Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    13—విశ్వాస పరీక్ష

    తనకు కుమారుణ్నిస్తానన్న దైవ వాగ్దానాన్ని అబ్రాహాము ఎలాంటి ప్రశ్నా లేకుండా విశ్వసించాడు. కాని ఆ వాగ్దానాన్ని దేవుడు తాను యోచించిన పద్ధతిలో సమయంలో నెరవేర్చేవరకూ ఆగలేదు. దేవుని మాట పైన శక్తి పైన అతని విశ్వాసాన్ని పరీక్షించటానికి వాగ్దానం నెరవేర్పులో జాప్యం జరిగింది. అందులో అతడు ఓడిపోయాడు. వృద్దురాలైన తనకు బిడ్డ కలగడం అసాధ్యమని భావించి దేవుని ఉద్దేశం నెరవేర్చటానికి తన బానిసల్లో ఒకరిని అబ్రాహాము ఉపపత్నిగా స్వీకరించాలన్న ప్రణాళికను శారా ప్రతిపాదించింది. బహు భార్యత్వం బహుగా వ్యాప్తి చెందిన ఆచారం కావటంతో అది పాపంగా కనిపించలేదు. అయినా అది ధర్మశాస్త్ర ఉల్లంఘనే. పవిత్రమైన కుటుంబ బంధాలకు కుటుంబంలోని శాంతికి అది గొడ్డలి పెట్టు. హాగరుతో అబ్రాహాము వివాహం తన కుటుంబానికి భావితరాల ప్రజలకూ కీడు చేసింది.PPTel 136.1

    అబ్రాహాము భార్యగా తనకు కొత్తగా కలిగిన స్థితిని బట్టి, అతని సంతతి ద్వారా రానున్న గొప్ప జాతికి తల్లినవుతానన్న నిరీక్షణను బట్టి హాగరు అహంకారంతోను అతిశయంతోను నిండి తన యజమానురాలు శారాను అవమానించింది. క్రితంలో ఆనంద సీమగా ఉన్న గృహంలో ఇప్పుడు ద్వేషం, అసూయ చేటుచేసుకున్నాయి. ఆ ఇరువురి ఫిర్యాదులు వినక తప్పని అబ్రాహాము కుటుంబ సామరస్యాన్ని పునరుద్ధరించటానికి విఫలయత్నం చేశాడు. శారా పదే పదే కోరినందువల్లనే అబ్రాహాము హాగరును పెండ్లి చేసుకోగా ఇప్పుడు పొరపాటు చేసింది అబ్రాహామేనని శారా అతణ్ని నిందించింది. హాగరును బహిష్కరించమని ఇప్పుడు శారా పట్టుపట్టింది. అందుకు అబ్రాహాము ఒప్పుకోలేదు. ఎందుకంటే హాగరు ఇప్పుడు తన బిడ్డలకు తల్లికాబోతున్నది. అతడే తన వాగ్దాత్త పుత్రుడని అబ్రాహాము నిరీక్షించాడు. ఆమె శారా బానిస. కనుక ఆమెనింకా శారా అదుపాజ్ఞల కిందే ఉంచాడు. తన అహంకారంవల్ల వచ్చిన కాఠిన్యాన్ని హాగరు జీర్ణించుకోలేక పోయింది. “శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారి” పోయింది.PPTel 136.2

    ఆమె అరణ్యంలోకి పారిపోయి ఒక నీటి బుగ్గ వద్ద ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ ఉండగా దేవుని దూత ఆమెకు మానవరూపంలో కనిపించాడు. ఆమెకు తన హోదాను గూర్చి విధిని గూర్చి జ్ఞాపకం చేయటానికి “శారయి దాసివైన హాగరూ” అని సంబోధించి “నీ యజమానురాలియొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుము” అని ఆ దూత ఆదేశించాడు. ఆ గద్దింపుతో ఆదరణను ఓదార్పును కలగలిపి ఇలా అన్నాడు, “ఇదిగో యెహోవా నీ మొరను వినెను” “నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవును”. దేవుని కృపను నిత్యము గుర్తు చేసే సంకేతంగా ఆమె తన కుమారుణ్ణి ఇష్మాయేలు, “చూచుచున్న దేవుడవు నీవే”, అని పిలవాలని దూత చెప్పాడు.PPTel 136.3

    అబ్రాహాముకి దాదాపుగా వంద సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తనకు కుమారుణిస్తానన్న వాగ్దానాన్ని దేవుడు పునరుద్ఘాటించి అతడు శారాకు పుట్టే కుమారుడని చెప్పాడు. అయినా అబ్రాహాముకి ఆ వాగ్దానం ఇంకా అర్థం కాలేదు. అతడి మనసు ఇష్మాయేలు మీదికిపోయి అతడి ద్వారానే దేవుని ఉద్దేశాలు, సంకల్పాలు నెరవేరాల్సి ఉన్నాయని భావించాడు. కుమారుడి పట్ల ప్రేమ పుట్టుకు వచ్చి “ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక ననుగ్రహించుము” అని దేవునితో అన్నాడు. పొరపాటుపడటానికి వీలులేని మాటలతో వాగ్దానాన్ని దేవుడు మళ్లీ ఇచ్చాడు. “శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదను” అయినప్పటికి తండ్రి చేసిన ప్రార్థనను గుర్తించకపోలేదు. “ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదగో నేనతనిని ఆశీర్వదించి.... అతని విస్తరింప జేసెదను ...... అతనిని గొప్ప జనముగా చేసెదను”.PPTel 137.1

    జీవిత కాలమంతా తాము కని పెట్టిన ఇస్సాకు జననం అబ్రాహాము శారాల గుడారాల్ని ఆనందోత్సాహాల్తో నింపింది. హాగరుకి మాత్రం ఇది గొప్ప ఆశాభంగం. తాను పెట్టుకున్న ఆశలకు తెరపడింది. ఇప్పుడు యువకుడైన ఇష్మాయేలుని అబ్రాహాము ఆస్తికి అతని వారసుడికి వాగ్దానం చేయబడ్డ ఆశీర్వాదాలకు హక్కుదారుడుగా శిబిరంలోని వారందరూ భావించారు. అర్థాంతరంగా అతడి కథ అడ్డం తిరిగింది. ఆశాభంగానికి గురి అయిన తల్లి, కొడుకులు ఇస్సాకును ద్వేషించారు. శిబిరమంతా వ్యక్తమవుతున్న ఆనందోత్సాహాలు వారిలో ద్వేషాన్ని మరింత పెంచాయి. అది ఇష్మాయేలు ఇస్సాకును బాహటంగా వెక్కిరించేవరకూ వచ్చింది. హాగరుని ఇష్మాయేలుని శిబిరంలోనుంచి పంపించి వేయమని శారా అబ్రాహాముని కోరింది. అది అబ్రాహాముకి తీవ్ర మనస్తాపం కలిగించింది. తాను అమితంగా ప్రేమించిన ఇష్మాయేలుని ఎలా బహిష్కరించగలడు? ఎటూతోచని ఆ పరిస్థితుల్లో నడుపుదలకోసం అబ్రాహాము దేవుని వద్దకు వెళ్లాడు. శారా కోరికను మన్నించమని దేవదూత ద్వారా దేవుడు అబ్రాహామును ఆదేశించాడు. ఇష్మాయేలు పట్లగాని హాగరుపట్లగాని తనకున్న ప్రేమ ఈ కార్యానికి అడ్డు తగలకూడదని తన కుటుంబంలో సామరస్య పునరుద్ధరణకు అదొక్కటే మార్గమని దేవుడు అతడికి స్పష్టం చేశాడు. తండ్రి గృహం నుంచి వేరైనా ఇష్మాయేలుని దేవుడు విడనాడలేదని అతణ్ని దేవుడు సంరక్షించి గొప్ప జనాంగానికి తండ్రిని చేస్తాడని ఓదార్పు కూర్చే వాగ్దానాన్ని దూత అందించాడు. అబ్రాహాము దేవదూత చెప్పిన ప్రకారం చేశాడు. కాని అతని హృదయం దు:ఖంతో నిండింది. హాగరుని తన కుమారుణ్ని పంపి వేసేటప్పుడు అబ్రహాము ఎంతో క్షోభించాడు.PPTel 137.2

    వివాహ బాంధవ్య పరిశుద్ధత విషయమై అబ్రాహాముకి వచ్చిన ఉపదేశం అన్ని యుగాల ప్రజలకూ గొప్ప గుణపాఠం. ఈ బాంధవ్యంలో ఇమిడి ఉన్న హక్కుల్ని, ఆనందాల్ని గొప్ప త్యాగంతోనైనా - జాగ్రత్తగా కాపాడుకోవాలని అది ప్రకటిస్తున్నది. అబ్రహాముకి నిజమైన భార్య శారా మాత్రమే. భార్యగా, తల్లిగా ఆమె హక్కుల్ని ఎవరికీ పంచటానికి లేదు. ఆమె తన భర్తను గౌరవించింది. ఈ విషయంలో నూతన నిబంధనలో ఆమెను యోగ్యమైన ఆదర్శంగా పేర్కొనటం జరిగింది. అయితే అబ్రాహాము తన అనురాగాల్ని ఇంకొక స్త్రీకివ్వటం ఆమెకు సమ్మతం కాలేదు. ఆ స్త్రీ బహిష్కరణను కోరినందుకు శారాను దేవుడు గద్దించలేదు. అబ్రాహాము శారాలిరువురూ దేవున్ని విశ్వసించలేదు. ఆ అవిశ్వాసమే హాగరుతో అబ్రాహాము వివాహానికి దారితీసింది.PPTel 138.1

    విశ్వాసులకు తండ్రిగా ఉండేందుకు దేవుడు అబ్రాహామును పిలిచాడు. ముందు తరాల ప్రజలకు అతడి జీవితం విశ్వాసానికి ఆదర్శంగా ఉండాలని దేవుడు ఉద్దే శించాడు. శారా తన భార్య అన్న సత్యాన్ని మరుగుపర్చటంలో హాగరును వివాహం చేసుకోవటంలో అతడు దేవుని మాటను సందేహించినట్లు నిరూపించుకున్నాడు. అబ్రాహాము అత్యున్నత ప్రమాణాన్ని చేరుకొనేందుకుగాను దేవుడు అతణ్ని ఇంకో పరీక్షకు గురిచేశాడు. అది మానవుడు ఎన్నడూ కనీవినీ ఎరుగనంత తీవ్రమైన కఠిన పరీక్ష. మోరీయా దేశానికి వెళ్లి అక్కడ తాను చూపించనున్న కొండపై తన కుమారుణ్ని దహన బలిగా అర్పించాల్సిందిగా రాత్రి దర్శనంలో అబ్రాహామును దేవుడు ఆదేశించాడు.PPTel 138.2

    ఈ ఆదేశం వచ్చిన తరుణంలో అబ్రాహాము వయసు నూట ఇరవై సంవత్సరాలు. తన తరంలో సైతం అబ్రాహాము వృద్దుడుగా పరిగణించబడ్డాడు. కఠిన పరిశ్రమను భరించటానికి, అపాయంలో సాహసం చూపించటానికి అబ్రాహాము తన యౌవన కాలంలో దేహ దారుడ్యం కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు తన యౌవన ఉత్సాహం ఉడిగిపోయింది. యౌవ్వనంలో ఉన్న వ్యక్తి ధైర్యంగా ముందుకుపోవచ్చు. పెరిగిన వయసులో అడుగులు సమాధి దిశలో తడబడున్న సమయంలో శ్రమలు, కష్టాల్ని భారం అధికమై ఆందోళన నుంచి శ్రమనుంచి విశ్రాంతి కోరుతున్న తరుణంలో అబ్రాహాముకి తన చివరి పరీక్ష పెట్టాలని దేవుడు నిశ్చయించుకొన్నాడు.PPTel 138.3

    పితరుడు అబ్రాహాము ధన ధాన్య సంపదల నడుమ పేరు ప్రతిష్ఠలతో బెయేరైబాలో నివసిస్తున్నాడు. భాగ్యవంతుడు, ఆ దేశ పరిపాలకులు మహారాజు గుర్తించి గౌరవించినవాడు. అబ్రాహాముకి చెందిన వేలాది గొర్రెలు, పశువులు ఆ చుట్టుపట్ల మైదానాన్నిటిలో విస్తరించి ఉన్నాయి. ఏ దిక్కుకి చూస్తే అక్కడ తన ఆశ్రితుల, నౌకరుల గుడారాలే కనిపించాయి. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు తన కళ్లముందే పెరిగి యువకుడయ్యాడు. ఓరిమితో దీర్ఘకాలం నెరవేరని నిరీక్షణలో గడిచిన జీవితాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించినట్లు కనిపించింది.PPTel 139.1

    తన విశ్వాసాన్ని అనుసరించటంలో అబ్రాహాము స్వదేశం విడిచి పెట్టాడు. తండ్రుల్ని, తాతల సమాధుల్ని, బంధుజనాన్ని విడిచి పెట్టి దూరంగా వెళ్లిపోయాడు. తాను స్వాస్థ్యంగా పొందనున్న దేశంలో పరదేశిగా సంచరించాడు. వాగ్రత్త వారుసుడి జననం కోసం సుదీర్ఘకాలం కని పెట్టాడు. దేవుని ఆదేశం మేరకు తన కుమారుడు ఇష్మాయేలును పంపివేశాడు. కాగా తాను ఎంతోకాలంగా ఆశించి పొందిన కుమారుడు యౌవనంలోకి అడుగు పెడున్న దశలో ఆ పితరుడు తన నిరీక్షణ సాకారమౌతున్నట్లు భావిస్తున్న సమయంలో అన్ని పరీక్షలనూ మించిన అతి తీవ్ర పరీక్ష అతడి ముందు నిలిచింది.PPTel 139.2

    ఆ ఆదేశం ఆ తండ్రి హృదయాన్ని పట్టి పిండివేసే ఈ మాటల్లో వినిపించింది : “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును ... దహన బలిగా అతన్ని సమర్పించుము”. ఇస్సాకు అతడి ఇంటి దీపం. వృద్ధాప్యంలో అతడికి ఆదరణ. మరీ ముఖ్యంగా అతడి వాగ్దత్త ఆశీర్వాదానికి వారసుడు. అలాంటి కుమారుణ్ణి ప్రమాదంలోనో, వ్యాధివల్లో కోల్పోవటం ప్రేమగల తండ్రికి తీవ్ర మనోవేదన కలిగించి ఉండేది. అతడి తెల్లని తలను దు:ఖ భారంతో కుంగదీసి ఉండేది. కాని ఆ కుమారుడి రక్తాన్ని తన సొంత చేతుల్తో చిందించమని అతడికి దేవుని ఆదేశం.PPTel 139.3

    “నరహత్య చేయకూడదు” అని దైవ ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తున్నది, ఒకప్పుడు తాను నిషేధించినది దేవుడు కోరాడు. అందుచేత తాను మోసపోతున్నాడని అబ్రాహాముకి సాతాను సలహా చెప్పాడు. తన గుడారం వెలుపలకి వెళ్లి, నిర్మల ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలకు మల్లే తన సంతానం లెక్కకు మించి ఉంటుందని అప్పటికి ఏభై సంవత్సరాల క్రితం దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకొన్నాడు. ఈ వాగ్దానం ఇస్సాకు ద్వారా నెరవేరాల్సి ఉంటే ఇస్సాకు మరణించటం ఎలా సాధ్యపడుంది ? తాను నిజంగా మోసపోతున్నానేమోనన్న సందేహానికి అబ్రాహాము గురిఅయ్యాడు. ఆ సందిగ్ధతలో ఆ హృదయ వేదనతో నేల పై మోకాళ్లుని తనకు వచ్చిన భయంకర ఆదేశాన్ని తాను ఆచరించాల్సి ఉంటే దాన్ని ధ్రువపర్చాల్సిందిగా ప్రార్థన చేశాడు. సొదొమను నాశనం చేయటానికి దేవుడు సంకల్పించినప్పుడు అది తనకు తెలుపటానికి దూతలు రావటం, ఈ ఇస్సాకు జననాన్ని గూర్చిన దైవ వాగ్దానాన్ని వారు తనకు అందించటం అబ్రాహాము గుర్తుచేసుకొని దైవ దూతలు కనిపిస్తారన్న ఆశతో ఏమైనా సమాచారం అందిస్తారేమోనన్న భ్రమతో తాను అనేకసార్లు దూతల్ని కలిసిన స్థలానికి వెళ్లాడు. కాని ఎవరూ కనిపించలేదు. తనను చీకటి మూసివేసినట్లనిపించింది. కాని దేవుని ఈ ఆదేశం తన చెవుల్లో గింగురుమంటున్నది, “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును...” ఆ ఆదేశాన్ని ఆచరించి తీరాలి. ఆలస్యం చేయటానికి వీలులేదు. తెల్లవారుతున్నది. అబ్రాహాము పయనమై వెళ్లాలి.PPTel 139.4

    అబ్రాహాము తన గుడారానికి తిరిగివచ్చి ఇస్సాకు ప్రశాంతంగా నిద్రిస్తున్న స్థలానికి వెళ్లాడు. కుమారుడి ముఖాన్ని కొద్దిసేపు చూసి వణుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిద్రపోతున్న శారా పక్కకు వెళ్లి నిలబడ్డాడు. కొడుకుని కౌగిలించుకొనేందుకు ఆమెను లేపటమా? తన హృదయ భారాన్ని ఆమె ముందు పెట్టి ఆ భయంకర బాధ్యతను ఆమెతో పంచుకోవాలనుకున్నాడు. కాని ఆ కార్యాన్ని నిర్వహించకుండా ఆమె తనను అడ్డగిస్తుందని భయపడ్డాడు. ఆమె ఆనందం అతిశయం ఇస్సాకే. ఆమె ప్రాణం కొడుకు ప్రాణంతో ముడిపడి ఉన్నది. ఆ తల్లి ప్రేమ బలి అర్పణను తిరస్కరించవచ్చు.PPTel 140.1

    చివరికి అబ్రాహాము కొడుకుని లేపి దూరాన ఒక కొండపై బలి అర్పణకు వచ్చిన ఆదేశం గురించి అతడికి చెప్పాడు. అబ్రాహాము సంచార జీవితంలో ఇస్సాకు తన తండ్రి నిర్మించిన ఏదో బలిపీఠం వద్ద తండ్రితో కలిసి ఆరాదించడానికి తరచుగా వెళ్లేవాడు. ఈ ఆదేశం అతడికి ఆశ్చర్యం కలిగించలేదు. ఆ ప్రయాణానికి అవసరమైన సిద్ధబాటు పూర్తి అయ్యింది. కట్టెల్ని సమకూర్చి గాడిద మీద పెట్టి ఇద్దరు సేవకుల్ని తీసుకొని బయలుదేరారు.PPTel 140.2

    తండ్రీ కొడుకులు జతగా నిశ్శబ్దంగా నడిచివెళ్తున్నారు. తన మనసులో ఉన్న రహస్యం గురించి ఆలోచిస్తూ అబ్రాహాము మాట్లాడలేదు. అతడి తలంపులు తల్లి శారా పైన ఇస్సాకులేకుండా ఆమె వద్దకు తాను వెళ్లాల్సిన సమయం పైన నిలిచాయి. కుమారుడి ప్రాణాలు తీసే కత్తే తల్లి ప్రాణాలు తీస్తుందని అతడికి బాగా తెలుసు.PPTel 140.3

    ఆకాశం పొడవుగా ఉన్నట్లు గంటలు నెమ్మదిగా గడుస్తున్నట్లు అబ్రాహాముకి అనిపించింది. ఇస్సాకు తక్కిన యువకులు నిద్రలో ఉండగా అబ్రాహాము ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. పరలోకంనుంచి దూత వచ్చి ఆ పరీక్ష సరిపోతుందని ఇస్సాకు ఏ హానీ లేకుండా తన తల్లి బాహుబంధంలోకి తిరిగి వెళ్లిపోవచ్చునని చెప్పుతాడని అబ్రాహాము ఇంకా నిరీక్షిస్తున్నాడు. కాని ఆందోళనతో నిండిన అతడి ఆత్మకు శాంతి దొరకలేదు. భారమైన మరో దినం గడిచింది. తనను సంతాన రహితంగా మిగిల్చే ఆనతి తన చెవుల్లో మోగుతుండగా అబ్రాహాము వినయ ప్రార్థనలో మరో రాత్రి గడిపాడు. సందేహాలు పుట్టించటానికి అపనమ్మకం పెంచటానికి సాతాను దగ్గరగా సిద్ధంగా ఉన్నాడు. అయితే అతడి సలహాలు, సూచనల్ని అబ్రాహాము తోసిపుచ్చాడు. మూడో రోజు ప్రయాణం ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఉత్తర దిశగా చూస్తున్న పితరుడికి దేవుడు వాగ్దానం చేసిన చిహ్నం అయిన మహితో ప్రకాశించే మేఘం మోరియా పర్వతం పై కనిపించింది. ఆకాశంలో నుంచి తనకు వినిపించిన స్వరం దేవుని స్వరమని అబ్రాహాము గ్రహించాడు. PPTel 140.4

    ఈ దశలో సైతం అబ్రాహాము దేవుని మీద సణుగుకోలేదు. కాని ప్రభువు దయాళు త్వం గురించి విశ్వసనీయతను గురించి ఉన్న నిదర్శనాలను జ్ఞాపకం చరేసుకొని తన ఆత్మను బలోపేతం చేసుకొన్నాడు. తాను కనిపెట్టని వయసులో దేవుడు ఆ కుమారుణ్ని ఇచ్చాడు. మరి ఆ ప్రశస్తమైన ఈవి నిచ్చిన ఆ ప్రభువుకి దాన్ని తిరిగి తీసుకొనే హక్కు లేదా? అనుకొన్నాడు. ఆ తరుణంలో “ఇస్సాకు ద్వారా నీ సంతానం” సముద్రతీరాన ఇసుక రేణువుల్లా విస్తారంగా ఉంటాదన్న దైవ వాగ్దానాన్ని విశ్వాసం పునరుద్ఘాటించింది. ఇస్సాకు సూచక క్రియవల్ల జన్మించిన కొడుకు. అతణ్ని ఇచ్చిన శక్తి అతడి ప్రాణాన్ని పునరుద్ధరించలేదా? కంటికి కనిపించే దాన్ని అధిగమించి చూస్తూ అబ్రాహాము ఈ లేఖన వాక్యంలోని భావాన్ని గ్రహించాడు, “మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు” హెబ్రీ. 11:19.PPTel 141.1

    కుమారుణ్ణి మరణానికి అప్పగించటంలో ఎంత గొప్ప త్యాగం ఉన్నదో దేవునికన్నా బాగా గ్రహించగలవారు ఎవరూ ఉండరు. తన వీడ్కోలు దృష్యాన్ని దేవుడు తప్ప ఇంకెవ్వరూ చూడకూడదని అబ్రాహాము భావించాడు. “నేనును, ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి” తన సేవకుల్ని అక్కడే ఉండమని ఆదేశించాడు. కట్టెలు ఇస్సాకుకి ఎత్తి కత్తి నిప్పు తాను తీసుకొని అబ్రాహాము ఇస్సాకులు పర్వత శిఖరం ఎక్కుతున్నారు. గొర్రెపిల్ల ఎక్కడ నుంచి వస్తాడా అని ఇస్సాకు తనలో తాను అనుకొంటున్నాడు. చివరగా “నా తండ్రీ... నిప్పును, కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱపిల్ల ఏది?” అని అడిగాడు. ఇది ఎంత తీవ్ర పరీక్ష! “నా తండ్రీ” అని ప్రేమగా పిలిచిన పిలుపు అబ్రాహాము హృదయాన్ని బద్దలు కొట్టింది. ఆ సంగతిని ఇస్సాకునుంచి ఇంకా దాచి ఉంచాడు. “నా కుమారుడా, దేవుడే దహనబలికి గొట్టె పిల్లను చూచుకొనును” అన్నాడు.PPTel 141.2

    నిర్ణీత స్థలంలో వారు బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు పేర్చారు. అప్పుడు వణుకుతున్న స్వరంతో దేవుని వర్తమానాన్ని అబ్రాహాము కుమారుడికి బయలు పర్చాడు. తనకు జరుగనున్న దాన్ని గురించి ఇస్సాకు భయంతో విస్మయంతో విన్నాడు. కాని దాన్ని వ్యతిరేకించటంగాని, ప్రతిఘటించడంగాని ఇస్సాకు చేయలేదు. అనుకుంటే తప్పించుకొని వెళ్లిపోయేవాడే. మూడు దినాల ప్రయాణం వల్ల అలసి పోయిన వృద్ధుడు యౌవనబలంతో ఉన్న యువకుణ్ణి అడ్డుకోలేకపోయేవాడే. కాని ఇస్సాకు బాల్యం నుంచి విధేయత నేర్చుకున్నాడు. తండ్రి దేవుని చిత్తాన్ని తన ముందు పెట్టినప్పుడు ఆ కార్యానికి మనస్ఫూర్తిగా తన్ను తాను సమర్పించుకున్నాడు. అబ్రహాము విశ్వాసాన్ని అతడు కూడా పంచుకొన్నాడు. తన ప్రాణాన్ని దేవునికి కానుకగా అర్పించటానికి పిలుపు పొందటం గొప్ప గౌరవంగా పరిగణించాడు. దు:ఖంతో కుమిలిపోతున్న తండ్రిని ఓదార్చి తనను బలిపీఠానికి బంధించటానికి చేతులు రాని తండ్రికి ధైర్యం చెప్పాడు.PPTel 142.1

    తండ్రీ కొడుకులు చివరిసారిగా ప్రేమ ఉట్టిపడే మాటలు పలుకుకున్నారు. చివరి కన్నీళ్లు కార్చుకున్నారు. చివరి కౌగిలింతలు ఇచ్చిపుచ్చుకున్నారు. కొడుకుని ఖండించటానికి తండ్రి కత్తి ఎత్తాడు. ఎత్తిన ఆ చెయ్యి అర్థాంతరంగా ఆగిపోయింది. దేవుని దూత ఆకాశంలోనుంచి “అబ్రాహామా, అబ్రాహామా” అని పిలిచాడు. వెంటనే అతడు “చిత్తము ప్రభువా” అన్నాడు. “ఆ చిన్నవాని మీద చెయ్య వేయకుము. అతని నేమియు చేయకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువానివని యిందువలన నాకు కనబడుచున్నది” అన్న స్వరం అబ్రాహాముకు మళ్లీ వినిపించింది.PPTel 142.2

    అప్పుడు అబ్రాహాము “పొదలో కొమ్ములు తగులుకొని యున్న ఒక పొట్టేలు”ను చూశాడు. అబ్రాహాము తక్షణమే వెళ్లి ఆ నూతన బలి పశువును తీసుకొని వచ్చి “తన కుమారుణ్ణి మారుగా” దానిని అర్పించాడు. సంతోషంతోను, కృతజ్ఞతతోను నిండిన అబ్రాహాము ఆ పవిత్ర స్థలానికి “యెహోవా యీరే” “దేవుడే ... చూచుకొనును” అన్న కొత్త పేరు పెట్టాడు .PPTel 142.3

    మోరీయా పర్వతం మీద దేవుడు తన నిబంధనను అబ్రాహాముతో మళ్లీ ఖరారు చేసి అతడికి భావితరాల్లో అతడి సంతతికి దీవెనలు వాగ్దానం చేశాడు : “నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నాతోడని ప్రమాణము చేయుచున్నాను”.PPTel 142.4

    అబ్రాహాము తాలూకు ఈ అపూర్వ విశ్వాస క్రియ తర్వాతి తరాల్లోని దేవుని బిడ్డల మార్గాన వెలుగు విరజిమ్మే దీప స్తంభంలా నిలిచి ఉంటుంది. అబ్రాహాము దేవుని చిత్తం నెరవేర్చకుండా తప్పించుకోటానికి ప్రయత్నించలేదు. సంశయించాలనుకొని ఉంటే తాను ప్రయాణం చేసిన మూడు రోజుల్లో విశ్లేషించుకోవటానికి సందేహించ టానికి చాలినంత సమయం ఉన్నది. కుమారుణ్ణి వధించటం తనను నరహంతకుణ్ణి రెండో కయీనునీ చేస్తుందనీ, తిరస్కరించి ద్వేషించటానికి కారణమై తన బోధలు తన సోదర ప్రజలకు మేలు చేసే తరుణాన్ని తనకు లేకుండా చేస్తుందని అబ్రాహాము సమర్థించు కోగలిగి ఉండేవాడే. తన వయసు మిషనతో ఆ కార్యాచరణ నుంచి విముక్తి కోరేవాడే. కాని అబ్రాహాము ఈ సాకుల్లో ఏ ఒక్కదాన్ని అడ్డం పెట్టుకోలేదు. అబ్రాహాము మానవుడు. అతడి ఉద్రేకాలు అనుబంధాలు మనకున్నలాంటివే. అయినా, ఈసాకును వధిస్తే వాగ్దానం ఎలా నెరవేర్తుందని ప్రశ్నించదలచుకోలేదు. బాధతో రోదిస్తున్న తన హృదయం చెబుతున్నది వినటానికి ఆగలేదు. దేవుడిచ్చే ఆజ్ఞలన్నిటిలోను ఆయన న్యాయవంతుడునూ నీతిమంతుడునూ అని అతడికి తెలుసు. అందుకే ఆయన ఆజ్ఞను తు.చ. తప్పకుండా ఆచరించాడు.PPTel 143.1

    “అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను... మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను”. యాకోబు 2:23. పౌలు ఇలా అంటున్నాడు, “విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకొనుడి”. గలతి 3:7 అయితే అబ్రాహాము తన విశ్వాసం క్రియల ద్వారా కనపర్చాడు. “మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పుపొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగుజే సెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?” యాకోబు 2:21, 22. విశ్వాసం క్రియల మధ్యగల సంబంధాన్ని అవగాహన చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు. “క్రీస్తు మీద మాత్రమే విశ్వాసముంచుడి. అప్పుడు మీరు క్షేమముగా ఉండగలరు. మీరు ఆజ్ఞలు కాపాడవలసిన పనిలేదు” అని వారంటారు. కాని యధార్థ విశ్వాసం క్రియాచరణలో వ్యక్తమవుతుంది. విశ్వసించని యూదులతో క్రీస్తు ఈ మాటలన్నాడు, “మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు”, యోహాను 8:39. విశ్వాసుల తండ్రిని గురించి ప్రభువిలా అన్నాడు, “అబ్రాహాము నా మాటవిని నేను విధించినదాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెను”. ఆదికాండము 26:5. “విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును” అంటున్నాడు యాకోబు. యాకోబు 2:17. ప్రేమ గురించి సంపూర్తిగా చెబుతున్న యోహాను ఇలా అంటున్నాడు, “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” 1 యోహాను 5:3.PPTel 143.2

    ముంగుర్తులు వాగ్దానాల ద్వారా దేవుడు “అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను” గలతీ 3:8. కనుక ఆ పితరుడి విశ్వాసం రానున్న విమోచకుడి మీద కేంద్రీకృతమయ్యింది. యూదులనుద్దేశించి యేసు ఈ మాటలన్నాడు, “మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను”, యోహాను 8:56. ఇస్సాకుకి మారుగా బలి అయిన పొట్టేలు మన బదులు బలికానున్న దైవ కుమారుడు క్రీస్తును సూచించింది. మానవుడు దైవ ధర్మశాస్త్రం మీరి మరణ పాత్రుడైనప్పుడు తండ్రి తన కుమారునివంక చూస్తూ “విమోచకుణ్ణి కనుగొన్నాను. నీవు జీవించు” అని పాపితో అన్నాడు.PPTel 144.1

    కుమారుణ్ణి బలి ఇవ్వాల్సిందిగా అబ్రాహామును దేవుడు కోరటంలో అతనికి సువార్త వాస్తవికతను గూర్చిన అవగాహన కలిగించటం అతని విశ్వాసాన్ని పరీక్షించటం ఆయన పరమోద్దేశం. ఆ భయంకర పరీక్షకాలంలో అతడు పొందిన హృదయ వేదనను దేవుడు అనుమతించాడు. ఎందుకంటే మానవుల రక్షణ నిమిత్తం దేవుడు చేసిన త్యాగాన్ని కొంతమట్టుకు అతడు గ్రహించాలన్నది ఆయన ఉద్దేశం. కుమారుణ్ణి బలి ఇవ్వటం కలిగించినంత గుండెకోత అబ్రాహాముకి మరే పరీక్ష కలిగించి ఉండకపోవచ్చును. అబ్రాహాము తన కుమారుని తీవ్ర బాధతో సిగ్గుతో మరణించడానికి దేవునికి అర్పించాడు. ఇస్సాకు అర్పణ విషయంలో అడ్డుకొన్నట్లు దైవ కుమారుని అవమానాన్ని, హృదయ వేదనను చూసిన దేవదూతలు అడ్డుకోవటానికి తండ్రి అనుమతించలేదు. “ఇంతమట్టుకు చాలును” అనే స్వరం లేదు. పతన మొందిన మానవ జాతిని రక్షించటానికి మహిమ ప్రభువు తన ప్రాణం అర్పించాడు. మనపట్ల దేవుని మితిలేని కృపకు ప్రేమకు ఇంతకన్నా బలమైన నిదర్శనం ఏముంటుంది? “తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” రోమా 8:32.PPTel 144.2

    దేవుడు అబ్రాహాము నుంచి కోరిన త్యాగం కేవలం తన మేలు కోసమో లేక భావితరాల వారి మేలుకోసమో ఉద్దేశించింది కాదు. అది పరలోకంలోను ఇతర లోకాల్లోను ఉన్న పాపరహిత నివాసులకు ఉపదేశం కలిగేందుకు ఉద్దేశించింది. క్రీస్తుకి సాతానుకి మధ్య జరిగే సంఘర్షణ రంగం -- రక్షణ ప్రణాళిక ఎందుకు ఏర్పాటయ్యిందో ఆ కార్యనిర్వహణ రంగం - విశ్వమంతటికి పాఠ్యపుస్తకం. దైవ వాగ్దానాల విషయంలో అబ్రాహాము విశ్వాసం కనపర్చలేదు గనుక నిబంధన షరతుల్ని నెరవేర్చటంలో అతడు విఫలమయ్యాడని అందుచేత ఆ నిబంధనవల్ల కలిగే లబ్ధికి అతడు అనర్హుడని దేవ దూతల ముందు దేవునిముందు సాతాను వాదించాడు. తాను సంపూర్ణ విధేయతను మాత్రమే అంగీకరిస్తానని చూపించటానికి, పరలోక నివాసులకు రక్షణ ప్రణాళికను మరింత విపులంగా బయలు పర్చటానికి వారందరి ముందు తన సేవకుడు అబ్రాహాము భక్తిని, విశ్వసనీయతను నిరూపించాలని దేవుడు ఉద్దేశించాడు.PPTel 144.3

    అబ్రాహాము విశ్వాస పరీక్షకు ఇస్సాకు విధేయత పరీక్షకు గురియైన దృశ్యానికి పరలోక దూతలు సాక్షులు. ఆ పరీక్ష ఆదాముకు వచ్చిన పరీక్ష కన్నా కఠినాతి కఠినమైన పరీక్ష. మన ఆది తల్లిదండ్రులపై దేవుడు విధించిన నిషంలో బాధగాని, శ్రమగాని లేదు. అబ్రాహాముకి వచ్చిన ఆదేశం అయితే బాధాకరమైన త్యాగాన్ని కోరింది. అబ్రాహాము చూపించిన అచంచలమైన విధేయతను పరలోకమంతా విస్మయంతో మెచ్చుకోలుగా వీక్షించింది. అతడి విశ్వసనీయతను పరలోకమంతా ప్రశంసించింది. సాతాను మోపిన నిందలన్నీ అబద్దాలని తేలింది. “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని (సాతాను నిందలు మోపుతున్నా) యిందువలన నాకు కనబడుచున్నది” అని ప్రభువు అబ్రాహాముతో చెప్పాడు. దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన విధేయతకు గొప్ప ప్రతిఫలం ఉంటుందని తక్కిన లోకాల నివాసులముందు ధ్రువపర్చింది.PPTel 145.1

    రక్షణ మర్మాన్ని అనగా పరలోక సైన్యాలకు అధిపతి అయిన దైవకుమారుడు పాప మానవుల నిమిత్తం మరణించటమన్న మర్మం దేవదూతలు సైతం గ్రహించటం కష్టం. తన కుమారుణ్ణి బలి ఇవ్వవలసిందిగా అబ్రాహాముకి ఆజ్ఞ వచ్చినప్పుడు పరలోక నివాసులందరూ ఆసక్తితో కని పెట్టారు. ఈ ఆజ్ఞ ఆచరణ పురోగతిని ఆతృతగా పరిశీలించారు. “దహన బలికి గొట్టె పిల్ల ఏది?” అని ఇస్సాకు అడిగిన ప్రశ్నకు “దేవుడే బలికి గొట్టెపిల్లను చూచుకొనును” అని అబ్రాహాము బదులు చెప్పినప్పుడు, కుమారుణ్ణి వధించటానికి పైకెత్తిన తండ్రి చేతిని దూత ఆపినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసిన పొట్టేలు ఇస్సాకుకు మారుగా బలి అయినప్పుడు - అప్పుడు విమోచన మర్మం పై వెలుగు ప్రకాశించింది. మానవుల రక్షణ నిమిత్తం దేవుడు చేసిన అద్భుతమైన ఏర్పాటును దేవదూతలు సహితం స్పష్టంగా అవగాహన చేసుకొన్నారు.PPTel 145.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents