. ప్రాయశ్చిత్తాం క్రీస్తు చిందించిన రక్తం నిజంగా పాప పశ్చాత్తాపం పొందిన వారి పాపాలను పరలోక గ్రంధాల్లోనుంచి అప్పుడు తుడిచి వేస్తుంది. గుడారం ఈ విధంగా పాపపు దాఖలాల నుంచి విముక్తి లేదా శుద్ధి పొందుతుంది. ఛాయారూపక సేవలో ప్రాయశ్చిత్తార్థ క్రియను లేదా పాపాలు తుడిచి వేసే ప్రక్రియను ప్రాయశ్చిత్తార్థ దినాన జరిగే పరిచర్య సూచించింది. ఇదే భూలోక గుడార పరిశుద్ధత. ఏ పాపాల వల్ల గుడారం అపవిత్రమయ్యిందో వాటిని పాప పరిహారార్థ బలి రక్తం ద్వారా తొలగించి గుడారాన్ని పరిశుద్ధపర్చటం జరిగేది.PPTel 346.4

    చివరగా జరిగే ప్రాయశ్చిత్తం ద్వారా యధార్థంగా పాపపశ్చాత్తాపం పొందిన వారి పాపాలు పరలోక గ్రంథాల్లోనుంచి తుడుపు పడ్డాయి. అవి ఇక ఎన్నటికీ జ్ఞప్తికి రావు. అలాగే ఛాయారూపక గుడార సేవలో ఇశ్రాయేలీయుల పాపాల్ని వారి సమాజం నుంచి వేరు చేసి వాటిని అరణ్యంలో విడిచి పెట్టటం జరిగేది. సాతాను పాపానికి జనకుడు, దైవ కుమారుని మరణానికి కారణమైన పాపాలకు ప్రత్యక్ష ప్రేరకుడు గనుక అతడు తప్పనిసరిగా అంతిమ శిక్ష అనుభవించాలని న్యాయచట్టం కోర్తున్నది. పరలోక గుడారంలో నుంచి పాపాల్ని తీసివేసి అంతిమ శిక్షను అనుభవించాల్సి వున్న సాతాను పై వాటిని మోపటంతో మానవ విమోచన నిమిత్తం పాపాల్ని తుడిచివేసే విశ్వాన్ని శుద్ధిపర్చే క్రీస్తు పరిచర్య సమాప్తమౌతుంది. ఛాయా రూపకమైన సేవలో ఆలయ పవిత్రతతోను విడిచి పెట్టాల్సి ఉన్న మేక పై పాపాన్ని ఒప్పుకోవటంతోను ఆలయ సాంవత్సరిక పరిచర్య ముగిసేది.PPTel 347.1

    ఈ విధంగా గుడార పరిచర్యలోను అనంతరం దాని స్థానాన్ని ఆక్రమించిన ఆలయ పరిచర్యలోను క్రీస్తు మరణాన్ని ఆయన సేవల్ని గూర్చిన సత్యాలు అనుదినం ప్రజలకు బోధించటం జరిగేది. క్రీస్తుకి సాతానుకి మధ్య జరుగుతున్న మహా సంఘర్షణ దేవుడు పాపాన్ని నిర్మూలించి విశ్వాన్ని శుద్ధీకరించటం పైన ప్రజల దృష్టిని సంవత్సరానికొకసారి కేంద్రీకరించటం జరిగేది.PPTel 347.2